పోలవరంపై పట్టుబట్టాలి.. ఎంపీలకు సీఎం జగన్‌ మార్గ నిర్దేశం | Polavaram Issue To Be Addressed In Parliament, AP CM YS Jagan Guides MPs | Sakshi
Sakshi News home page

పోలవరంపై పట్టుబట్టాలి.. ఎంపీలకు సీఎం జగన్‌ మార్గ నిర్దేశం

Published Sat, Nov 27 2021 5:07 AM | Last Updated on Sat, Nov 27 2021 10:37 AM

Polavaram Issue To Be Addressed In Parliament, AP CM YS Jagan Guides MPs - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ.55,657 కోట్లకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించేలా పార్లమెంట్‌ సమావేశాల్లో పట్టుబట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. జాతీయ హోదా ప్రాజెక్టు అంటే విద్యుత్తు, సాగునీరు, తాగునీరు అంశాల కలయికని, అయితే ఎప్పుడూ లేనివిధంగా తాగునీటి అంశాన్ని విడదీసి చూస్తున్నారని పేర్కొన్నారు.

కాంపొనెంట్‌ వారీగా డబ్బులిస్తామని చెబుతున్నారని, కేంద్రం ఇంకా ఆమోదించాల్సిన డిజైన్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇబ్బందికర పరిస్థితులున్నప్పటికీ పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,104 కోట్లు ఖర్చు చేసిందని, అయితే ఆ డబ్బులను కేంద్రం ఇంకా రీయింబర్స్‌ చేయలేదన్నారు. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన పలు అంశాలపై ఎంపీలకు సీఎం జగన్‌ మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..

  • జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత లేకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో పేదరికం ఎక్కువగా ఉందనే కోణంలో గణాంకాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇది వాస్తవ విరుద్ధం. ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తలసరి ఆదాయం చాలా తక్కువ.
  • ఏపీ సివిల్‌ సప్లై కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి రూ.1,703 కోట్ల బకాయిలు రావాలి.
  • రాష్ట్ర విభజన తర్వాత మన విద్యుత్‌ తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 6,112 కోట్ల బకాయి పడింది. వీటిని ఇప్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. 
  • రాష్ట్ర విభజన సమయంలో రీసోర్స్‌ గ్యాప్‌ (రెవెన్యూ లోటు) రూ.22,948.76 కోట్లు అయితే ఇచ్చింది రూ.4,117.89 కోట్లు మాత్రమే. రీసోర్స్‌ గ్యాప్‌ను 2014–15 బడ్జెట్‌ ద్వారా పూడుస్తామని చెప్పారు. కాగ్‌ ప్రకారం గ్యాప్‌ విలువ రూ.16,078.76 కోట్లు కాగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఎఫ్‌ లాంటి బకాయిలతో కలిపి లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది.
  • ఓవర్‌ బారోయింగ్‌ పేరుతో రుణాలు కత్తిరించడం అన్నది ఎప్పుడూ లేదు. చంద్రబాబు  హయాంలో చేసిన దానికి రుణాల్లో కత్తిరింపులకు దిగడం సరికాదు. గత ప్రభుత్వం పరిమితికి మించి రుణం సేకరించిందని తెలిసినప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఆనాడే ఎందుకు స్పందించలేదు? రుణాలను ఇప్పుడు ప్రభుత్వం సక్రమంగా తీరుస్తోంది. అలాంటప్పుడు నికర రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు.  
  • వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. బీసీ కులాల వారీగా జనాభా లెక్కించేలా ఒత్తిడి తేవాలి. 
  • ఉపాధిహామీ కింద రాష్ట్రానికి రూ.4,976.51 కోట్ల బకాయిలు చెల్లించాలి. 
  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశాం. ప్రత్యామ్నాయాలను కూడా సూచించాం. 
  • రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా 13 కాలేజీలకు అనుమతి రావాలి.  
  • పేదల ఇళ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరాం. 
  • దిశ బిల్లు ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరాలి. 
  • మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అన్నదాతలకు మన పార్టీ తరఫున మద్దతు పలకాలి. 

మనది ప్రజల కూటమి..
‘‘మన ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచింది. మరో రెండేళ్ల తర్వాత ఎన్నికల కాలం వచ్చేస్తుంది. మన పార్టీకి అంటూ ఒక సిద్ధాంతం ఉంది. మనకంటూ సొంత బలం ఉంది. మనం ఏ కూటమిలోనూ లేం.. ఎవరి తరఫునా లేం.. మనది ప్రజల కూటమి. మనం ప్రస్తావించే ప్రతి అంశం కూడా ప్రజల తరఫునే. మనం వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ప్రజలకు మేలు జరిగే ఏ అంశం కోసమైనా మనం ముందడుగు వేయాలి. ఎంపీలు అంతా కలసికట్టుగా ముందుకు సాగాలి. సమష్టిగా రాష్ట్రం కోసం పనిచేయాలి. మనకంటూ బలం ఉంది... మన పార్టీకి ప్రతిష్ట ఉంది. ఆ ప్రతిష్టను నిలబెట్టేలా ప్రతి క్షణం ప్రజల కోసం పాటుపడాలి. ప్రజలకు మేలు జరిగే అంశాల్లో మనం ముందుకు అడుగు వేయాలి’’ – వైఎస్సార్‌ సీపీ ఎంపీలతో సీఎం జగన్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement