
ఒంగోలు: అమరావతి పరిరక్షణ పేరుతో నిర్వహిస్తున్న రైతుల మహాపాదయాత్రలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికాగర్గ్ చెప్పారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడలో గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో మహాపాదయాత్ర బృందానికి వ్యతిరేకదిశలో 250 నుంచి 300 మంది రాజకీయ నాయకులు దూసుకొచ్చారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా పాదయాత్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ వ్యతిరేక దిశలో వచ్చారని తెలిపారు. అడ్డుకోబోయిన పోలీసులపై కర్రలతో దౌర్జన్యం చేస్తూ ముందుకు సాగారని, ఒక పోలీసు అధికారి చేతిలోని మ్యాన్‌పాక్‌ను లాక్కునే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ ఘటనల వీడియోను ప్రదర్శించారు.
తమ సిబ్బంది వారిని అదుపుచేసేందుకు యత్నించారే తప్ప ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదని ఎస్పీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా కూడా ఈ గుంపులో వచ్చినట్లు గుర్తించామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులను అమలుచేయడం బాధ్యతగా భావిస్తూ పాదయాత్ర బృందానికి భద్రత కల్పిస్తున్నామన్నారు. నాలుగు వాహనాలకు, 157 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉండగా వందల వాహనాలు వస్తున్నాయని, అనుమతికి మించి 15 రెట్లకుపైగా జనం పోగవుతున్నారని, పరిమితికి మించి మైక్‌లు వినియోగిస్తున్నారని, కోవిడ్ నిబంధనలు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు.
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుండటంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాదయాత్ర సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు తమశాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా హైకోర్టు ఆదేశాలు, డీజీపీ షరతులకు లోబడి అనుమతి పొందిన 157 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని సూచించారు. నాగరాజు అనే వ్యక్తి గాయపడినట్లు ప్రచారం జరిగిందని, అతడికి ఎటువంటి గాయాలు లేవని చెప్పారు. భద్రత కల్పించడం కోసమే ట్రాఫిక్‌ను సైతం క్రమబద్ధీకరిస్తున్నామని, పెద్ద ఎత్తున జనం రావడం వల్ల పాదయాత్రలో ఉన్నవారి భద్రతకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో ఒంగోలు టౌన్ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment