సైకిల్ యాత్రలో ప్రదీప్‌కుమార్
మోపిదేవి (అవనిగడ్డ): భారత్‌ను ఆకలి చావులు లేని దేశంగా చూడాలన్నది ఆ యువకుడి కల. దానికోసం తనవంతు ప్రయత్నంగా దేశమంతటా పర్యటించాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియజేస్తూ, వ్యవసాయానికి దూరమవుతున్న వారిని తిరిగి సాగు వైపు మళ్లించటమే లక్ష్యంగా దేశవ్యాప్త యాత్ర చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈడిగ ప్రదీప్‌కుమార్.. అనంతపురానికి చెందిన యువకుడు.
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ప్రదీప్ ఫిబ్రవరి 23న ఈ యాత్రను చేపట్టాడు. తొలుత పాదయాత్రగా ప్రారంభించినప్పటికీ, యాత్ర నెల్లూరుకు చేరిన సమయంలో అక్కడి స్థానికులు ఆదరించి అతను వద్దని చెప్పినా సైకిల్ కొనిచ్చారు. అప్పటి నుంచి సైకిల్‌పై యాత్ర కొనసాగిస్తున్నాడు. పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అతని తల్లిదండ్రులు తొలుత ప్రదీప్ యాత్రను వ్యతిరేకించినా, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూశాక ప్రోత్సహించటం మొదలుపెట్టారు.
జాతీయ జెండా చేబూని, ఆదరించిన వారి నుంచి భోజనం స్వీకరిస్తూ, భోజనం దొరకని రోజున మంచి నీళ్లే ఆహారంగా చేసుకుని ప్రదీప్ తన సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నాడు. వ్యవసాయానికి దూరం అవుతున్న రైతులను గమనించి, అందుకు గల కారణాలను అన్వేషిస్తూ, సాగు పట్ల ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రదీప్ యాత్ర గురువారం కృష్ణా జిల్లాలోని మోపిదేవికి చేరింది. స్థానిక వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రదీప్‌ను దివిసీమ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment