సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: ప్రేమించిన యువతి కోసం దేశ సరిహద్దులు దాటాడు. శత్రు దేశం పాకిస్తాన్ భూ భాగంలో అడుగు పెట్టడంతో అరెస్టయ్యి, జైలు జీవితం గడిపాడు. కేసు విచారణలో భాగంగా కోర్టు వద్దకు వచ్చినప్పుడు రెండేళ్ల క్రితం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగలిగాడు. వారు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించడం.. ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు కథ సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన బాబూరావు, ఇందిర దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన ప్రశాంత్ బెంగళూరులోని హువాయ్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఇతని సోదరుడు శ్రీకాంత్ తన భార్యతో కలిసి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. దీంతో బాబూరావు దంపతులు తొమ్మిదేళ్ల క్రితం నగరానికి వచ్చి, కేపీహెచ్‌బీ భగత్‌సింగ్‌నగర్ ఫేజ్–1 ద్వారకామయి అపార్ట్‌మెంట్‌లో శ్రీకాంత్‌తో కలిసి ఉంటున్నారు. బెంగళూరులో ఉంటున్న సమయంలో స్వప్నికా పాండే అనే మధ్యప్రదేశ్‌కు చెందిన యువతితో ప్రశాంత్ ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అప్పట్లోనే స్వప్నికకు మరో ఉద్యోగం రావడంతో స్విట్జర్లాండ్ వెళ్లిపోయింది. తర్వాత కొంతకాలం చైనాలో, ఆఫ్రికా దేశాల్లోనూ, చివరకు హైదరాబాద్‌లో.. ఇలా ఎన్నోచోట్ల ఉద్యోగాలు మారినా స్వప్నికను ప్రశాంత్ మరచిపోలేకపోయాడు.
నాలుగేళ్ల క్రితం ఇంట్లో చెప్పకుండా..
మానసికంగా కొంత బలహీనంగా మారిన ప్రశాంత్ ప్రేయసి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 2017 ఏప్రిల్ 11న ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన ప్రశాంత్ తిరిగి రాలేదు. దీంతో బాబూరావు అదే నెల 29న మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. కాగా తాను పాకిస్తాన్‌లో అరెస్టు అయ్యాననే సమాచారాన్ని ప్రశాంత్ 2019 నవంబర్ ఆఖరి వారంలో తన తండ్రికి తెలిపాడు. అక్కడి కోర్టు ఆవరణలో ఓ న్యాయవాది సహకారంతో ఫోన్‌లో మాట్లాడాడు. సెల్ఫీ వీడియో కూడా పంపాడు. బాబూరావు వెంటనే సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను కలిసి విషయం చెప్పి తన కుమారుడు తిరిగి వచ్చేందుకు సహకరించాలని కోరారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ద్వారా చర్యలు చేపట్టింది. ఈ కృషి ఫలితంగా ప్రశాంత్ ఎట్టకేలకు సోమవారం విడుదలయ్యాడు. పాక్ రేంజర్లు వాఘా సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) అధికారుల సమక్షంలో తెలంగాణ పోలీసులకు ప్రశాంత్‌ను అప్పగించారు. దీంతో మంగళవారం హైదరాబాద్ చేరుకున్న ప్రశాంత్‌ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఆయన సోదరుడు శ్రీకాంత్‌కు అప్పగించారు. కాగా, తమ కుమారుడు పాకిస్తాన్ చెర నుంచి విడుదలై, హైదరాబాద్ చేరుకున్నాడని సీపీ సజ్జనార్ ఫోన్ చేసి చెప్పారని.. విశాఖలో ఉంటున్న ప్రశాంత్ తల్లిదండ్రులు ఆనందంతో ‘సాక్షి’కి తెలిపారు.
స్విట్జర్లాండ్‌కు నడిచి వెళ్లాలనుకున్నాడు
ఇంట్లోంచి వెళ్లిన ప్రశాంత్ స్విట్జర్లాండ్‌కు నడిచి వెళ్లాలని భావించాడు. పర్సు, ఫోన్ ఇంట్లోనే వదిలి బయలుదేరిన అతడు తొలుత రైల్లో రాజస్థాన్‌లోని బికనీర్ వెళ్లాడు. అక్కడ కంచె దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని తుబాబరిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు 2019 నవంబర్ 14న చిక్కాడు. ఆ సమయంలో అతని వెంట మధ్యప్రదేశ్‌కు చెందిన దరియాలాల్ కూడా ఉన్నాడు. ఇద్దరినీ అరెస్టు చేసిన బహవల్‌పూర్ పోలీసులు కంట్రోల్ ఆఫ్ ఎంట్రీ యాక్ట్ 1952 కింద కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశాంత్‌ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు చేపట్టి సఫలీకృతం అయ్యాయి.
– వీసీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ
ఇంత త్వరగా వస్తాననుకోలేదు
పాకిస్తాన్ జైల్లో నా లాంటి వాళ్లు అనేక మంది ఏళ్ల తరబడి ఉన్నారు. వారందరి పరిస్థితి చూసి.. నేను ఇంత త్వరగా తిరిగి వస్తానని భావించలేదు. పట్టుబడిన వెంటనే కొన్నాళ్లు ఆర్మీ జైల్లో ఉంచి విచారించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు సాధారణ జైలుకు తరలించారు. అక్కడ భారతీయుల కోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. నా కేసు సివిల్ కోర్టుకు వచ్చాక పాకిస్తాన్ పోలీసులు స్నేహితులుగా మారారు. అప్పుడే సెల్ఫీ వీడియోకు అవకాశం ఇచ్చారు. పాకిస్తాన్ అధికారులతో తొలుత ఇంగ్లిష్ లోనే మాట్లాడాను. ఆపై వారి భాష కొంత వరకు నాకు వచ్చింది. నా విడుదలకు కారణమైన అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికీ అక్కడి జైల్లో ఉన్న మన వారి కోసం ప్రభుత్వాలు, మీడియా ఏదైనా చేయాలి.
– వి.ప్రశాంత్
పాక్ చెర వీడిన ప్రశాంత్
Published Wed, Jun 2 2021 3:43 AM | Last Updated on Wed, Jun 2 2021 7:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment