ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, ఏలూరు: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తూ టాయిలెట్‌కు వెళ్లిన అనంతరం పొరపాటున ఎగ్జిట్ డోర్ తీసి అడుగు బయటపెట్టిన ఓ ప్రయాణికుడు రోడ్డు మీద పడిపోవడంతో మృతి చెందాడు. ఏలూరు రూరల్ ఎస్సై లక్ష్మణబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఆకురాతి నన్నయ్య (59) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో బంధువుల ఇంటికి ప్రయాణమాయ్యరు. ఈ నెల 11న రాత్రి హైదరాబాద్‌లోని ఇంటర్‌సిటీ స్మార్ట్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కారు. ట్రావెల్స్ బస్సు గురువారం తెల్లవారుజామున ఏలూరు సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది. నన్నయ్య కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సు వెనుక బాగంలోని టాయిలెట్ రూములోకి వెళ్లారు. అనంతరం బయటకు వస్తూ లోపలికి వెళ్లే తలుపు అనుకుని బస్సు వెనుక భాగంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తీసి ముందుకు వెళ్లటంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. దీంతో పెద్ద శబ్దం రాగా, డ్రైవర్ విషయాన్ని గమనించి బస్సును నిలిపివేశారు.
జాతీయ రహదారి పెట్రోలింగ్ పోలీసుల సహకారంతో నన్నయ్యను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఏలూరు రూరల్ ఎస్సై లక్ష్మణబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం బస్సులో ప్రయాణించే వారికి ఎగ్జిట్ డోర్‌పై అవగాహన కల్పించాల్సి ఉండగా, నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని అంటున్నారు.
చదవండి: (పాపను కాపాడబోయి.. జిల్లా హాకీ కార్యదర్శి గిరి మృతి)
Comments
Please login to add a commentAdd a comment