లక్కిరెడ్డిపల్లి: ఐదో తరగతి చదువుతున్న బాలికపై 55 ఏళ్ల ఓ కామాంధుడు అఘాయిత్యానికి యతి్నంచాడు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పరిమళ భర్తగా చెప్పుకొనే బాలసుబ్బయ్య ఆదివారం సాయంకాలం లడ్డూ ఆశ చూపి చిన్నారిని ప్రిన్సిపాల్ రూమ్‌లోకి పిలిచి లైగింక దాడికి యతి్నంచాడు. బాలిక ఎదురు తిరగడంతో దాడి చేశాడు. దీంతో బాలిక అక్కడి నుంచి తప్పించుకుని హాస్టల్ భవనంలోకి వెళ్లిపోయింది. తోటి విద్యార్థులకు విషయం చెప్పడంతో వారు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయం ఎవరికీ చెప్పొద్దొని ప్రిన్సిపాల్ విద్యార్థులను హెచ్చరించింది. సోమవారం మధ్యాహ్నం ఈ విషయం బయటకు పొక్కడంతో లక్కిరెడ్డిపల్లె పోలీసులు పాఠశాలకు చేరుకుని బాలసుబ్బయ్యను అదుపులోకి తీసుకున్నారు. రోజూ సాయంత్రం ప్రిన్సిపాల్ భర్త మరో ఇద్దరిని వెంటబెట్టుకుని పాఠశాల ఆవరణలోకి చొరబడతారని, తాము దుస్తులు మార్చుకుంటుంటే సెల్ ఫోన్‌లతో వీడియోలు తీస్తారంటూ విద్యార్థులు విలపించారు. అనంతరం ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు.. అంటూ విద్యార్థులు పాఠశాల గేటు ఎదుట నినాదాలు చేశారు. అంతలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఆర్డీవో రంగస్వామి, తహసీల్దార్ లక్ష్మీ ప్రసన్న పాఠశాల వద్దకు చేరుకుని తల్లిదండ్రులను సముదాయించారు. తమ పిల్లలను పంపించాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కాగా, బాలిక బంధువులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల అదుపులో ఉన్న బాలసుబ్బయ్యకు దేహశుద్ధి చేశారు. బాలసుబ్బయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవీంద్రబాబు చెప్పారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పాఠశాలను తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ పరిమళ, హెల్త్‌సూపర్‌వైజర్ లక్ష్మీదేవి, సెక్యూరిటీ గార్డు నాగలక్ష్మీలను సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment