సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లాలో 500 ఎకరాల్లో ‘అంతర్జాతీయ మెగా లెదర్ పార్క్’ను ఏర్పాటు చేయనున్నామని, దీనివల్ల 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేలా ప్రతిపాదన చేశామని చర్మ పరిశ్రమ అభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్) చైర్మన్ కాకుమాను రాజశేఖర్ ప్రకటించారు. తాడేపల్లిలోని లిడ్‌క్యాప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత చంద్రబాబు ప్రభుత్వం మాదిగలకు రూ. 100 కోట్లు కేటాయించి, రూ. 40 కోట్లు విడుదల చేసి తిరిగి వాటిలో రూ. 25 కోట్లు వెనక్కి తీసుకుని, చివరకు రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, డీపీఆర్‌ల పేరుతో మరో రూ. 5 కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
అన్ని జిల్లాల్లో పర్యటించి లిడ్‌క్యాప్, మాదిగ సామాజిక వర్గం స్థితిగతులను పరిశీలించి నివేదిక రూపొందించామని, ఆ నివేదికను త్వరలో సీఎంకు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఎడవల్లి, కృష్ణా జిల్లా జి.కొండూరు, చిత్తూరు జిల్లా తిరుపతి, విజయనగరం జిల్లా అడ్డపూసలలో మినీ లెదర్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కేంద్రం రూ. 20.58 కోట్లు విడుదల చేసిందన్నారు. చర్మకారులకు శిక్షణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు.
చదవండి: (Andhra Pradesh: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు..)
లెదర్ ఉత్పత్తుల సరఫరా కాంట్రాక్టులో టర్నోవర్ నిబంధనను రూ. కోటి నుంచి రూ. 25 లక్షలకు కుదించామన్నారు. ప్రభుత్వ సంస్థలకు వివిధ ఉత్పత్తులను సరఫరా చేసే అవకాశం లిడ్‌క్యాప్‌కు ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిపారు. తిరుపతిలో లిడ్‌క్యాప్ భూములు ఆక్రమణకు గురయ్యాయన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. లిడ్‌క్యాప్ ఆస్తులు ఆక్రమించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజశేఖర్ హెచ్చరించారు. చంద్రబాబు మెప్పుకోసం ప్రభుత్వ సలహాదారు సజ్జలపై వంగలపూడి అనిత విమర్శలు చేయడం తగదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment