సాక్షి, అమరావతి: చర్మకారుల ఉపాధి, శిక్షణకు రాష్ట్రంలో 9 మినీ లెదర్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. అనంతపురం, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో రెండేసి, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేస్తారు. తొలి దశలో విజయనగరం, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరయ్యాయి. ఒక్కో దానికి రూ.4.37 కోట్ల నుంచి రూ.5.75 కోట్లు కేటాయించారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలకు మేలు జరుగుతుంది.
లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ (లిడ్‌కాప్)కు చెందిన భూమిని ఎకరం చొప్పున జిల్లాల్లో కేటాయించారు. అందులో భవనాన్ని నిర్మించి యంత్రాలు సమకూర్చుతారు. ఎంపిక చేసిన లబ్ధిదారులు వీటిలో పాదరక్షల తయారీతో ఉపాధి పొందుతారు. చర్మకార కుటుంబాల్లోని వారికి వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారు. ఇప్పటికే నిధుల మంజూరు, స్థలం కేటాయింపు, తదితరమైనవి పూర్తి కావడంతో భవన నిర్మాణం, యంత్రాల ఏర్పాటు పనులు చేపట్టాలని నాలుగు జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మినీ లెదర్ పార్కులు ఇవే..
చిత్తూరు జిల్లా తిరుపతి, విజయనగరం జిల్లా అడ్డపూసలలో ఒక్కొక్క చోట రూ.4.37 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రకాశం జిల్లా ఎడవల్లి, కృష్ణా జిల్లా జి.కొండూరులో ఒక్కొక్క చోట రూ.5.75 కోట్లతో వీటిని నిర్మిస్తున్నారు. ఎడవల్లి, జి.కొండూరులో 150 మంది చొప్పున శిక్షణ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శిక్షణకు సాంకేతిక సహకారానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (చెన్నై)తో లిడ్‌కాప్ ఒప్పందం చేసుకుంది.
ఉపాధి ఇలా..
లిడ్‌కాప్ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు పాదరక్షల తయారీలో మూడు నెలలు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అనంతరం వారికి లెదర్ పార్కులోనే యంత్రాలను సమకూర్చి, మెటీరియల్ (ముడిసరుకు) ఇస్తారు. వారు తయారు చేసిన పాదరక్షల మార్కెటింగ్ కూడా లిడ్‌కాప్ చేపడుతుంది. ఇందుకోసం లబ్ధిదారులకు నెలవారీగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనంతోపాటు ఇన్సెంటివ్ ఇస్తుంది. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కూడా వీటిలో పాదరక్షల తయారీ నేర్చుకొనే వెసులుబాటు కల్పిస్తుంది.
రాష్ట్రంలో తొలిసారిగా లెదర్‌పార్కులు: లిడ్‌కాప్ ఎండీ హర్షవర్థన్
రాష్ట్రంలో తొలిసారిగా మినీ లెదర్ పార్కుల ఏర్పాటు జరుగుతోంది. నాలుగింటికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించి, నిర్మాణం, మౌలిక వసతులు, లబ్ధిదారుల ఎంపిక వంటివి చేస్తోంది. గతేడాది కరోనా తీవ్రత వల్ల వీటి ఏర్పాటు జరగలేదు. ఈసారి ప్రత్యేక అనుమతితో నాలుగు పార్కులను ఒకేసారి చేపట్టాం. మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేసి ఎస్సీల్లోని చర్మకారుల అభివృద్ధికి ఊతమిస్తాం. వారికి అవసరమైన శిక్షణ, ముడిసరుకు, మార్కెటింగ్ వంటి వాటిపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment