సాక్షి, విశాఖపట్నం: తీరంలో నిలబడితే.. అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా పలకరించి వెళ్లిపోయే కెరటాలతోనే మనం సంబరపడిపోతాం. మరి సాగర గర్భంలో దాగి ఉన్న ఎన్నో వింతల్ని చూస్తేనో.. ప్రతి జీవికి దగ్గరగా వెళ్లి పలకరిస్తేనో.. డాల్ఫిన్ నుంచి ఆక్టోపస్ వరకూ.. షార్క్ నుంచి సీహార్స్ వరకూ.. జెల్లీ ఫిష్ నుంచి కాక్టస్ వరకూ స్టార్ ఫిష్ వరకూ.. ఈ అన్నింటినీ చేతితో తాకితేనే అ అనుభూతే వేరు. దేశంలోనే తొలి ఓషినేరియం ఏర్పాటుకు విశాఖ వేదిక కానుంది. పర్యాటక రంగానికి మణిహారంగా మారనుంది. ప్రభుత్వం, పర్యాటక శాఖ అధికారులు ఈ ప్రాజెక్టుపై ఇటీవలే చర్చించారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలోను విశాఖలోని పర్యాటక ప్రాజెక్టుల గురించి చర్చించినప్పుడు ఈ ఓషినేరియం ప్రధాన అంశంగా నిలిచింది. టన్నెల్ ఆకారంలో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
సాధారణంగా ఇళ్లల్లో చిన్న చిన్న నీటి తొట్టెలో చేపలను, మొక్కల్ని పెంచుతూ.. అందులో ఆకర్షణ కోసం రంగు రంగు రాళ్లను వేస్తుంటాం. దీన్ని అక్వే రియం అని పిలుస్తారు. ఇలాంటి అక్వేరియం ఓ భారీ టన్నెల్ ఆకారంలో ఉంటే.. అందులో దాదాపు సముద్రంలో పెరిగే అన్ని జీవుల్నీ పెంచితే దాన్ని ఓషి నేరియం అంటారు. మన దేశంలో ఇలాంటి ఓషినేరియంలు ఇంతవరకూ లేవు. విశాఖలో ఏర్పాటు చేస్తే దేశంలో తొలి ఓíషినేరియంగా గుర్తింపు పొందుతుంది.
అదో అద్భుత ప్రపంచం
ఓషినేరియం ఓ అద్భుత సాగర ప్రపంచంలా ఉంటుంది. సముద్రలోతుల్లో ఉండే పగడపు దీవులకు వెళ్లి.. జలచరాల్ని చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. టన్నెల్‌లా ఉండే ఈ నిర్మాణంలోకి అడుగుపెట్టగానే డాల్ఫిన్ మన మీదకు వచ్చేసినట్లుంటుంది.. షార్క్ నోరు తెరుచుకొని కరిచేందుకు వెంటబడుతుంది. ఆక్టోపస్‌లు మన చుట్టూ తిరుగుతుంటాయి. సముద్రపు రొయ్యలు మీసాలు మెలేస్తుంటాయి. సముద్రపు తాబేళ్లు.. ప్రమాదకర జెల్లీ ఫిష్‌లు, విష సర్పాలు.. ఇలా ప్రతి ఒక్క సముద్ర జీవరాశీ మన పక్కనే ఉంటూ మనమే సాగరగర్భంలోకి వెళ్లినట్లుగా కనిపిస్తుంటుంది.
అత్యంత పారదర్శకమైన గాజు నిర్మాణంలో నీలి నీలి అందాలు చూపు తిప్పనీకుండా చేస్తాయి. 1938లో యూఎస్‌లోని ఫ్లోరిడాలో ప్రపంచంలోనే మొదటిసారిగా ఓషినేరియం ఏర్పాటు చేశారు. పోర్చుగల్‌లోని లిస్బన్ ఓసినేరియం, ప్రపంచంలో అతి పెద్ద ఓషినేరియంగా సింగపూర్‌లోని మెరైన్ లైఫ్ పార్క్, ఇంగ్లండ్‌లోని బౌర్న్‌మౌత్ ఓషినేరియం, లాస్ ఏంజిల్స్‌లో ఉన్న సీ వరల్డ్ ఇలా మొదలైన ఓషినేరియంలు ప్రపంచంలో అతి అరుదైన జీవరాశుల సముదాయంతో నిర్మించారు. వీటి ప్రత్యేకతలు పరిశీలించి అత్యుత్తమ టన్నెల్ ఓషినేరియం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
త్వరలో స్థల పరిశీలన
ఓషినేరియం ఏర్పాటు చేసేందుకు కొద్ది నెలల క్రితం రుషికొండ, మధురవాడ ప్రాంతాల్లో స్థలాల్ని పరిశీలించారు. టన్నెల్ ఓషినోరియం నిర్మాణానికి ఎక్కువ శాతం సముద్రపు నీరు కావాల్సిన నేపథ్యంలో రుషికొండ ప్రాంతం దీన్ని ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉన్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. 10 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కోవిడ్ పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత డీపీఆర్ సిద్ధం చేశాక.. ప్రాజెక్టు పట్టాలపైకి వస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రభు త్వం దీనిపై సుముఖత వ్యక్తం చేస్తే.. రెండేళ్లలో విశాఖ వాసులకు టన్నెల్ ఓషినోరియం అందుబాటులోకి రానుంది.
పీపీపీ విధానంలో దీన్ని నిర్మించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. రూ.300–400 కోట్లతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో ఆనందా గ్రూప్స్ సంస్థ ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. పర్యావరణ, వాతావరణ పరంగా రుషికొండ ఆమోదయోగ్యమైన స్థలమని అధికారులు గుర్తించగా.. సదరు సంస్థ మాత్రం నగరం నడిరోడ్డున కానీ.. ఆర్కే బీచ్ సమీపంలో కానీ.. 10 ఎకరాల స్థలం ఇవ్వాలనీ.. దీనికి ప్రత్యేక రాయితీలు కేటాయించాలనీ.. చాలా అంశాలతో కూడిన విషయాల్ని పర్యాటక శాఖ ముందుంచారు. సంస్థ ప్రతినిధుల గొంతెమ్మ కోరికలు విన్న శాఖాధికారులు.. అవన్నీ సమకూర్చలేమని చెప్పడంతో ఆనంద గ్రూప్ సంస్థ.. ఓషినేరియం ఏర్పాటు నుంచి తప్పుకుంది. ఇప్పుడు మళ్లీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
20 వేలకుపైగా జలచరాలు
పర్యాటక కేంద్రంగానే కాకుండా వైజ్ఞానిక, పరిశోధన క్షేత్రంగానూ ఉపయోగపడేలా నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. టన్నెల్ ఆకారంలో నిర్మించనున్న ఈ ఓషినేరియంలో ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో కనిపించే 20 వేల సముద్ర జలచరాలు ఉండనున్నాయి. వీటిని 360 డిగ్రీల కోణంలోనూ చూడవచ్చు. చైనా, ఆస్ట్రేలియా, స్పెయిన్ దేశాలకు చెందిన నిపుణులతో ఈ ఓసినేరియంను డిజైన్ చెయ్యనున్నారు. సుమారు 3 వేల మంది ప్రజలు ఒకేసారి అద్దాల్లో ఉన్న అందాల సాగర ప్రపంచాన్ని తిలకించేలా ఐదు అంతస్తుల్లో నిర్మాణం జరగనుంది. ఒకేసారి 2 వేల వాహనాలు పార్కింగ్ చేసేలా డిజైన్ ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.
చదవండి: అహోబిలం రిజర్వాయర్‌కు ‘జియోమెంబ్రేన్’ చికిత్స
Poduru: ఇక్కడి మండువా లోగిళ్లలోనే ఆ సినిమా షూటింగులు!
Comments
Please login to add a commentAdd a comment