సాక్షి, అమరావతి: కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేస్తున్న మెగా లెదర్ ఫుట్‌వేర్, యాక్సెసరీస్ క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టడానికి 440 సంస్థలు ముందుకొచ్చాయి. సుమారు రూ.1,347 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 18,000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 13,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభించనుంది. ఈ మేరకు ఆయా సంస్థలు తమ ప్రతిపాదనలో పేర్కొన్నాయని కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ (కేపీఐఎల్‌సీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రత్నాకర్ పాచిగల్ల ‘సాక్షి’కి తెలిపారు. 537 ఎకరాల్లో రూ.281 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ పార్కులో యూనిట్లు నెలకొల్పడానికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి జనవరి 31 వరకు బిడ్లను ఆహ్వానించగా 440 సంస్థలు తమ ప్రతిపాదనలు పంపాయని, ఇందులో 257 యూనిట్లు ఎస్సీ వర్గాల నుంచే వచ్చాయని చెప్పారు. ‘మూడు నుంచి 15 ఎకరాల్లో యూనిట్లు ఏర్పాటు చేయడానికి 51 సంస్థలు ప్రతిపాదనలు పంపగా, 339 సంస్థలు సూక్ష్మ, చిన్న యూనిట్లు నెలకొల్పడానికి ప్రతిపాదనలు పంపాయి.
వియత్నాం, తైవాన్‌తో పాటు ఇప్పటికే చెన్నై, ఆగ్రాల్లో యూనిట్లు ఉన్న సంస్థలు కూడా కృష్ణపట్నం లెదర్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి తుది ఆమోదం కోసం పరిశ్రమల శాఖకు పంపాము’ అని రత్నాకర్ వివరించారు. కాగా, లెదర్ పార్కు వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్న స్థానికుల్లో ఉన్న భయాందోళనలను తొలగించి, లెదర్‌పార్క్ రావడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించే విధంగా స్థానికులతో కలిసి స్టడీ టూర్ నిర్వహించాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. తమిళనాడులోని రాణిపేట, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా లెదర్ పార్కుల ద్వారా స్థానికులు ఎలా లబ్ధి పొందుతున్నారో ఈ స్టడీటూర్‌లో వివరించనున్నారు. స్థానిక ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం వీరిని స్టడీ టూర్‌కు తీసుకెళ్తామని, యూనిట్ల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసి సముద్రంలో 5.5 కిలోమీటర్ల లోపలకు తీసుకెళ్లి వదిలేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రత్నాకర్ వివరించారు.
లెదర్ పార్కులో రూ.1,347 కోట్ల పెట్టుబడికి ప్రతిపాదనలు
Published Tue, Feb 16 2021 6:14 AM | Last Updated on Tue, Feb 16 2021 6:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment