2016లో విజయవాడలో పుష్కరాల పేరిట ఏడు దేవాలయాలను కూల్చిన చంద్రబాబు
ఆ ఆలయాలను తిరిగి పునర్నిర్మించిన సీఎం వైఎస్ జగన్
2021 జనవరి 8న శంకుస్థాపన
రూ.2.5 కోట్లు ఖర్చుతో నిర్మాణం
గతేడాది సీఎం చేతుల మీదుగా ప్రారంభం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): గత చంద్రబాబు ప్రభుత్వం కూల్చిన ఏడు ఆలయాల్లో గురువారం ప్రాణప్రతిష్టను నిర్వహించనున్నారు. ఉదయం 11.24 గంటలకు దుర్గగుడి ఆలయ అర్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణ మధ్య దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ట, కలశస్థాపన జరగనుంది. ప్రాణ, శిఖర ప్రతిష్టలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ఏడు ఆలయాలను ఏకంగా రూ.2.5 కోట్లతో పునర్నిర్మించింది. 2016లో కృష్ణా పుష్కరాల పేరిట చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో ఏడు ఆలయాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం కూల్చిన ఈ ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించారు.
అంతేకాకుండా 2021 జనవరి 8న ఆయా ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆలయాల నిర్మాణం శరవేగంగా జరిగేలా నాటి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రస్తుత మంత్రి కొట్టు సత్యనారాయణతోపాటు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. గతేడాది డిసెంబర్ 7న దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌తో పాటు పునర్నిర్మించిన ఆలయాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
దేవతామూర్తులకు ధాన్య, పూజాధివాసాలు
కాగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాత మెట్ల మార్గంలోని వినాయక, ఆంజనేయ స్వామి వారి ఆలయాల పున ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆయా దేవతామూర్తుల విగ్రహాలతోపాటు సీతమ్మ వారి పాదాల సమీపంలోని దక్షిణాముఖ ఆంజనేయ స్వామి వారి పున:ప్రతిష్ట జరుగుతుంది.
ఈ నేపథ్యంలో బుధవారం స్థానాచార్య శివప్రసాద్‌శర్మ పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. దేవతామూర్తుల విగ్రహాలకు జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాదివాసం, శయనాధివాసం చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు పాల్గొన్నారు.
నేడు ప్రాణప్రతిష్ట జరిగే ఆలయాలివే..
శ్రీ దక్షిణాముఖ ఆంజనేయస్వామి వారి ఆలయం
వ్యయం రూ.45 లక్షలు
సీతమ్మ వారి పాదాలు
వ్యయం రూ.10 లక్షలు
శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం –కృష్ణలంక
వ్యయం రూ.15 లక్షలు
వీరబాబు దేవస్థానం (తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద)
వ్యయం రూ.15 లక్షలు
వేణుగోపాలస్వామి వారి దేవాలయం (విజయవాడ గోశాల వద్ద)
వ్యయం రూ.68 లక్షలు
బొడ్డు బొమ్మ (రథం సెంటర్)
వ్యయం రూ.23 లక్షలు
శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయం, అమ్మవారి తొలి మెట్లు –ఇంద్రకీలాద్రి
వ్యయం రూ.29 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment