లేపాక్షి వీరభద్రస్వామిని దర్శించుకుంటున్న ప్రధాని మోదీ
లేపాక్షి (శ్రీసత్యసాయి జిల్లా): చారిత్రక లేపాక్షి ఆలయంలో శిల్పకళా సంపద అద్భుతమని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. భారతీయ చరిత్ర, పురాతన వైభవం, విజయనగర సామ్రాజ్య సంస్కృతిని లేపాక్షి ఆలయ శిల్పకళా సంపద ప్రతిబింబిస్తోందని చెప్పారు. ప్రధాని మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు పుట్టపర్తి నుంచి హెలికాప్టర్‌లో లేపాక్షి చేరుకుని స్థానిక పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాలను సందర్శించారు.
ప్రధానికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో వీరభద్రస్వామి, పాపనాశేశ్వరస్వామి, దుర్గాదేవి అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. వీరభద్రస్వామికి స్వయంగా మహామంగళ హారతి ఇచ్చారు. గర్భగుడిలో పాపనాశేశ్వర లింగానికి అభిముఖంగా ప్రత్యేక పీఠంపై కూర్చుని ప్రధాని ధ్యానం చేశారు. టీటీడీ వేద విజ్ఞాన పాఠశాల ఆధ్వర్యంలో రంగనాథ రామాయణ పారాయణం నిర్వహించగా మహిళా కళాకారులు త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. నిమ్మలకుంట కళాకారులు రామాయణంలో సీతాపహరణ ఘట్టాన్ని తోలుబొమ్మల రూపంలో ప్రదర్శించారు. వీటన్నింటినీ ఆస్వాదించిన ప్రధాని మోదీ తన్మయత్వం చెందారు.
వేలాడే స్తంభం..
గర్భగుడి ప్రదక్షిణ అనంతరం మహా మంటపం పైకప్పు మీద చిత్రీకరించిన 25 గీ14 అడుగుల వీరభద్రస్వామి ఉగ్రరూపాన్ని ప్రధాని తదేకంగా తిలకించారు. పది చేతుల్లో వివిధ ఆయుధాలు, పొడవాటి కత్తి, దక్షయజ్ఞం సందర్భంగా దక్షుడి తలను దునుమాడటం లాంటి ఘట్టాలను చరిత్రకారుడు మైనాస్వామి వివరించారు. నాట్యమంటపంలోని శిల్పాలు, తైలవర్ణ చిత్రాలను చూసిన ప్రధాని ముగ్దులయ్యారు. వేలాడే స్తంభాన్ని ఆసక్తిగా తిలకించారు.
వేలాడే స్తంభం ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. స్తంభం దిగువన మైనాస్వామి ఒక పలుచటి వ్రస్తాన్ని ఉంచగా ప్రధాని దాన్ని స్వయంగా స్తంభం నుంచి వెలుపలకు తీశారు. కిరాతార్జునీయ ఘట్టం, గిరిజా కల్యాణం, వీరభద్ర అనుగ్రహం పొందిన ఆలయ నిర్మాత విరుపణ్ణ, ఆయన పరివారం తైలవర్ణ చిత్రాలను తదేకంగా పరిశీలించారు. వటపత్రసాయి వర్ణచిత్రం గురించి చరిత్రకారుడు వివరించినప్పుడు బాలకృష్ణుడి కన్నులను చిత్రీకరించిన విధానాన్ని మూడు వైపుల నుంచి తిలకించారు. నాట్య మంటపంలోని భిక్షాటనమూర్తి సుందర రూపాన్ని తనివి తీరా చూశారు. భిక్షాటనమూర్తి విగ్రహాలలో భేదాల గురించి ఆసక్తిగా ఆలకించారు. ప్రధాని మోదీని ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం ఆలయ అర్చకులు, కళాకారులను ప్రధాని సన్మానించారు. ప్రధానిని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment