పెద అమిరంలో బహిరంగ సభా ప్రాంగణం ముస్తాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఈ నెల నాలుగో తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఖరారైంది. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ఇద్దరూ పాల్గొని అనంతరం జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శనివారం ప్రధాన మంత్రి భద్రతా విభాగం, రాష్ట్ర మంత్రులు, సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, సీనియర్ ఐఏఎస్ అ«ధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
గన్నవరం నుంచి హెలీకాప్టర్‌లో..
ప్రధాని మోదీ సోమవారం ఉదయం 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఉదయం 11 గంటలకు భీమవరానికి చేరుకుంటారు. అనంతరం 34వ వార్డులోని ఏఎస్‌ఆర్ నగర్ మునిసిపల్ పార్కులో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు రూ.3కోట్లతో ఏర్పాటుచేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ, సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి పెదఅమిరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. పార్టీలకు అతీతంగా జరిగే కార్యక్రమం కావడంతో కేంద్ర సాంస్కృతిక శాఖ సినీ నటుడు చిరంజీవి, టీడీపీ, జనసేన ప్రతినిధులను సభకు ఆహ్వానించింది. మరోవైపు పెదఅమిరంలో 12 ఎకరాల ప్రాంగణంలో బహిరంగ సభ, వేదిక ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. భారీ సభా వేదికతో పాటు ప్రత్యేకంగా గ్యాలరీలు నిర్మించారు.
పీఎం, సీఎంల పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
ఎస్పీజీ పహారాలో పెదఅమిరం..
బహిరంగ సభా ప్రాంగణాన్ని ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. స్థానిక పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఐదు హెలీప్యాడ్‌లను సభా ప్రాంగణానికి సమీపంలో సిద్ధం చేశారు. 11 పార్కింగ్ ప్రదేశాలు కేటాయించడంతో పాటు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి, కాకినాడ ఎస్పీలతో సమన్వయం చేస్తూ డీఐజీ పాలరాజు బందోబస్తు విధుల్లోనే ఉన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ..
పెదఅమిరం సభా ప్రాంగణాన్ని రాష్ట్ర మంత్రులు రోజా, దాడిశెట్టి రాజా, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ మంత్రి, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, సీనియర్ ఐఏఎస్‌లు గోపాలకృష్ణ ద్వివేది, రజత్‌భార్గవ, కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment