ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా
విజయవాడలో నిర్వహించిన విచారణలో రూ.80 లక్షల మేర పరిహారాలకు సిఫార్సు
స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులకు అభినందనలు
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా అధికారులు సకాలంలో నివేదికలు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్‌పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా ఆదేశించారు. రాష్ట్రంలో నమోదైన మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై జస్టిస్ అరుణ్ మిశ్రాతో పాటు ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు డాక్టర్ డి.ఎం.మూలే, రాజీవ్ జైన్, విజయభారతి సయాని, సెక్రటరీ జనరల్ భరత్ లాల్, రిజి్రస్టార్(లా) సురాజిత్ బృందం బుధవారం విజయవాడలో విచారణ నిర్వహించింది.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులతో సమావేశమయ్యారు. అనంతరం ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో 30 కేసులను విచారించి, తగిన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రూ.80 లక్షల మేర పరిహారం చెల్లింపులకు సిఫార్సు చేశామని తెలిపారు. 17 కేసుల్లో తుది ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
లైంగిక నేరాల కేసుల్లో బాలబాలికలకు నష్టపరిహారం విషయంలో పోక్సో కోర్టు ముందు ప్రతిపాదనలు ఉంచాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మానసిక ఆరోగ్యం, వెట్టి చాకిరీ, ఆహార భద్రత హక్కు, జ్యుడీషియల్–పోలీసు కస్టడీలో ఆత్మహత్యల నివారణ తదితర అంశాలపై కార్యాచరణ నివేదికలను సమర్పించాలని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అభినందించారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై hrcnet.nic.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
దుర్గమ్మ సేవలో జస్టిస్ అరుణ్ మిశ్రా
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ అరుణ్‌మిశ్రా బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చిన జస్టిస్ అరుణ్‌మిశ్రాకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
పంచహారతుల సేవలో పాల్గొన్న అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా.. ఆలయ ఈవో కేఎస్ రామారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువ్రస్తాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment