సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులపై రేట్ల భారం తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిర్మాణానికి అవసరమైన సామగ్రిని మార్కెట్ కంటే తక్కువ ధరలకు సర్కార్ సమకూరుస్తోంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కంపెనీల సిమెంట్ బస్తా ధర ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి రూ. 310 నుంచి రూ. 450 వరకూ ఉంది.
ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు ప్రభుత్వం మార్కెట్ ధరల కంటే చాలా తక్కువకు సిమెంట్ సరఫరా చేస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంల్లో పోర్ట్‌ల్యాండ్ పోజోలానా సిమెంట్ (పీపీసీ) బస్తా రూ. 235 కు, ఆర్డినరీ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ (ఓపీసీ) బస్తా రూ. 245కు సరఫరా చేస్తున్నారు. మిగిలిన పది జిల్లాల్లో పీపీసీ బస్తా రూ. 225కు, ఓపీసీ రూ. 235 చొప్పున అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో సిమెంట్ తయారీ ఫ్యాక్టరీలు లేకపోవడంతో రవాణా ఖర్చులు అధికంగా ఉండటం వల్ల స్వల్ప వ్యత్యాసం ఉంటోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కిలో ఐరన్‌ను రూ. 62 నుంచి 64లతో అందిస్తున్నారు.
90 బస్తాల సిమెంట్.. 480 కిలోల ఐరన్
ఒక్కో ఇంటి నిర్మాణానికి 90 బస్తాల సిమెంట్, 480 కిలోల ఐరన్‌తో పాటు 14 రకాల నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేస్తోంది. అదే విధంగా ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. డోర్లు, కిటికి ఫ్రేమ్‌లు, ఇతర వస్తువులను తమ అభిరుచులకు అనుగుణంగా స్థానికంగా కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ వస్తువులను కూడా ఎవరైనా కావాలని అడిగితే అధికారులు సరఫరా చేస్తున్నారు. సిమెంట్, ఐరన్‌లో సబ్సిడీ ఇస్తుండటంతో ఒక్కో లబ్ధిదారుడిపై రూ. 14 వేల నుంచి రూ. 20 వేలు వరకూ ఆర్థిక భారం తగ్గుతోంది. ఈ డబ్బు ఇంటిపై ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవడానికి వీలు కలుగుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు.
ఆర్థిక భారం తగ్గింది
నేను భవన నిర్మాణ కార్మికుడిని. ప్రభుత్వం స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించింది. నేనే స్వయంగా నా ఇంటిని నిర్మించుకుంటున్నాను. ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చిన సిమెంట్, ఐరన్ తీసుకున్నాను. సబ్సిడీ కింద ప్రభుత్వం సిమెంట్, ఐరన్, ఉచితంగా ఇసుక సరఫరా చేయడంతో ఆర్థిక భారం తప్పింది.
– డి. నాని, లబ్ధిదారుడు బాపట్ల, గుంటూరు జిల్లా
ముందుగానే ఇండెంట్ తీసుకుంటున్నాం
సిమెంట్, ఇసుక, ఐరన్ సరఫరాకు లబ్ధిదారుల నుంచి ముందే ఇండెంట్ తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించాం. ఏఈలు ఇండెంట్ పెట్టిన వెంటనే పైస్థాయి అధికారులు వస్తువుల సరఫరాకు అనుమతులు ఇస్తున్నారు. ఎక్కడా కొరత రాకుండా భవిష్యత్ అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుతున్నాం.
– నారాయణ భరత్ గుప్తా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment