leather park
-
తోలు పరిశ్రమల జాడేదీ?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నిరుపేద దళితులకు ఉపాధి, స్థానికంగానే తోలు ఉత్పత్తులు తయారుచేసి ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపికచేసి మినీ లెదర్ పార్కులు స్థాపించాలని ప్రణాళికలు చేశారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లిడ్‌క్యాప్) నిరుద్యోగ యువతకు చెప్పుల తయారీలో శిక్షణ సైతం ఇచ్చింది. శిక్షణ తీసుకున్న వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా ఉన్నారు. 2003 నుంచే లెదర్ పార్కుల ఏర్పాటుకు బీజం పడినా నేటికీ ఉత్పత్తి ప్రారంభం కాకపోవడంతో వేలాది మంది నిరుద్యోగ దళితులు ఎదురుచూస్తున్నారు. లెదర్ ఉత్పత్తులకు అవకాశం మేక, గొర్రె, గేదెల వంటి పశువుల తోళ్లతో స్థానికంగానే ప్రముఖ బ్రాండ్లకు చర్మంతో చెప్పులు, ఇతర ఉత్పత్తులు తయారుచేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రం నుంచే లిడ్‌క్యాప్, రాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్‌ఎల్‌ఐపీసీ (తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్) «ఆధ్వర్యంలో పనులు సాగాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో లెదర్ క్లస్టర్, మరో ఆరుచోట్ల 25 ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించారు. ‘మలుపు’స్వచ్ఛంద సంస్థ నిరుద్యోగులకు శిక్షణనిచ్చింది. చెన్నైకి చెందిన లెదర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకొని ప్రముఖ బ్రాండ్ల చెప్పులు, బూట్లు ఇతర ఉత్పత్తులు ఈ పార్కుల్లో తయారు చేయాలని భావించారు. ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకొనేలా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరిగాయి. మౌలిక సదుపాయాలు, షెడ్డుల నిర్మాణాలు, శిక్షణ, యంత్రాలు వచ్చాయి. కొన్నిచోట్ల తయారీ మొదలైంది. ఆ తర్వాత నిధుల లేమితో ఆశయం నీరుగారింది. నిధులు విడుదలవక.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మరోమారు పార్కుల స్థాపనకు ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ కింద రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వీటిని అభివృద్ధి చేయాలనుకున్నారు. 2016లో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కుకు రూ.270 కోట్లతో 2 వేల మందికి ఉపాధి కల్పించాలనే అంచనాతో రూ.105 కోట్ల కేంద్ర సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ ఇప్పటికీ నిధులు విడుదలవలేదు. ఇటీవల ఆర్మూర్ పార్కులో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నా పూర్తిస్థాయిలో నిధులు విడుదలవక ఉత్పత్తి మొదలు కాలేదు. కబ్జాలకు గురవుతున్న భూములు పార్కుల కోసం కేటాయించిన భూములు ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో కబ్జాకు గురవుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో అక్కడ ఇన్చార్జి అధికారే ఆ భూమిలోని మట్టిని అమ్ముకున్నారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో భూములను ఓ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్మూర్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలం చుట్టూ కబ్జాల నిరోధానికి ప్రహరీ నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ఈ స్థలాలను పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, క్రీడాప్రాంగణాలకు కేటాయిస్తుండటంతో దళితులు ఆందోళన చెందుతున్నారు. నాయకులకు చిత్తశుద్ధి లేదు ఏళ్లుగా ఉపాధి పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా లెదర్ పార్కులు ఏర్పాటుచేసి నిరుపేదలకు పని కల్పించాలి. – కొలుగూరి విజయ్‌కుమార్, చర్మకార హక్కుల పరిరక్షణ కమిటీ, జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల -
AP: చర్మకారుల ఉపాధికి ఊతం
సాక్షి, అమరావతి: చర్మకారుల ఉపాధి, శిక్షణకు రాష్ట్రంలో 9 మినీ లెదర్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. అనంతపురం, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో రెండేసి, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేస్తారు. తొలి దశలో విజయనగరం, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరయ్యాయి. ఒక్కో దానికి రూ.4.37 కోట్ల నుంచి రూ.5.75 కోట్లు కేటాయించారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలకు మేలు జరుగుతుంది. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ (లిడ్కాప్)కు చెందిన భూమిని ఎకరం చొప్పున జిల్లాల్లో కేటాయించారు. అందులో భవనాన్ని నిర్మించి యంత్రాలు సమకూర్చుతారు. ఎంపిక చేసిన లబ్ధిదారులు వీటిలో పాదరక్షల తయారీతో ఉపాధి పొందుతారు. చర్మకార కుటుంబాల్లోని వారికి వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారు. ఇప్పటికే నిధుల మంజూరు, స్థలం కేటాయింపు, తదితరమైనవి పూర్తి కావడంతో భవన నిర్మాణం, యంత్రాల ఏర్పాటు పనులు చేపట్టాలని నాలుగు జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మినీ లెదర్ పార్కులు ఇవే.. చిత్తూరు జిల్లా తిరుపతి, విజయనగరం జిల్లా అడ్డపూసలలో ఒక్కొక్క చోట రూ.4.37 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రకాశం జిల్లా ఎడవల్లి, కృష్ణా జిల్లా జి.కొండూరులో ఒక్కొక్క చోట రూ.5.75 కోట్లతో వీటిని నిర్మిస్తున్నారు. ఎడవల్లి, జి.కొండూరులో 150 మంది చొప్పున శిక్షణ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శిక్షణకు సాంకేతిక సహకారానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (చెన్నై)తో లిడ్కాప్ ఒప్పందం చేసుకుంది. ఉపాధి ఇలా.. లిడ్కాప్ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు పాదరక్షల తయారీలో మూడు నెలలు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అనంతరం వారికి లెదర్ పార్కులోనే యంత్రాలను సమకూర్చి, మెటీరియల్ (ముడిసరుకు) ఇస్తారు. వారు తయారు చేసిన పాదరక్షల మార్కెటింగ్ కూడా లిడ్కాప్ చేపడుతుంది. ఇందుకోసం లబ్ధిదారులకు నెలవారీగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనంతోపాటు ఇన్సెంటివ్ ఇస్తుంది. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కూడా వీటిలో పాదరక్షల తయారీ నేర్చుకొనే వెసులుబాటు కల్పిస్తుంది. రాష్ట్రంలో తొలిసారిగా లెదర్‌పార్కులు: లిడ్కాప్ ఎండీ హర్షవర్థన్ రాష్ట్రంలో తొలిసారిగా మినీ లెదర్ పార్కుల ఏర్పాటు జరుగుతోంది. నాలుగింటికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించి, నిర్మాణం, మౌలిక వసతులు, లబ్ధిదారుల ఎంపిక వంటివి చేస్తోంది. గతేడాది కరోనా తీవ్రత వల్ల వీటి ఏర్పాటు జరగలేదు. ఈసారి ప్రత్యేక అనుమతితో నాలుగు పార్కులను ఒకేసారి చేపట్టాం. మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేసి ఎస్సీల్లోని చర్మకారుల అభివృద్ధికి ఊతమిస్తాం. వారికి అవసరమైన శిక్షణ, ముడిసరుకు, మార్కెటింగ్ వంటి వాటిపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. -
AP: 500 ఎకరాల్లో 'అంతర్జాతీయ మెగా లెదర్ పార్క్'
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లాలో 500 ఎకరాల్లో ‘అంతర్జాతీయ మెగా లెదర్ పార్క్’ను ఏర్పాటు చేయనున్నామని, దీనివల్ల 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేలా ప్రతిపాదన చేశామని చర్మ పరిశ్రమ అభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్) చైర్మన్ కాకుమాను రాజశేఖర్ ప్రకటించారు. తాడేపల్లిలోని లిడ్‌క్యాప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత చంద్రబాబు ప్రభుత్వం మాదిగలకు రూ. 100 కోట్లు కేటాయించి, రూ. 40 కోట్లు విడుదల చేసి తిరిగి వాటిలో రూ. 25 కోట్లు వెనక్కి తీసుకుని, చివరకు రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, డీపీఆర్‌ల పేరుతో మరో రూ. 5 కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అన్ని జిల్లాల్లో పర్యటించి లిడ్‌క్యాప్, మాదిగ సామాజిక వర్గం స్థితిగతులను పరిశీలించి నివేదిక రూపొందించామని, ఆ నివేదికను త్వరలో సీఎంకు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఎడవల్లి, కృష్ణా జిల్లా జి.కొండూరు, చిత్తూరు జిల్లా తిరుపతి, విజయనగరం జిల్లా అడ్డపూసలలో మినీ లెదర్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కేంద్రం రూ. 20.58 కోట్లు విడుదల చేసిందన్నారు. చర్మకారులకు శిక్షణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: (Andhra Pradesh: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు..) లెదర్ ఉత్పత్తుల సరఫరా కాంట్రాక్టులో టర్నోవర్ నిబంధనను రూ. కోటి నుంచి రూ. 25 లక్షలకు కుదించామన్నారు. ప్రభుత్వ సంస్థలకు వివిధ ఉత్పత్తులను సరఫరా చేసే అవకాశం లిడ్‌క్యాప్‌కు ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిపారు. తిరుపతిలో లిడ్‌క్యాప్ భూములు ఆక్రమణకు గురయ్యాయన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. లిడ్‌క్యాప్ ఆస్తులు ఆక్రమించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజశేఖర్ హెచ్చరించారు. చంద్రబాబు మెప్పుకోసం ప్రభుత్వ సలహాదారు సజ్జలపై వంగలపూడి అనిత విమర్శలు చేయడం తగదన్నారు. -
లెదర్ పార్కులో రూ.1,347 కోట్ల పెట్టుబడికి ప్రతిపాదనలు
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేస్తున్న మెగా లెదర్ ఫుట్‌వేర్, యాక్సెసరీస్ క్లస్టర్లో పెట్టుబడులు పెట్టడానికి 440 సంస్థలు ముందుకొచ్చాయి. సుమారు రూ.1,347 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 18,000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 13,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభించనుంది. ఈ మేరకు ఆయా సంస్థలు తమ ప్రతిపాదనలో పేర్కొన్నాయని కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ (కేపీఐఎల్‌సీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రత్నాకర్ పాచిగల్ల ‘సాక్షి’కి తెలిపారు. 537 ఎకరాల్లో రూ.281 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ పార్కులో యూనిట్లు నెలకొల్పడానికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి జనవరి 31 వరకు బిడ్లను ఆహ్వానించగా 440 సంస్థలు తమ ప్రతిపాదనలు పంపాయని, ఇందులో 257 యూనిట్లు ఎస్సీ వర్గాల నుంచే వచ్చాయని చెప్పారు. ‘మూడు నుంచి 15 ఎకరాల్లో యూనిట్లు ఏర్పాటు చేయడానికి 51 సంస్థలు ప్రతిపాదనలు పంపగా, 339 సంస్థలు సూక్ష్మ, చిన్న యూనిట్లు నెలకొల్పడానికి ప్రతిపాదనలు పంపాయి. వియత్నాం, తైవాన్‌తో పాటు ఇప్పటికే చెన్నై, ఆగ్రాల్లో యూనిట్లు ఉన్న సంస్థలు కూడా కృష్ణపట్నం లెదర్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి తుది ఆమోదం కోసం పరిశ్రమల శాఖకు పంపాము’ అని రత్నాకర్ వివరించారు. కాగా, లెదర్ పార్కు వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్న స్థానికుల్లో ఉన్న భయాందోళనలను తొలగించి, లెదర్‌పార్క్ రావడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించే విధంగా స్థానికులతో కలిసి స్టడీ టూర్ నిర్వహించాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. తమిళనాడులోని రాణిపేట, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా లెదర్ పార్కుల ద్వారా స్థానికులు ఎలా లబ్ధి పొందుతున్నారో ఈ స్టడీటూర్‌లో వివరించనున్నారు. స్థానిక ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం వీరిని స్టడీ టూర్‌కు తీసుకెళ్తామని, యూనిట్ల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసి సముద్రంలో 5.5 కిలోమీటర్ల లోపలకు తీసుకెళ్లి వదిలేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రత్నాకర్ వివరించారు. -
వైఎస్సార్ తలపెట్టిన ప్రాజెక్టు నేటికి సాకారం
సాక్షి, అమరావతి: ఇన్నాళ్లకు సుదీర్ఘకల నెరవేరుతోంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నెల్లూరు జిల్లాలో ప్రతిపాదించిన లెదర్ పార్క్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. సుమారు రూ.281 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ (కేపీఐఎల్‌సీ)లో యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను కోరుతూ ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. 537 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ లెదర్ పార్కులో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ కంపెనీలతోపాటు కాన్పూర్, ఆగ్రా, చెన్నైకి చెందిన అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని కేపీఐఎల్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రత్నాకర్ పాచిగల్ల తెలిపారు. ముఖ్యంగా భూ కేటాయింపుల్లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన చర్మకార సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల సంస్థలు జనవరి 18లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. మొత్తం ఈ పార్కు అభివృద్ధికి రూ.281 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేయగా.. మెగా లెదర్, ఫుట్‌వేర్ మరియు యాక్ససరీస్ క్లస్టర్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు సమకూరుస్తున్నాయని, మిగిలిన మొత్తాన్ని ఏపీఐఐసీ భరిస్తుందని తెలిపారు. భూసేకరణ పూర్తయిందని, అన్ని అనుమతులు వచ్చాయని చెప్పారు. మార్చిలోగా పనులు ప్రారంభించేందుకు కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రూ.రెండువేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 1665 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల సంస్థలు.. ఎంత భూమి కావాలి, ఎటువంటి యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు, అవసరమైన మౌలిక వసతులు వివరిస్తూ బిడ్లు పిలిచామన్నారు. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడం కోసం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీగా గ్రాంట్ థ్రాంటన్ భారత్ ఎల్ఎల్పీని ఎంపిక చేసినట్లు తెలిపారు. పర్యావరణానికి హాని లేకుండా ఈ పార్కును అభివృద్ధి చేయడానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సహకారంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. యూనిట్ల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధిచేసి సముద్రంలో 5.5 కిలోమీట్ల లోపలకు తీసుకెళ్లి వదిలే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పుష్కరకాలం తర్వాత.. షెడ్యూల్డ్ కులాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామం వద్ద లెదర్ పార్కును అభివృద్ధి చేయాలని దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంకల్పించారు. ఇందుకోసం ఏపీఐఐసీ, లిడ్‌క్యాప్ భాగస్వామ్యంతో కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ (కేపీఐఎల్‌సీ) పేరుతో ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 2009 ఆగస్టు 18న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. తర్వాత కాలంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేకపోయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఈ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. ఈ ఏడాదిన్నర కాలంలో భూమి సేకరించడంతోపాటు అన్ని అనుమతులు సాధించారు. కాలుష్యానికి అవకాశం లేకుండా.. పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మత్యకారులకు ఇబ్బంది లేకుండా కాల్యుష్యాన్ని తగ్గించే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. అదేవిధంగా కాలుష్యం తక్కువ ఉండే ఫినిషింగ్ ఉత్పత్తులను తయారుచేసే యూనిట్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు అడ్డంకిగా ఉన్న సిలికా మైనింగ్ సమస్యను పరిష్కరించి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్డింగ్ కోరాం. త్వరలో లెదర్ పార్కు పనులు ప్రారంభిచనున్నాం. – మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి -
పోరుకు సై
► లెదర్‌పార్క్ కోసం ఆందోళనలు ► ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు ► తాజాగా పోరుబాటలో దళిత సంఘాలు ► ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహం ► చొప్పదండిలో నేడు టీఏవైఎస్ మహాధర్నా చొప్పదండి : దశాబ్ద కాలంగా ప్రతిపాదనలకే పరిమితమైన లెదర్‌పార్క్(తోళ్ల పరిశ్రమ) నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీలతో పాటు, దళిత సంఘాలు ఆందోళనబాట పట్టాయి. రుక్మాపూర్‌లో లెదర్‌పార్కు నిర్మాణంపై నెల రోజులుగా ఆందోళనలు ఊపందుకున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే జిల్లా కేంద్రంతోపాటు, రుక్మాపూర్‌లోని ప్రభుత్వ భూముల వద్ద ఆందోళనలు చేపట్టాయి. తాజాగా రుక్మాపూర్‌లో లెదర్ పార్కు నిర్మాణం పూర్తి చేసి దళితులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు కూడా పోరుబాటను ఎంచుకుని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నాయి. చొప్పదండిలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం చలో చొప్పదండి పేరుతో మహాధర్నా నిర్వహించేందుకు ఆ సంఘం నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేడి మహేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంఘం వ్యవస్థాపకుడు గజ్జెల కాంతం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తరలింపు లేనట్లేనా.. రుక్మాపూర్‌లో 134 ఎకరాల్లో తోళ్ల పరిశ్రమను నిర్మించేందుకు దశాబ్దం క్రితం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భూములను లిడ్‌క్యాప్ సంస్థకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన ఆకస్మిక మృతితో ప రిశ్రమ నిర్మాణం అటకెక్కింది. వైఎస్సార్ మరణం త ర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు 134 ఎకరాల లెదర్‌పార్కు భూమిని 40 ఎకరాలకు కుదిం చారు. ఆపై ఎన్నికల సమయంలో హామీలకే తప్ప లెదర్‌పార్కుపై స్పందించే వారు కరువయ్యారు. టీ ఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లపాటు కూ డా లెదర్‌పార్కుపై ఉలుకుపలుకు లేకపోవడం గమనార్హం. ఇటీవల రుక్మాపూర్‌లో నెలకొల్పేందుకు ఉద్దేశించిన లెదర్‌పార్కును రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాకు తరలించే ప్రయత్నం చేస్తుందనే ప్రచారంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. రాజకీయపార్టీలు, దళిత సంఘాలు ఆందోళనలు చేస్తుండడంంతో లెదర్‌పార్కును తరలించొద్దని కోరుతూ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ లెదర్‌పార్కు మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. లెదర్‌పార్కు తరలిపోదని ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రకటించారు. నిర్మాణం ఊసేది 14 ఏళ్లుగా రుక్మాపూర్‌లో లెదర్‌పార్క్ నిర్మించాలనే అంశం నానుతూ వస్తోంది. రుక్మాపూర్తోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో తలపెట్టిన తోళ్ల పరిశ్రమ పూర్తికాగా.. రుక్మాపూర్‌లో మాత్రం ప్రతిపాదనలకే పరిమితమైంది. 13 ఏళ్లలో రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి వస్తే.. స్థానిక ఎమ్మెల్యే మరోపార్టీకి చెందిన వారుండేవారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే అధికార పార్టీకే చెందిన వ్యక్తి కావడంతో స్థానిక చర్మకారులు తోళ్ల పరిశ్రమపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రుక్మాపూర్‌లో తోళ్ల పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి తోళ్ల అభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్)కు ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో చర్మకారులకు ఉపాధి కల్పించేందుకు రుక్మాపూర్‌లో తోళ్ల పరిశ్రమను వెంటనే నిర్మించాలని దళిత సంఘాలు పోరుబాటను ఎంచుకున్నాయి.