
శస్త్ర చికిత్స అనంతరం శ్రీకాకుళంలోని పెద్దమ్మ ఇంట్లో పిల్లలతో జోషిత
తిరుపతి: ‘‘అమ్మ కావాలి.. అమ్మ ఎప్పుడు వస్తుంది...’’అంటూ చిన్నారి జోషిత 12 రోజులుగా తరచూ కలవరిస్తూనే ఉంది. ఈనెల 5వ తేదిన శ్రీవారి దర్శనం కోసం వస్తూ చంద్రగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలను కోల్పోయిన రెండేళ్ల చిన్నారి జోషిత ప్రాణాలతో బయటపడింది. మూడు రోజుల పాటు ఈ చిన్నారికి తిరుపతి రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో చికిత్స అందించారు.
అనంతరం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విరిగిన కాలికి శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రి నుంచి 13న డిశ్చార్జ్ అయి శ్రీకాకుళంలోని పెదనాన్న మధుబాబు, పెద్దమ్మ శ్రీలత సంరక్షణలో కోలుకుంటోంది. ఘటన జరిగి 12 రోజులవుతున్నా ఇంకా కలవరపాటుకు గువుతోందని జోషిత పెద్దమ్మ శ్రీలత ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు.
ప్రమాదం జరిగిన నాటి నుంచి జోషిత ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ చూపి, డాక్టర్లు, బంధువులతో సమన్వయం చేస్తూ సహకరించిన ‘సాక్షి’కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తమది ఉమ్మడి కుటుంబం కావటంతో జోషిత వయసున్న పిల్లలు ఐదుగురు ఉన్నారని చెప్పారు. ఆ పిల్లలతో మమేకమై, తల్లిదండ్రులు లేనిలోటు నుంచి కొంతవరకు బయటపడుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment