
సాక్షి, అమరావతి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ నుంచి వివరణ కోరాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. కమిటీ చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన వర్చువల్ సమావేశంలో కమిటీ సభ్యులు మల్లాది విష్ణు, వెంకట చిన అప్పలనాయుడు, శిల్పా చక్రపాణిరెడ్డి, టీడీపీ సభ్యుడు సత్యప్రసాద్ పాల్గొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తూ నిమ్మగడ్డ ఫిబ్రవరి 7న జారీ చేసిన ఆదేశాలపై స్పీకర్ తమ్మినేనికి మంత్రి పెద్దిరెడ్డి ఫిర్యాదు చేశారు. తాను ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నానని, దౌర్జన్యాలు చేస్తున్నానని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నానంటూ ఎన్నికల కమిషనర్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో మంత్రి పేర్కొన్నారు.
స్పీకర్ ఈ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. కాగా, ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన తమ కమిటీ అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ‘మంత్రి పెద్దిరెడ్డి ఫిర్యాదు విచారణకు స్వీకరించాం. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ వ్యక్తిగతంగా లేదా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చే అవకాశం కల్పించాం. దీనికి సంబంధించిన లేఖను అసెంబ్లీ కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు పంపిస్తున్నాం. అలాగే అందుబాటులో ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నాం. ఆయన నుంచి వివరణ వచ్చిన తర్వాత తదుపరి అంశాలను పరిశీలిస్తాం’ అని కాకాణి తెలిపారు.