
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణ టాటా
సాక్షి, తిరుపతి: చంద్రబాబు సభలో రాళ్ల దాడి వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. చంద్రబాబు సభ మొత్తం సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. రాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు సీసీ ఫుటేజీ పరిశీలించగా, సభలో ఎక్కడా రాళ్లు పడినట్టు కనపడలేదనని డీఐజీ కాంతిరాణ టాటా వెల్లడించారు. గాయపడ్డారని చెబుతున్న వారి స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. సదరు వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు చూపిన రాయి అసలు ఆ ప్రాంతంలో ఉన్నది కాదని నిర్ధారణ అయ్యింది. అయితే ఆ రాయి సభలోకి ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
చంద్రబాబు కట్టు కథే
తిరుపతిలో సోమవారం సాయంత్రం 5.40 నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రబాబు రోడ్డు షో నిర్వహించి కృష్ణాపురం ఠాణా వద్ద స్థానికుల నుద్దేశించి ప్రసంగించారు. ఉప ఎన్నికలో డిపాజిట్లయినా వస్తాయో లేదోననే ఆందోళనతో ఓ కార్యకర్తపై రాయి పడిందంటూ అప్పటికప్పుడు సభలో చంద్రబాబు ఒక కట్టుకథ అల్లారు. అది నిజమని నమ్మించేందుకు అక్కడే బైఠాయించి హంగామా సృష్టించారు. జాతీయ మీడియాని రప్పించి ఏపీలో ఏదో జరిగిపోతోందంటూ పారా మిలటరీ బలగాలతో ఎన్నికలు జరిపించాలని కొత్త డిమాండ్‌తో నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు టీడీపీ నేతల్ని పంపి తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఇంతా చేస్తే.. రాయి ఎవరికి తగిలిందో.. ఎవరికేం అయిందో చెప్పలేదు. తనను టార్గెట్ చేసుకుని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాళ్ల దాడి చేయించిందని ఆరోపణలు చేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఏమాత్రం సంబంధం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చి చెప్పారు. టీడీపీకి మద్దతిచ్చే ఎల్లో మీడియా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబు సభలో రాళ్లు వేశారని ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు వాహనంపై నుంచి మట్లాడుతున్న సమయంలో పై నుండి ఒకరాయి వచ్చి పడిందని మాత్రమే చెప్పింది.
ఇది హైడ్రామా కాదా?
ఎవరో కార్యకర్తపై రాయి వేశారని, ఆ రాయిని తెప్పించుకుని అందరికీ చూపించి తనపైనే రాళ్లదాడి జరిగినట్లుగా చంద్రబాబు సీన్ క్రియేట్ చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వద్దకు నడిచి వెళ్లటం.. అక్కడ సీఎం వైఎస్ జగన్‌కు వార్నింగ్‌లు ఇవ్వడం చూస్తుంటే ముమ్మాటికీ ఇది చంద్రబాబు హైడ్రామానే అని స్పష్టం అవుతోందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుపై రాళ్ల దాడి చేయాల్సినంత అవసరం ఎవరికుంది? తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో టీడీపీకి గెలుపు అవకాశాలు దాదాపుగా లేవని, ఈ నేపథ్యంలో రాళ్లదాడి చేయించాల్సిన అవసరమైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసలే లేదని అందరికీ తెలుసు. ఈ దృష్ట్యా ఉప ఎన్నికల్లో ద్వితీయ స్థానం కోసం చంద్రబాబు పాట్లు పడుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగానే రాళ్ల దాడి నాటకానికి తెర తీశారని, తద్వారా ప్రజలు జాలి కురిపించి ఓట్లు వేస్తారన్నది ఆయన ఆశ అంటున్నారు. ఎవరైనా రాళ్లు వేస్తుంటే నిఘా విభాగాల సంగతి అటుంచితే, టీడీపీ కార్యకర్తలు ఒక్కరైనా సెల్‌లో బంధించే వారు కదా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ప్లాన్ మేరకు టీడీపీ కార్యకర్తలే ఆ రాళ్లు జేబులో పెట్టుకుని, తీసుకువచ్చి చంద్రబాబు చేతికి ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబుపై పూలు చల్లే క్రమంలో అందులో పొరపాటున రాయి ఉండి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు.
రాళ్ల దాడి జరిగినట్లు ఆధారాలు లేవు
చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగినట్లు ఆధారాలు లేవు. ప్రచారంలో ఎక్కడా అంతరాయం జరగలేదని సెక్యూరిటీ సిబ్బంది కూడా స్పష్టం చేశారు. పోలీసులతో పాటు.. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ, ఎన్‌ఎస్‌జీ, ఐఎస్‌డబ్లు్య సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. రాళ్ల దాడి విషయంపై సీసీ కెమెరాలు పరిశీలించాం. చంద్రబాబు పర్యటించిన ప్రాంత పరిధిలోని స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు సెక్యూరిటీ, సౌండ్ సిస్టమ్స్ సిబ్బంది, డ్రైవర్లు ఇలాఅందరినీ విచారించాం. పోలీసులపై నిందలు వేయటం తగదు. ఆధారాలు ఉంటే ఇవ్వండి.
– కాంతిరాణ టాటా, డీఐజీ
Comments
Please login to add a commentAdd a comment