
అనాథలైన స్వాతి, పల్లవి (ఇన్‌సెట్‌లో) యుగంధర్(ఫైల్)
సంతబొమ్మాళి: పసి వయస్సులోనే బండెడు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. తోటి వారందరూ ఆడుతూపాడుతూ గడుపుతుంటే విధి వారి పాలిట శాపంగా మారింది. తల్లిదండ్రులు అకాలంగా మృతి చెందడంతో ఈ బాలికల ఆవేదన పలువురిని కలిచి వేసింది. మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన కొంచాడ యుగంధర్‌కు ఉషారాణితో 2007లో వివాహమైంది. వీరికి స్వాతి, పల్లవి అనే కుమార్తెలున్నారు. టీ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే విధి మరోలా తలచింది.
యుగంధర్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో భార్య ఉషారాణి సహాయంతో టీ దుకాణాన్ని నడుపుతూ కుటుంబాన్ని కొంత కాలం పోషించుకుంటూ వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఉషారాణికి (36) గుండెపోటు రావడంతో మృతి చెందింది. కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకొనే స్థోమత లేకపోవడంతో యుగంధర్ (41) ఆదివారం మృతి చెందాడు. ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. పెద్దకుమార్తె స్వాతి 9వ తరగతి, చిన్న కుమార్తె పల్లవి 7వ తరగతి నౌపడ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. అనాథలైన వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment