టీడీపీలో ఇంటిపోరు.. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిపై తిరుగుబాటు! | Political Cold War Between TDP Leaders In Kurnool District | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల తలోదారి.. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిపై తిరుగుబాటు!

Published Mon, Jan 30 2023 11:49 AM | Last Updated on Mon, Jan 30 2023 11:51 AM

Political Cold War Between TDP Leaders In Kurnool District - Sakshi

భూమా కుటుంబంలో విభేదాలు.. డోన్‌లో కేఈ తిరుగుబాటు.. టీడీపీలోని తాజా స్థితికి అద్దం పడుతోంది. పార్టీ అధినేతలు పర్యటిస్తే.. ఆ తర్వాత స్థానిక నేతల్లో సఖ్యత పెరుగుతుందనే భావన ఇప్పటి వరకుంది. అలాంటిది చంద్రబాబు జిల్లాకు వచ్చి వెళ్లిన తర్వాత ఆ పార్టీ నేతల తీరు పార్టీ పరువును బజారున పడేస్తుంది. డోన్‌లో పోటీకి ఓ అభ్యర్థి పేరును పార్టీ అధినేత ప్రకటించగా.. కేఈ ప్రభాకర్‌ తాను తప్పక పోటీ చేస్తానని తన మనసులోని మాట బయటపెట్టారు.

ఇక అఖిలప్రియ వ్యవహార శైలి భూమా కుటుంబంలో అగ్గిరాజేసింది. ఒక్కొక్కరుగా ఆమెకు దూరం కాగా.. పార్టీ బలహీనపడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ.. నేతల కుమ్ములాటలు, విభేదాల నేపథ్యంలో 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం కాక తప్పదనే అభిప్రాయం ఆ పార్టీ వర్గీయుల్లోనే వ్యక్తమవుతోంది.

సాక్షి ప్రతినిధి కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన తర్వాత ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర, జాతీయ అధ్యక్షులనే సవాల్‌ చేయడం చూస్తే తమ్ముళ్ల తిరుగుబాటు ధోరణి అర్థమవుతోంది. కర్నూలు పర్యటనలో చంద్రబాబు డోన్‌ అభ్యరి్థగా ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ డోన్‌లో తన జన్మదిన వేడుకల సందర్భంగా చంద్రబాబు నిర్ణయంపై ధిక్కారస్వరం వినిపించారు. ‘వార్డు మెంబర్‌గా కూడా గెలవని వారు, జనామోదం లేని వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని.. ఎవరెన్ని చెప్పినా కేఈ కుటుంబం 2024 ఎన్నికల్లో పోటీ చేసి తీరుతుందని ప్రకటించారు. 

తనకు వయస్సు మీద పడి ఉండొచ్చని.. ఆర్థిక, అంగ బలం ఉందనే విషయం ఎవ్వరూ మరవొద్దని చెప్పుకొచ్చారు. అంటే.. ఎన్నికల్లో సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యరి్థగా లేదా మరో పార్టీ నుంచైనా బరిలో నిలుస్తామని చెప్పకనే చెప్పారు. ఇందులో భాగంగా కేఈ ప్రభాకర్‌ డోన్‌లో కార్యకర్తలను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకోగా.. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ‘పార్టీ మీకు చాలా చేసిందని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు వద్దని, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం’ అని ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఫోన్‌ చేయించారు. అందుకే కేఈ గట్టిగానే బదులివ్వడంతో అచ్చెన్న ఫోన్‌ పెట్టేయడం, సోమిశెట్టి మౌనం వహించడం జరిగినట్లు టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. 

తెరవెనుక బీసీ రాజకీయం 
భూమా కుటుంబంలోని విభేదాలు, కుటుంబానికి ఒకే టిక్కెట్‌ అనే పాలసీని పార్టీ తీసుకోవడంతో మైనార్టీ కోటాలో తన కుమారుడు ఫిరోజ్‌కు టిక్కెట్‌ దక్కించుకునేందుకు ఫరూక్‌ పావులు కదుపుతున్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి గట్టిగా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేఈ, భూమా కుటుంబాలు బలహీనమైతే టీడీపీలో తాను బలమైన నేతగా ఎదగొచ్చనే యోచనతో డోన్, నంద్యాల, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో తన అనుకూలురకు టిక్కెట్లు ఇప్పించుకునే ప్రయత్నం బీసీ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.   

‘భూమా’ కుటుంబంలో తారస్థాయికి విభేదాలు 
భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఎమ్మెల్యేగా భూమా బ్రహా్మనందరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అఖిల, బ్రహ్మం మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. బ్రహా్మకి వ్యతిరేకంగా ఆళ్లగడ్డలో పార్టీ కార్యాలయాన్ని అఖిల ప్రారంభించి, అక్కడ కార్యకర్తలకు తన తమ్ముడు జగత్‌ విఖ్యాత్‌ అందుబాటులో ఉంటారని చెప్పింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మం గైర్హాజరయ్యారు. దీనికి తోడు నాగిరెడ్డి మృతి తర్వాత కుటుంబంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో అఖిలను కుటుంబ సభ్యులంతా విభేదించి దూరమయ్యారు. ఇకపోతే కేసులు, ఇతర వ్యవహారాలు.. రాజకీయంగా చురుగ్గా లేకపోవడంతో నియోజకవర్గంలో పార్టీ బలహీనపడింది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో అఖిలకు ప్రత్యామ్నాయంగా కిషోర్‌రెడ్డిని కూడా టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. కుటుంబసభ్యులు కూడా అతనికే మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. 

ఒక్కొక్కరుగా దూరమవుతూ.. 
- ఓ క్రషర్‌ విషయంలో సమీప బంధువు శివరామిరెడ్డి దూరం కావడంతో పాటు పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు.  
- నాగిరెడ్డి చిన్నాన్న, విజయ డెయిరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డిని ఆ కుర్చీ నుంచి తప్పించే ప్రయత్నం చేయడంతో ఆయనా మౌనం దాల్చారు.  
- అఖిల పెద్దనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితోనే విభేదాలు తలెత్తడంతో అతనూ బీజేపీలో చేరారు.  
- నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహా్మనందరెడ్డి సోదరుడు మహేశ్‌ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. 
- భూమా నాగిరెడ్డికి ఆత్మగా మెలిగిన ఏవీ సుబ్బారెడ్డితోనూ వైరం. 

నువ్వేంది మాకు చెప్పేది అచ్చెన్నా.. 
‘మీ అన్న ఎర్రన్నాయుడికి టిక్కెట్‌ ఇప్పించింది మా అన్న కేఈ కృష్ణమూర్తి! నువ్వేంటి మాకు చెప్పేది. మీ ఇంట్లో నువ్వు.. మీ అన్న కుమారుడు, కూతురు.. ముగ్గురికి టిక్కెట్లు కావాలి. మేము మీరు చెప్పినట్లు వినాలా?’’ 
–  అచ్చెన్నాయుడుతో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ 
ఫోన్‌ సంభాషణగా టీడీపీ వర్గాల్లో చర్చ 

అన్నా చెల్లెలు మధ్య కయ్యం 
ఈనెల 8న భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా బ్రహ్మానందరెడ్డి రక్తదానం, అన్నదానాన్ని తన నివాసం వద్ద చేపట్టారు. అలాగే అఖిలప్రియ మరో ప్రాంతంలో రక్తదానం, అన్నదానం నిర్వహించారు. ఇద్దరూ ఒకరి కార్యక్రమాలకు ఒకరు హాజరు కాలేదు. దీన్నిబట్టి ఇరు వర్గాల మధ్య వైరం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement