పోరుకు సై | worry about leather park at karimnagar | Sakshi
Sakshi News home page

పోరుకు సై

Published Mon, Mar 20 2017 8:18 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

worry about leather park at karimnagar

► లెదర్‌పార్క్‌ కోసం ఆందోళనలు 
► ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు
► తాజాగా పోరుబాటలో  దళిత సంఘాలు
► ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహం
► చొప్పదండిలో నేడు టీఏవైఎస్‌ మహాధర్నా
చొప్పదండి : దశాబ్ద కాలంగా ప్రతిపాదనలకే పరిమితమైన లెదర్‌పార్క్‌(తోళ్ల పరిశ్రమ) నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీలతో పాటు, దళిత సంఘాలు ఆందోళనబాట పట్టాయి. రుక్మాపూర్‌లో లెదర్‌పార్కు నిర్మాణంపై  నెల రోజులుగా ఆందోళనలు ఊపందుకున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే జిల్లా కేంద్రంతోపాటు, రుక్మాపూర్‌లోని ప్రభుత్వ భూముల వద్ద ఆందోళనలు చేపట్టాయి. తాజాగా రుక్మాపూర్‌లో లెదర్‌ పార్కు నిర్మాణం పూర్తి చేసి దళితులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దళిత సంఘాలు కూడా పోరుబాటను ఎంచుకుని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నాయి.
చొప్పదండిలోని అంబేద్కర్‌ చౌరస్తాలో తెలంగాణ అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం చలో చొప్పదండి పేరుతో మహాధర్నా నిర్వహించేందుకు ఆ సంఘం నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేడి మహేశ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంఘం వ్యవస్థాపకుడు గజ్జెల కాంతం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 
తరలింపు లేనట్లేనా..
రుక్మాపూర్‌లో 134 ఎకరాల్లో తోళ్ల పరిశ్రమను నిర్మించేందుకు దశాబ్దం క్రితం వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భూములను లిడ్‌క్యాప్‌ సంస్థకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన ఆకస్మిక మృతితో ప రిశ్రమ నిర్మాణం అటకెక్కింది. వైఎస్సార్‌ మరణం త ర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలకులు 134 ఎకరాల లెదర్‌పార్కు భూమిని 40 ఎకరాలకు కుదిం చారు. ఆపై ఎన్నికల సమయంలో హామీలకే తప్ప లెదర్‌పార్కుపై స్పందించే వారు కరువయ్యారు. టీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లపాటు కూ డా లెదర్‌పార్కుపై ఉలుకుపలుకు లేకపోవడం గమనార్హం.
ఇటీవల రుక్మాపూర్‌లో నెలకొల్పేందుకు ఉద్దేశించిన లెదర్‌పార్కును రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాకు తరలించే ప్రయత్నం చేస్తుందనే ప్రచారంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. రాజకీయపార్టీలు, దళిత సంఘాలు ఆందోళనలు చేస్తుండడంంతో లెదర్‌పార్కును తరలించొద్దని కోరుతూ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ లెదర్‌పార్కు మేనేజింగ్‌ డైరెక్టర్‌కు లేఖ రాశారు. లెదర్‌పార్కు తరలిపోదని ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రకటించారు. 
నిర్మాణం ఊసేది
14 ఏళ్లుగా రుక్మాపూర్‌లో లెదర్‌పార్క్‌ నిర్మించాలనే అంశం నానుతూ వస్తోంది. రుక్మాపూర్‌తోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో తలపెట్టిన తోళ్ల పరిశ్రమ పూర్తికాగా.. రుక్మాపూర్‌లో మాత్రం ప్రతిపాదనలకే పరిమితమైంది. 13 ఏళ్లలో రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి వస్తే.. స్థానిక ఎమ్మెల్యే మరోపార్టీకి చెందిన వారుండేవారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే అధికార పార్టీకే చెందిన వ్యక్తి కావడంతో స్థానిక చర్మకారులు తోళ్ల పరిశ్రమపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రుక్మాపూర్‌లో తోళ్ల పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి తోళ్ల అభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్‌)కు ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో చర్మకారులకు ఉపాధి కల్పించేందుకు రుక్మాపూర్‌లో తోళ్ల పరిశ్రమను వెంటనే నిర్మించాలని దళిత సంఘాలు పోరుబాటను ఎంచుకున్నాయి.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement