రిపబ్లిక్‌డే సన్నాహకాల్లో వివిధ బెటాలియన్ల సిబ్బంది
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గణతంత్ర వేడుకలకు విజయవాడలోని మునిసిపల్ స్టేడియం ముస్తాబైంది. వేడుకల ఏర్పాట్లను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా మంగళవారం పరిశీలించారు. ఆయనకు అడిషనల్ డీజీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యనార్, ఏపీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బాగ్చీ, కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి.
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌తో సిసోడియా భేటీ అయ్యారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా కార్యక్రమాలు సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. కాగా, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో కర్ణాటక స్టేట్ పోలీస్, ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కర్నూలు, మూడో బెటాలియన్ కాకినాడ, ఐదో బెటాలియన్ విజయనగరం, తొమ్మిదో బెటాలియన్ వెంకటగిరి, 11వ బెటాలియన్ భాకరపేట, 14వ బెటాలియన్ అనంతపురం, ఎస్‌ఏఆర్ సీసీఎల్, ఏపీ యూనిట్ హైదారాబాద్, పైప్ బ్యాండ్ ఏపీఎస్పీ బెటాలియన్ మంగళగిరి బృందాలు కవాతు నిర్వహించాయి. కలెక్టర్ జె.నివాస్ రిహార్సల్స్‌ను తిలకించి పలు సూచనలు చేవారు. జాతీయ సమైక్యత ఉట్టి పడేలా త్రివర్ణ పతాకాలు, విద్యుత్ దీపాలతో మునిసిపల్ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. రిహార్సల్స్‌లో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ కె.మాధవీలత, కె.మోహన్‌కుమార్, సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్, గవర్నర్ ఏడీసీలు సాహిల్ మహాజన్, ఈశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment