సాక్షి, అమరావతి: ఇన్నాళ్లకు సుదీర్ఘకల నెరవేరుతోంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నెల్లూరు జిల్లాలో ప్రతిపాదించిన లెదర్ పార్క్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. సుమారు రూ.281 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ (కేపీఐఎల్‌సీ)లో యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను కోరుతూ ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. 537 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ లెదర్ పార్కులో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ కంపెనీలతోపాటు కాన్పూర్, ఆగ్రా, చెన్నైకి చెందిన అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని కేపీఐఎల్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రత్నాకర్ పాచిగల్ల తెలిపారు. ముఖ్యంగా భూ కేటాయింపుల్లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన చర్మకార సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల సంస్థలు జనవరి 18లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. మొత్తం ఈ పార్కు అభివృద్ధికి రూ.281 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేయగా.. మెగా లెదర్, ఫుట్‌వేర్ మరియు యాక్ససరీస్ క్లస్టర్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు సమకూరుస్తున్నాయని, మిగిలిన మొత్తాన్ని ఏపీఐఐసీ భరిస్తుందని తెలిపారు.
భూసేకరణ పూర్తయిందని, అన్ని అనుమతులు వచ్చాయని చెప్పారు. మార్చిలోగా పనులు ప్రారంభించేందుకు కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రూ.రెండువేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 1665 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల సంస్థలు.. ఎంత భూమి కావాలి, ఎటువంటి యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు, అవసరమైన మౌలిక వసతులు వివరిస్తూ బిడ్లు పిలిచామన్నారు. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడం కోసం ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీగా గ్రాంట్ థ్రాంటన్ భారత్ ఎల్‌ఎల్‌పీని ఎంపిక చేసినట్లు తెలిపారు. పర్యావరణానికి హాని లేకుండా ఈ పార్కును అభివృద్ధి చేయడానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సహకారంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. యూనిట్ల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధిచేసి సముద్రంలో 5.5 కిలోమీట్ల లోపలకు తీసుకెళ్లి వదిలే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పుష్కరకాలం తర్వాత..
షెడ్యూల్డ్ కులాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామం వద్ద లెదర్ పార్కును అభివృద్ధి చేయాలని దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంకల్పించారు. ఇందుకోసం ఏపీఐఐసీ, లిడ్‌క్యాప్ భాగస్వామ్యంతో కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ (కేపీఐఎల్‌సీ) పేరుతో ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 2009 ఆగస్టు 18న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. తర్వాత కాలంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేకపోయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఈ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. ఈ ఏడాదిన్నర కాలంలో భూమి సేకరించడంతోపాటు అన్ని అనుమతులు సాధించారు.
కాలుష్యానికి అవకాశం లేకుండా..
పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మత్యకారులకు ఇబ్బంది లేకుండా కాల్యుష్యాన్ని తగ్గించే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. అదేవిధంగా కాలుష్యం తక్కువ ఉండే ఫినిషింగ్ ఉత్పత్తులను తయారుచేసే యూనిట్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు అడ్డంకిగా ఉన్న సిలికా మైనింగ్ సమస్యను పరిష్కరించి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్డింగ్ కోరాం. త్వరలో లెదర్ పార్కు పనులు ప్రారంభిచనున్నాం.
– మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి
రూ. 281 కోట్లతో భారీ లెదర్ కాంప్లెక్స్
Published Mon, Jan 4 2021 4:35 AM | Last Updated on Mon, Jan 4 2021 8:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment