ఆర్టీసీ సేవలు అందరికీ అందుబాటులో ఉండాలనే.. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఆర్టీసీ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నాని, ఆర్టీసీ ఎండీ తిరుమలరావు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా తదితరులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డీజిల్ ధరలు పెరిగి ఆర్టీసీకి నష్టాలు వస్తున్నా రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చడం కోసం టిక్కెట్ ధరలు ఒక్క పైసా కూడా పెంచడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుముఖంగా లేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ప్రజలపై భారం పడకూడదనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు టికెట్ ధరలు పెంచలేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆర్టీసీ డిపో గ్యారేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ పెట్రోల్ బంక్‌ను శుక్రవారం ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం తప్ప ప్రజలపై భారం మోపడం లేదన్నారు. ఇందులో భాగంగానే ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆర్టీసీ బంకుల్లో కేవలం డీజిల్, పెట్రోల్ మాత్రమే కాక నమ్మకం, భరోసా కూడా లభిస్తుందన్నారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాల్లో ఆర్టీసీలు నష్టాల్లో ఉండగా మన రాష్ట్రంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయన్నారు.
దేశంలోనే ప్రప్రథమంగా ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, డీఐజీ కేవీ మోహనరావు, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
‘సంఘాల’ గుర్తింపు నిబంధనల సమీక్షకు కమిటీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో వివిధ ఉద్యోగ సంఘాల గుర్తింపు నియమ నిబంధనలను సమీక్షించేందుకు అధికారులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఏపీ సివిల్ సర్వీసెస్ 2001 నిబంధనల ప్రకారం ఉద్యోగ సంఘాలకు గుర్తింపు లేదా గుర్తింపు ఉపసంహరణ అమల్లో ఉంది. అయితే, ఈ నియమ నిబంధనలను సమీక్షించడంతో పాటు అవసరమైన మార్పులు, చేర్పులు, కొత్త నిబంధనలు తీసుకురావడంపై అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక సీఎస్ అధ్యక్షతన రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వివిధ సంఘాల ప్రతినిధులు, నిపుణులతో చర్చించి వీలైనంత త్వరగా సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment