నందవరం/హుకుంపేట/పెదకూరపాడు/కోళ్లపా లెం/కపిలేశ్వరపురం: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా సేవాభావంతో నిరంతరం పనిచేస్తున్న వలంటీర్లు.. తమపై వస్తున్న తప్పుడు కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము సమ్మె చేస్తామన్నామని, ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనడంలేదని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.
తప్పుడు వార్తలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల ప్రతుల్ని పలుచోట్ల దహనం చేశారు. పలు ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో నిరసన తెలిపారు. ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఏబీఎన్, ఈటీవీ, టీవీ 5 చానళ్లు అసత్య ప్రసారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తమకు సమ్మె, నిరసనలు చేసే ఆలోచనలే లేవని ముక్తకంఠంతో నినదించారు.
అసత్యవార్తలతో దెబ్బతీయలేరు
ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ఇంటింటికి చేరవేస్తున్న తమపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ కర్నూలు జిల్లాలో వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుండటంతో ఈ విధమైన అక్కసు వెళ్లగక్కుతున్నాయని చెప్పారు. తమకు ఎలాంటి సమ్మె, నిరసనలు చేసే ఉద్దేశం లేదని, అసత్యవార్తలతో వలంటీర్ల ఐక్యతను దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. నందవరం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రామోజీ, రాధాకృష్ణ డౌన్‌డౌన్ అంటూ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను దహనం చేశారు. నాగలదిన్నెలో గ్రామ సచివాలయం–1, 2 పరిధిలోను, సోమలగూడూరులోను వలంటీర్లు పచ్చపత్రికలను తగులబెట్టారు.
ఇదంతా పచ్చమీడియా కుట్ర
జీతాలు పెంచాలని వలంటీర్లు సమ్మె చేస్తున్నట్లు ఈనాడు పత్రికలో వచ్చిన కథనం అవాస్తవమని, ఇదంతా పచ్చమీడియా కుట్ర అని వలంటీర్ల అసోసియేషన్ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి బర్లు కొండబాబు, హుకుంపేట మండల శాఖ అధ్యక్షుడు మీసాల రవితేజ చెప్పారు. అవాస్తవ కథనాలు ప్రచురించిన పత్రికలకు వ్యతిరేకంగా బుధవారం హుకుంపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వలంటీర్ల అసొసియేషన్ సభ్యులు, పలువురు వలంటీర్లు మాట్లాడుతూ ప్రజలకు జరుగుతున్న మేలును చూసి తట్టుకోలేకనే పచ్చమీడియా అవాస్తవ కథనాలను ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ దేశంలోనే గుర్తింపు పొందిందన్నారు. గౌరవంతోపాటు ఉపాధి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ నినాదాలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురిస్తే తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. వలంటీర్ల అసోసియేషన్ సభ్యులు ముసిరి భవానీశంకర్, గబ్బడ శ్రీను, అప్పలరాజు, శాంతికుమారి, భాగ్యశ్రీ పాల్గొన్నారు.
వినూత్న నిరసన
సమాజసేవే పరమావధిగా.. స్వచ్ఛందంగా సేవలందిస్తున్న తమపై ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాస్తోందని బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పచాయతీ పరిధిలోని కోళ్లపాలేనికి చెందిన వలంటీర్లు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈనాడు మీడియా, టీవీ 5 ఎలక్ట్రానిక్ మీడియా తమను రెచ్చగొట్టే విధంగా తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము సమ్మెలోకి వెళ్లడం లేదని, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొంటున్నామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమకు ఇచ్చిన హామీ మేరకు విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు జెరూష, నాగవేణి, స్వప్న, రాణి, అలివేణి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు నీలా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలెవరూ నమ్మవద్దు
వలంటీర్ వ్యవస్థ రూపశిల్పి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వలంటీర్లు ఆందోళనలు చేస్తున్నట్టు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని వలంటీర్లు కోరారు. జీతాలను పెంచాలంటూ వలంటీర్లు ఆగ్రహంతో ఉన్నారని, రహదారులపై ఆందోళనలతో రగిలిపోతున్నారని సోషల్ మీడియాలోను, కొన్ని పత్రికల్లోను తప్పుడు వార్తలు వస్తున్నాయని చెప్పారు. తప్పుడు కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను దహనం చేశారు.
వలంటీర్ల ఐక్యతను దెబ్బతీయలేరు
వలంటర్లను రెచ్చగొట్టి చిచ్చుపెట్టాలనే ఉద్దేశంతోనే పచ్చమీడియా తప్పుడు వార్తలను ప్రచురిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ, వలంటీర్ వ్యవస్థలతో ప్రజలకు ప్రభుత్వసేవలు చేరువయ్యాయి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న మా సేవలను జీర్ణించుకోలేకనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఆ రెండు పత్రికలకు తగిన బుద్ధి చెబుతారు. వలంటీర్ల ఐక్యతను ఎవరూ దెబ్బతీయలేరు. మేమంతా సీఎం జగనన్నకు అండగా ఉంటాం. – భీమన్న, గ్రామ వలంటీరు, నందవరం మండలం, కర్నూలు జిల్లా
విపక్షాల కుట్రలు విఫలం
కొందరినైనా రెచ్చగొటి సమ్మెలోకి దించాలన్న విపక్షాల కుట్రలు విఫలమయ్యాయి. నిన్నటిదాక వలంటీర్లను సంఘవిద్రోహ శక్తులతో పోలుస్తూ ప్రతిపక్షాలు, పచ్చమీడియా విషప్రచారం చేశాయి. ఇప్పుడు వలంటీర్లపై లేనిపోని ప్రేమను కురిపించి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వలంటీర్ల సోషల్ మీడియాలోకి పచ్చబ్యాచ్ దూరి అసత్య పోస్టులు పెడుతున్నారు. వలంటీర్లు అందరూ ఆడుదాం ఆంధ్రాలో పాల్గొంటున్నారు. అవాస్తవాలు చెప్పే వారిని శిక్షించాలి. – వెలితోటి చిన్నబాబు, పల్నాడు జిల్లా వలంటీర్ల యూనియన్ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment