వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసుల పిలుపు
ఆ ప్రజాప్రతినిధి చెప్పాక తప్పదంటున్న వైనం
తర్వాత దారికాచి కొడుతున్న తెలుగుతమ్ముళ్లు
ఎన్నికల ముందు గొడవలపై పోలీసుల కౌన్సెలింగ్
సోషల్ మీడియా పోస్టుల పేరుతో హెచ్చరికలు
శ్రీసత్యసాయి జిల్లాలో అరాచకం
సాక్షి, టాస్క్ ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లాలో ఆ ప్రజాప్రతినిధి రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. అధికారం అండతో పచ్చపార్టీ మేడం ‘రెడ్‌బుక్’ అమలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులే లక్ష్యంగా పోలీసుల్ని ప్రయోగిస్తున్నారు.
పోలీసుల పిలుపుతో వెళ్లివస్తున్న వారిపై దారిలో తమ పార్టీ వారితో కొట్టిస్తున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్ అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసులు పిలిచినప్పుడు పోలీసు వ్యవస్థపై గౌరవంతో స్టేషన్‌కు వెళ్లినవారికి ఇంటికెళ్లేవరకు రక్షణ ఉండటంలేదు. దారికాచిన తెలుగుదేశం వర్గీయులు దాడిచేస్తున్నారు.
ఈ దాడులపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు కేసులు నమోదు చేయడంలేదు. ఎన్నికల ముందు గొడవలపై పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని కూటమి నేతల నుంచి పోలీసులకు భారీ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం.
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో ఇలా పోలీసులు పిలిస్తే వెళ్లి వస్తున్న వారిపై టీడీపీ వర్గీయులు దాడిచేసి కొట్టారు. తాజాగా పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసుల నుంచి ఫోన్ వెళ్లింది. ‘మేడం చెప్పారు. స్టేషన్‌కు వచ్చి వెళ్లండి’ అని కాల్ చేశారు.
భయపెడుతున్న కొత్తచెరువు ఘటన
పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం కొడపగానిపల్లికి చెందిన కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఈ నెల 17వ తేదీన పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేయరాదని హెచ్చరించారు. ఆ కార్యకర్తలు సాయంత్రం తిరిగి వెళ్లేటప్పుడు కొత్తచెరువు శివారులో టీడీపీ నేతలు దాడిచేసి గాయపరిచారు. నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయలేదు.
తాజాగా పెనుకొండ నియోజకవర్గంలో ఎన్నికల ముందు జరిగిన ఓ గొడవకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నేతలను స్టేషన్‌కు పిలిపించాలని మేడం ఆదేశించారని.. నాలుగు రోజుల కిందట పోలీసుల నుంచి ఫోన్‌కాల్స్ వెళ్లాయి. మేడం ఎవరు.. ఏమని ఫిర్యాదు చేశారు.. ఆ గొడవకు సంబంధించి అప్పట్లోనే రాజీకుదిరిందని ఫోన్ రిసీవ్ చేసుకున్నవారు సమాధానం ఇచ్చారు.
అయితే మేడం నుంచి ఒత్తిడి ఉందని పోలీసులు చెబుతుండటం విశేషం. రొద్దం మండలం సోషల్ మీడియా కార్యకర్త ఎన్.బాలాజీరెడ్డిని పోలీసులు పదేపదే వెంటాడారు. స్టేషన్‌కు రమ్మని.. పెనుకొండకు తీసుకెళ్లి తర్వాత వదిలేశారు. అంతటితో ఆగకుండా.. చాలా స్టేషన్లలో కేసులు నమోదు చేయించారు.
ఇంటికొచ్చే వరకు రక్షణ లేదు
పోలీసుల నుంచి ఫోన్ వచ్చిoదని స్టేషన్‌కు వెళ్లినవారితో ఎస్‌ఐ లేదా సీఐతో మాట్లాడతారు. సోషల్ మీడియాలో పోస్టింగులు, ఎన్నికల ముందు చిన్నపాటి గొడవల గురించి ప్రస్తావిస్తారు. పునరావృతం కారాదని హెచ్చరిస్తారు. ఇంకొందరిని అరెస్టు చేసినట్లు చెప్పి.. సాయంత్రానికి స్టేషన్ బెయిల్ ఇస్తారు. మరుసటిరోజు రావాలని ఆదేశిస్తారు.
అయితే సాయంత్రం ఇంటికెళ్లే సమయంలో కూటమి నేతలు దారికాచి దాడులు చేస్తున్నారు. లేనిపోని విషయాలతో గొడవలకు దిగి, పోలీసులపై మళ్లీ ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఇబ్బంది పెడుతున్నారు. కొన్నిచోట్ల బైండోవర్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment