సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి ఆల్ టైం రికార్డు స్ధాయిలో నమోదైంది. సోమవారం ఉదయం 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్ స్ధాయిలో కృష్ణమ్మకి వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.25 లక్షలు క్యూసెక్కులు ఇన్ ఫ్లో దాటింది.
అంతకుముందు 2009 సంవత్సరం అక్టోబర్ 5 న రికార్డుస్ధాయిలో 10,94,422 క్యూసెక్కుల వరదనీరు, 1903 అక్టోబర్ 7లో మాత్రమే 10,60,830 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతి నమోదు కాగా.. ఇప్పుడు ఏకంగా 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దాటింది.
అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహంతో కృష్ణా పరీవాహక ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటికే బుడమేరుకి గండిపడటంతో సింగ్ నగర్,ఊర్మిలానగర్, ప్రకాశ్ నగర్, వాంబేకాలనీ, ఖండ్రిగ,పైపుల రోడ్, న్యూ రాజరాజేశ్వరిపేట, వైఎస్సార్ కాలనీ, జక్కుంపూడి కాలనీ తదితర ప్రాంతాలు నీట మునిగాయి.
వరదల దాటికి కృష్ణలంక రైల్వే బ్రిడ్జి అంచు వరకు వరదనీటి ప్రవాహం చేరింది. నీటి ప్రవాహం మరింత పెరిగితే రైల్వే బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించే అవకాశం ఉంది.
ఢీకొట్టిన బోట్లు.. దెబ్బ తిన్న ప్రకాశం బ్యారేజీ 69వ గేటు
కృష్ణమ్మకు వరద పోటెత్తింది. వరదల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు బోట్లు కొట్టుకొస్తున్నాయి. బోట్లు ఢీకొట్టడంతో గేట్లు లిఫ్ట్ చేసే ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. మూడు భారీ పడవలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లను 69వ నెంబర్ గేటు ధ్వంసమైంది. ఒక పక్కకు ఒరిగింది.
Comments
Please login to add a commentAdd a comment