![Pregnant Lady Deceased With Corona Virus At guntur District - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/23/preg.jpg.webp?itok=DPmuu-z4)
అంజమ్మ (ఫైల్)
సాక్షి, భట్టిప్రోలు (వేమూరు): కరోనా మహమ్మారి ఓ గర్భిణిని పొట్టన పెట్టుకుంది. సూరేపల్లికి చెందిన అంజమ్మ (29)కు భట్టిప్రోలు వాసి మేడిద ఏడుకొండలుతో వివాహం జరిగింది. కూలీనాలీ చేసుకుంటూ జీవించే వీరికి మొదటి సంతానంగా ఒక బాబు ఉన్నాడు. ఇటీవల ఆమె రెండవ కాన్పు పరీక్షల నిమిత్తం భట్టిప్రోలు పీహెచ్‌సీలో ఈనెల 7వ తేదీన కరోనా టెస్టు చేయించుకోగా 10వ తేదీన నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 11వ తేదీ రేపల్లె ప్రైవేట్ వైద్యశాలలో సీటీ స్కాన్ తీయించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను తెనాలి డీహెచ్‌కు.. ఆ తరువాత జీజీహెచ్‌కు తరలించారు.
అక్కడ పరిస్థితి నచ్చక భర్త గుంటూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్చారు. ఆమె పరిస్థితి క్షీణించి 14వ తేదీ ఆక్సిజన్ అందకపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. దీంతో వైద్యులు తల్లీ బిడ్డలలో ఎవరో ఒకరిని కాపాడే ప్రయత్నంలో భాగంగా.. 19వ తేదీన ఫోర్‌సెప్స్ విధానం ద్వారా ఆమెకు డెలివరీ చేసి బాబును ఇంక్యుబేటర్‌లో ఉంచారు. గురువారం ఆమె తుది శ్వాస విడిచింది. పుట్టిన బాబును చూసుకోకుండానే ఆ తల్లి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment