సాక్షి, అమరావతి: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దాఖలైన వ్యాజ్యంపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం విచారించింది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈనెల 20 కి వాయిదా వేసింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించాలంటే.. సమాచారం ఏ సోర్స్ నుంచి వచ్చిందనేది చాలా ముఖ్యమైన అంశమని ప్రభుత్వ న్యాయవాదులు అంతకు ముందు కోర్టుకు తెలిపారు.
ఈ పిల్‌ను చూస్తే ఏదో చిన్నపిల్లల వ్యవహారంలా ఉందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద హైకోర్టు జడ్జి మీడియాతో మాట్లాడినట్టుగా కథనం ప్రచురించారని, తమకు తెలిసినంత వరకు హైకోర్టు జడ్జి ఎవరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ మీడియా సంస్థతోనూ మాట్లాడలేదని నమ్ముతున్నట్టు కోర్టుకు విన్నవించారు. కాబట్టి.. ఈ కథనం అంతా అసహనంతో నిండిన కథనంగా వారు పేర్కొన్నారు. చట్ట ధిక్కరణకు పాల్పడుతూ కథనం రాశారని స్పష్టం చేశారు.
(చదవండి: ట్యాపింగ్ శుద్ధ అబద్ధం)
ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం పరువునష్టం నోటీసు ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. చట్టపరమైన చర్యలకు సన్నద్ధమైందని వెల్లడించారు. ఈ కేసులో కథనాన్ని ప్రచురించిన మీడియా సంస్థను కూడా పార్టీని చేయండని న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ట్యాపింగ్ మీద వారికి ఎక్కడ నుంచి సమాచారం వచ్చింది? వారు ఈ కథనాన్ని ఎలా రాశారు? వారితో జడ్జి మాట్లాడి ఉంటే ఏం చెప్పారో కోర్టుకు చెప్పాలని అన్నారు. ‘జడ్జిల కదలికలపై నిఘా పెట్టారంటూ.. ఒక సీనియన్ ఐపీఎస్ అధికారి చెప్పారని పిటిషనర్ చెప్తున్నారు. ఆ వివరాలను పొందుపరుస్తూ అఫడవిట్ వేయమని కోర్టు ఆదేశించింది’ అని అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది సుమన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment