సాక్షి, అమరావతి: పెన్నా యవనికపై చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జీవనాడులైన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌లను జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ రెండు బ్యారేజీలను పూర్తి చేసిన ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జాతికి అంకితం చేశారు.
తండ్రి చేపట్టిన రెండు బ్యారేజీలను తనయుడు పూర్తి చేసి జాతికి అంకితం చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని అధికారవర్గాలు చెబుతున్నాయి. వందేళ్ల స్వప్నమైన రెండు బ్యారేజీలు సాకారమవడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సంగం బ్యారేజ్ కింద 3.85 లక్షల ఎకరాలు, నెల్లూరు బ్యారేజ్ కింద 99,525 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించేందుకు మార్గం సుగమమైంది.
ఏటా ఇసుక బస్తాలకు భారీ వ్యయం
► నెల్లూరు జిల్లాలో కనిగిరి, కావలి, కనుపూరు కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించేలా పెన్నా నదిపై సంగం వద్ద 1882–83లో 846 మీటర్ల పొడవు, 0.9 మీటర్ల ఎత్తుతో బ్రిటీష్ సర్కార్ ఆనకట్ట నిర్మించింది. ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగించేవారు.
సంగం ఆనకట్ట శిథిలమవడంతో 0.3 మీటర్ల ఎత్తున ఇసుక బస్తాలు వేసి నీటిని నిల్వ చేసినా ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందేవి కావు. పెన్నాకు వరద వస్తే ఇసుక బస్తాలు కొట్టుకుపోయేవి. ఇసుక బస్తాల కోసం ఏటా రూ.50 లక్షల నుంచి రూ.కోటికిపైగా వ్యయమయ్యేది. వరద వస్తే సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించేవి. ఆనకట్టలో నీళ్లు లేక తాగునీటికి తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యేవి.
► సంగం ఆనకట్టకు 20 కి.మీ. దిగువన నెల్లూరు సమీపంలో 1854–55లో 481.89 మీటర్ల పొడవు, 0.7 మీటర్ల ఎత్తుతో ఆనకట్టను నిర్మించిన బ్రిటీష్ సర్కార్ సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించింది. 1862లో వరదలకు కొట్టుకుపోవడంతో అదే ఏడాది మళ్లీ కొత్తగా 621.79 మీటర్ల పొడవుతో ఆనకట్ట నిర్మించారు. ఈ ఆనకట్ట కూడా శిథిలమవడంతో ఆయకట్టుకు నీళ్లందించడం సవాలుగా మారింది. ఇసుక బస్తాలు వేసి నీటిని నిల్వ చేసినా వరద వస్తే కొట్టుకుపోయేవి. దీనికోసం చాలా ఖర్చయ్యేది. పెన్నాకు ఏమాత్రం వరద వచ్చినా నెల్లూరు–కోవూరు మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ఆనకట్టలో నీరు లేక నెల్లూరు దాహార్తితో తల్లడిల్లేది.
► సాగు, తాగునీరు, రవాణా, ముంపు ముప్పు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆనకట్టల స్థానంలో సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌ను నిర్మించాలని వందేళ్లుగా నెల్లూరు ప్రజలు కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2004 మే 14న సీఎంగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను సాకారం చేస్తూ సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం పట్టింది.
నాటికి, నేటికి ఇదీ తేడా...
సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల పనులను 2014 నుంచి 2016 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ పూర్తిగా నిలిపివేసింది. ఆ తర్వాత కమీషన్లు వసూలు చేసుకునేందుకు వీలున్న పనులను మాత్రమే చేపట్టారు. చివరకు రెండు బ్యారేజ్‌లను పూర్తి చేయలేక చేతులెత్తేశారు. 2019 మే 30న సీఎంగా బాధ్యతలు చేపట్టాక జలయజ్ఞం ప్రాజెక్టులపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
2008 ఏప్రిల్ 29న నెల్లూరు బ్యారేజ్ పనులకు శంకుస్థాపన చేసిన వైఎస్సార్
సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. కరోనా, పెన్నాకు మూడేళ్లుగా వరదలు వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ రెండు బ్యారేజ్‌లను సీఎం జగన్ పూర్తి చేశారు. సాగు, తాగునీటితోపాటు రవాణా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారు. బ్యారేజ్‌ల ద్వారా వరదను సమర్థంగా నియంత్రించి ముంపు ముప్పు తప్పించేలా మార్గం సుగమం చేశారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేసిన నెల్లూరు బ్యారేజ్
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్
ఎక్కడ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా (సోమశిల రిజర్వాయర్‌కు 40 కి.మీ. దిగువన)
పరీవాహక ప్రాంతం: 50,122 చదరపు కిలోమీటర్లు
బ్యారేజ్ పొడవు : 1,195 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరసల రోడ్ బ్రిడ్జి)
గేట్లు : 85 గేట్లు(12 మీటర్లు ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు.. 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 స్కవర్ స్లూయిజ్ గేట్లు)
గేట్ల మరమ్మతుల కోసం సిద్ధం చేసిన
స్టాప్ లాగ్ గేట్లు : 9
గేట్ల నిర్వహణ విధానం : వర్టికల్ లిఫ్ట్
గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 7,50,196 క్యూసెక్కులు
గరిష్ట నీటి మట్టం : 35 మీటర్లు
గరిష్ట నీటి నిల్వ : 0.45 టీఎంసీలు
కనీస నీటి మట్టం : 32.2 మీటర్లు
ఆయకట్టు : 3.85 లక్షల ఎకరాలు
అంచనా వ్యయం : రూ.335.80 కోట్లు
వైఎస్సార్ హయాంలో వ్యయం : రూ.30.85 కోట్లు
టీడీపీ హయాంలో వ్యయం : రూ.86.10 కోట్లు (కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు వసూలు
చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేపట్టారు)
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.131.12 కోట్లు
నెల్లూరు బ్యారేజ్
ఎక్కడ : నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదిపై (మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌కు 20 కి.మీ. దిగువన)
పరీవాహక ప్రాంతం : 51,800 చదరపు కిలోమీటర్లు
బ్యారేజ్ పొడవు : 640 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరుసల రోడ్ బ్రిడ్జి)
గేట్లు : 51 (పది మీటర్లు ఎత్తు, మూడు మీటర్ల వెడల్పుతో 43 గేట్లు.. పది మీటర్లు ఎత్తు,
4.3 మీటర్ల ఎత్తుతో ఎనిమిది స్కవర్ స్లూయిజ్ గేట్లు)
గేట్ల మరమ్మతుకు సిద్ధం చేసిన స్టాప్‌లాగ్ గేట్లు: 6
గేట్ల నిర్వహణ : వర్టికల్ లిఫ్ట్
గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 10,90,000 క్యూసెక్కులు
గరిష్ట నీటి మట్టం : 14.3 మీటర్లు
గరిష్ట నీటి నిల్వ : 0.4 టీఎంసీలు
కనీస నీటి మట్టం : 11.3 మీటర్లు
ఆయకట్టు : 99,525 ఎకరాలు
అంచనా వ్యయం : రూ.274.83 కోట్లు
వైఎస్సార్ హయాంలో చేసిన వ్యయం : రూ.86.62 కోట్లు
టీడీపీ హయాంలో చేసిన వ్యయం : రూ.71.54 కోట్లు (కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేశారు)
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.77.37 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment