Pythons Roam In Kolleru Eluru District - Sakshi
Sakshi News home page

కొల్లేట్లో కొండచిలువ.. ఐయూసీఎన్‌ రెడ్‌ లిస్టులో ‘రాక్‌ పైథాన్‌’

Published Wed, Jan 25 2023 8:56 AM | Last Updated on Wed, Jan 25 2023 3:07 PM

Pythons Roam In Kolleru Eluru District - Sakshi

కొల్లేరంటే కిక్కిస పొదలు.. పెద్దింట్లమ్మ ఆలయం.. విభిన్న రకాల చేపలు.. వలస పక్షులు.. నీటి పిల్లులు.. అరుదైన కుక్కలకు మాత్రమే ప్రసిద్ధి అనేది మొన్నటి మాట. ఆ జాబితాలో ఇప్పుడు కొండ పాములుగా పిలిచే కొండచిలువలు(ఇండియన్‌ రాక్‌ పైథాన్లు) సైతం చేరిపోయాయి.

సుమారు మూడు దశాబ్దాల క్రితం ఎగువ అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొల్లేరుకు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఉప్పుటేరుల మధ్య పొదలు.. చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని మనుగడ సాగిస్తున్నాయి.

కైకలూరు(ఏలూరు జిల్లా): కొండ చిలువలు చెట్లపై మాత్రమే ఉంటాయని భావిస్తుంటారు. ఇవి నీటిలో సైతం వేగంగా ఈదగలవు. ఎక్కువ సమయం ఇవి నీటిలోనే గడుపుతుంటాయి. చిత్తడి నేలలు, గడ్డి భూములు, రాతి పర్వతాలు, నదీ లోయల్లో ఇవి నివసిస్తుంటాయి. పాడుబడిన క్షీరదాల బొరియలు, చెట్లు, మడ అడవుల్లో దాక్కుంటాయి. కోళ్లు, పక్షులు, ఎలుకలు, అడపాదడపా ఇతర జంతువులను సైతం ఆహారంగా తీసుకుంటాయి.

అలాంటి కొండచిలువలు ఇప్పుడు కొల్లేరుకు అతిథులయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 9 మండలాల పరిధిలో.. 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్క­డ 2.80 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు సాగవుతు­న్నాయి. ఈ చెరువుల చెంతకు సుమారు మూ­డు దశాబ్దాల క్రితం అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొండచిలువలు వలస రావటం మొదలైంది. కిక్కిస పొదలు, చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడే తిష్టవేశాయి.  

ఇట్టే పెరిగిపోతాయి 
ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండంగి, మట్టగుంట, పడమటిపాలెం, కైకలూరు మండలం ఆటపాక, వరాహపట్నం, భుజబలపట్నం, ముదినేపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతాల్లో కొండచిలువల సంచారం కనిపిస్తోంది. చేపల చెరువులపై కొండచిలువలు సంతానోత్పత్తి చేస్తున్నాయి. ఇండియన్‌ రాక్‌ పైథాన్‌గా పిలిచే కొండచిలువల శాస్త్రీయ నామం పైథాన్‌ మోలురూస్‌. ఇవి 12 అడుగుల పొడవు, 52 కేజీల బరువు పెరుగుతాయి. వీటి జీవిత కాలం గరిష్టంగా 21 సంవత్సరాలు. ఇవి పుట్టిన తర్వాత త్వరగా పెద్దవి అవుతాయి. ఏడాది వయసు దాటిన తర్వాత నుంచి జత కడుతుంటాయి.

సాధారణంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఇవి జత కట్టి 2 నుంచి 3 నెలల్లో గర్భం దాలుస్తాయి. అనంతరం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో రోజుకు 20 నుంచి 30 గుడ్ల చొప్పున కనీసం 100 గుడ్ల వరకు పెడతాయి. నాలుగు నెలల పాటు గుడ్లను పొదుగుతాయి. పొదిగిన గుడ్లలో 80 శాతానికి పైగా పిల్లలు అవుతాయి. పుట్టిన పిల్లలు 18–24 అంగుళాల వరకు పొడవు ఉంటాయి. అయితే, పుట్టిన వాటిలో 25 శాతం పిల్లల్ని వరకు తల్లే తినేస్తుంది. ఆహారం అందక ఇంకొన్ని చనిపోతాయి. చివరకు 10–15 పిల్లలు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. ఇవి మాంసాహారులు. క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలను తింటాయి. ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత వారం పాటు ఏమీ తినకుండా ఉండగలవు. ఎక్కువగా ఒంటరి జీవితం గడుపుతాయి. సంభోగ సమయంలో మాత్రమే జత కడతాయి. ప్రపంచంలో అతి పెద్ద పాముల్లో ఇది కూడా ఒకటి.  

కొండచిలువలకు అండ ఏదీ!
కొండచిలువలు విషసర్పాలు కానప్పటికీ ప్రజల చేతిలో హతమవుతున్నాయి. వీటి ఆకారం భారీగా ఉండటంతో ప్రజలు భయపడి చంపేస్తున్నారు. కొద్ది ఘటనల్లో మాత్రమే అటవీ శాఖ అధికారులు వీటిని రక్షించి చింతలపూడి ఎగువన అడవుల్లో వదులుతున్నారు.

ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) హాని కలిగే జాతుల జాబితా (రెడ్‌ లిస్ట్‌)లో వీటిని చేర్చింది. ఐయూసీఎన్‌ సంస్థ దాదాపు 40 శాతం రాక్‌ పైథాన్‌ జాతి అంతరించిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొల్లేరు గ్రామాల్లో ఏటా 30 నుంచి 40 కొండచిలువలు ప్రజల చేతిలో హతమవుతున్నట్టు అంచనా. అటవీ శాఖ కొండచిలువలను కూడా షెడ్యూల్‌–1లో చేర్చింది. వీటిని చంపటం నేరమని ప్రకటించింది.

చంపొద్దు.. సమాచారం ఇవ్వండి..  
ఇండియన్‌ రాక్‌ పైథాన్‌లు అరుదైన సరీసృపాలు. ఇవి విషపూరితం కావు. చేపల చెరువుల వద్ద ఇవి సంచరిస్తున్నాయి. అరుదుగా జనా­లకు తారసపడుతున్నాయి. ఇటీవల మత్స్యకారుల వలల్లో ఇవి చిక్కాయి. అటవీ శాఖ సిబ్బంది వీటిని అడవుల్లో సురక్షితంగా వదులుతున్నారు. కొండచిలువలు కనిపిస్తే వాటిని చంపొద్దు. వీటిని చంపటం నేరం. అందువల్ల ఎక్కడైనా కొండచిలువలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం తెలియజేయండి. 
– జె.శ్రీనివాస్, అటవీ శాఖ రేంజర్, కైకలూరు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement