సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో కరోనా నిర్ధారణకు వాడే కిట్‌ల ధరలూ దిగొచ్చాయి. కోవిడ్ వచ్చిన కొత్తల్లో ఆ వైరస్‌ను నిర్ధారించే కిట్‌లు, ల్యాబొరేటరీ రసాయనాల కొనుగోళ్లకు రాష్ట్రాలకు రాష్ట్రాలే ఆర్థికంగా చితికిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రోజూ నిర్ధారణ పరీక్షలకు రూ.5 కోట్లు పైనే ఖర్చు చేసేది. ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలంటే రూ.4 వేలు వ్యయం అయ్యేది. ఒక్క ఆర్టీపీసీఆర్ కిట్ ధర రూ.1000 ఉండేది. అలాంటిది తాజాగా ఆంధ్రప్రదేశ్ సర్కారు టెండర్లకు వెళ్లగా కేవలం రూ.55కు ధర దిగొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వచ్చిన కొత్తల్లో పరిస్థితుల మేరకు భారీగా వ్యయం చేయాల్సి వచ్చింది. అనంతరం లభ్యత పెరుగుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు టెండర్లకు వెళ్లడం కలిసొచ్చింది.
ఏ రాష్ట్రంలో చేయని విధంగా తరచూ టెండర్లకు వెళ్లడం వల్ల 80 నుంచి 90 శాతం తగ్గిన ధరలతో కొనుగోలు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ కిట్‌ను రూ.350తో కొనుగోలు చేస్తుండగా, తాజా టెండర్లలో దీని ధర కేవలం రూ.55కు వచ్చింది. దేశ వ్యాప్తంగా పీపీఈ కిట్‌ల నుంచి, ఆర్టీపీసీఆర్ కిట్ల వరకూ లభ్యత పెరగడం, తయారీ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా రావడం వల్ల ధరలు తగ్గాయి. ఒకప్పుడు సాధారణ సర్జికల్ మాస్క్‌ను రూ.13 నుంచి రూ.16 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం అది రూ.2.50కి పడిపోయింది. ఈ ధరతో ప్రభుత్వం 25 లక్షల మాస్క్‌లు కొనుగోలు చేసింది. తాజా పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్ టెస్టు ధరను ప్రభుత్వం రూ.1,900 నుంచి రూ.1,000కి తగ్గించింది.
ఎప్పటికప్పుడు టెండర్లు
రోజురోజుకూ మార్కెట్‌లో అంచనాలను బట్టి ఎప్పుటికప్పుడు టెండర్లకు వెళ్లాం. దీనివల్ల ధరలు భారీగా తగ్గాయి. తగ్గిన ధరలకు కొనుగోలు చేస్తూ వచ్చాం. దీనివల్ల భారీ వ్యయం తగ్గింది.
– విజయరామరాజు, ఎండీ, రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ
Comments
Please login to add a commentAdd a comment