pythons
-
మేకను మింగిన కొండచిలువ
కర్ణాటక: తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలూకా చెన్నరాయనదుర్గ దగ్గర మణువినకురికె గ్రామంలో పెద్ద కొండచిలువ కలకలం రేపింది. నాగరాజు అనే రైతు మేకలను తోలుకుని వెళ్లగా ఒక మేకను కొండ చిలువ పట్టుకుని ఆరగించింది. భుక్తాయాసంతో అక్కడి నుంచి కదలేని స్థితిలో ఉండగా చూసిన నాగరాజు ఊరి ప్రజలకు, అటవీ సిబ్బందికి సమాచారమిచ్చాడు. వారు వచ్చి దానిని పట్టుకున్నారు. ఇది 9 అడుగుల పొడవుతో సుమారు 30 కేజీల బరువు ఉంది. తరువాత దూరంగా వదిలిపెట్టారు. కొండచిలువ వల్ల నాగరాజుకు రూ.10 వేలు నష్టమైంది. -
చెన్నై తిరుచ్చి విమానాశ్రయంలో కొండచిలువల కలకలం
చెన్నై: మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో తిరుచ్చి విమానశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి సూట్‌కేసులో ప్రమాదకరమైన కొండచిలువలు, పాములు, బల్లులు ఉండటాన్ని చూసి విస్తుపోయారు తిరుచ్చి కస్టమ్స్ సిబ్బంది. వాటిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. సినిమాల ప్రభావమో ఏమోగానీ స్మగ్లింగ్ పేరిట ఏది పెడితే అది విమానాల్లో రవాణా చేసే స్థాయికి ఎదిగిపోయారు స్మగ్లర్లు. తాజాగా మొహమ్మద్ మొయిద్దీన్ అనే ఓ ప్రయాణికుడు కౌలాలంపూర్ నుండి వస్తూ తనతోపాటు సూట్‌కేసులో కొండచిలువ పిల్లలు, బంగారు బల్లుల్ని వెంట తీసుకొచ్చాడు. ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు ఆతడి సూట్‌కేసును తనిఖీ చేయగా అందులో 47 కొండచిలువ పిల్లలు, 2 బంగారు బల్లులను కనుగొన్నారు. అవి ప్రాణాలతో ఉండటాన్ని చూసి కంగారుపడ్డ కస్టమ్స్ అధికారులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించి అతడిని మాత్రం విచారణ నిమిత్తం కస్టడీకి తరలించారు. విమానంలో సజీవంగా ఉన్న కొండచిలువలను, బల్లులను ఎలా తీసుకువచ్చి ఉంటాడన్నదే కస్టమ్స్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతను మలేషియాలో సెక్యూరిటీ వాళ్ళ కళ్ళుగప్పి ఎలా రాగలిగాడు, అక్కడి ఎయిర్‌పోర్టు సిబ్బంది సరిగ్గా తనిఖీలు నిర్వహించలేదా ఏంటన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అతనెవరు? అసలెందుకు చెన్నై వచ్చాడు? ఈ స్మగ్లింగ్ ముఠాలో ఇంకా ఎవరెవరున్నారన్న వివరాలపై ఆరా తీస్తున్నారు కస్టమ్స్ అధికారులు. #TamilNadu- Customs officials caught a Malaysian passenger with 47 exotic pythons and two lizards at #Trichy airport on Sunday. pic.twitter.com/kVggJIP08C — Suresh (@isureshofficial) July 30, 2023 ఇది కూడా చదవండి: ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్? -
అమ్మ బాబోయ్! ఇంటి రూఫ్‌లో 3 కొండచిలువలు.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే
-
కొల్లేట్లో కొండచిలువ.. ఐయూసీఎన్ రెడ్ లిస్టులో ‘రాక్ పైథాన్’
కొల్లేరంటే కిక్కిస పొదలు.. పెద్దింట్లమ్మ ఆలయం.. విభిన్న రకాల చేపలు.. వలస పక్షులు.. నీటి పిల్లులు.. అరుదైన కుక్కలకు మాత్రమే ప్రసిద్ధి అనేది మొన్నటి మాట. ఆ జాబితాలో ఇప్పుడు కొండ పాములుగా పిలిచే కొండచిలువలు(ఇండియన్ రాక్ పైథాన్లు) సైతం చేరిపోయాయి. సుమారు మూడు దశాబ్దాల క్రితం ఎగువ అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొల్లేరుకు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఉప్పుటేరుల మధ్య పొదలు.. చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని మనుగడ సాగిస్తున్నాయి. కైకలూరు(ఏలూరు జిల్లా): కొండ చిలువలు చెట్లపై మాత్రమే ఉంటాయని భావిస్తుంటారు. ఇవి నీటిలో సైతం వేగంగా ఈదగలవు. ఎక్కువ సమయం ఇవి నీటిలోనే గడుపుతుంటాయి. చిత్తడి నేలలు, గడ్డి భూములు, రాతి పర్వతాలు, నదీ లోయల్లో ఇవి నివసిస్తుంటాయి. పాడుబడిన క్షీరదాల బొరియలు, చెట్లు, మడ అడవుల్లో దాక్కుంటాయి. కోళ్లు, పక్షులు, ఎలుకలు, అడపాదడపా ఇతర జంతువులను సైతం ఆహారంగా తీసుకుంటాయి. అలాంటి కొండచిలువలు ఇప్పుడు కొల్లేరుకు అతిథులయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 9 మండలాల పరిధిలో.. 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ 2.80 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు సాగవుతున్నాయి. ఈ చెరువుల చెంతకు సుమారు మూడు దశాబ్దాల క్రితం అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొండచిలువలు వలస రావటం మొదలైంది. కిక్కిస పొదలు, చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడే తిష్టవేశాయి. ఇట్టే పెరిగిపోతాయి ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండంగి, మట్టగుంట, పడమటిపాలెం, కైకలూరు మండలం ఆటపాక, వరాహపట్నం, భుజబలపట్నం, ముదినేపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతాల్లో కొండచిలువల సంచారం కనిపిస్తోంది. చేపల చెరువులపై కొండచిలువలు సంతానోత్పత్తి చేస్తున్నాయి. ఇండియన్ రాక్ పైథాన్‌గా పిలిచే కొండచిలువల శాస్త్రీయ నామం పైథాన్ మోలురూస్. ఇవి 12 అడుగుల పొడవు, 52 కేజీల బరువు పెరుగుతాయి. వీటి జీవిత కాలం గరిష్టంగా 21 సంవత్సరాలు. ఇవి పుట్టిన తర్వాత త్వరగా పెద్దవి అవుతాయి. ఏడాది వయసు దాటిన తర్వాత నుంచి జత కడుతుంటాయి. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇవి జత కట్టి 2 నుంచి 3 నెలల్లో గర్భం దాలుస్తాయి. అనంతరం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో రోజుకు 20 నుంచి 30 గుడ్ల చొప్పున కనీసం 100 గుడ్ల వరకు పెడతాయి. నాలుగు నెలల పాటు గుడ్లను పొదుగుతాయి. పొదిగిన గుడ్లలో 80 శాతానికి పైగా పిల్లలు అవుతాయి. పుట్టిన పిల్లలు 18–24 అంగుళాల వరకు పొడవు ఉంటాయి. అయితే, పుట్టిన వాటిలో 25 శాతం పిల్లల్ని వరకు తల్లే తినేస్తుంది. ఆహారం అందక ఇంకొన్ని చనిపోతాయి. చివరకు 10–15 పిల్లలు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. ఇవి మాంసాహారులు. క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలను తింటాయి. ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత వారం పాటు ఏమీ తినకుండా ఉండగలవు. ఎక్కువగా ఒంటరి జీవితం గడుపుతాయి. సంభోగ సమయంలో మాత్రమే జత కడతాయి. ప్రపంచంలో అతి పెద్ద పాముల్లో ఇది కూడా ఒకటి. కొండచిలువలకు అండ ఏదీ! కొండచిలువలు విషసర్పాలు కానప్పటికీ ప్రజల చేతిలో హతమవుతున్నాయి. వీటి ఆకారం భారీగా ఉండటంతో ప్రజలు భయపడి చంపేస్తున్నారు. కొద్ది ఘటనల్లో మాత్రమే అటవీ శాఖ అధికారులు వీటిని రక్షించి చింతలపూడి ఎగువన అడవుల్లో వదులుతున్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) హాని కలిగే జాతుల జాబితా (రెడ్ లిస్ట్)లో వీటిని చేర్చింది. ఐయూసీఎన్ సంస్థ దాదాపు 40 శాతం రాక్ పైథాన్ జాతి అంతరించిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొల్లేరు గ్రామాల్లో ఏటా 30 నుంచి 40 కొండచిలువలు ప్రజల చేతిలో హతమవుతున్నట్టు అంచనా. అటవీ శాఖ కొండచిలువలను కూడా షెడ్యూల్–1లో చేర్చింది. వీటిని చంపటం నేరమని ప్రకటించింది. చంపొద్దు.. సమాచారం ఇవ్వండి.. ఇండియన్ రాక్ పైథాన్లు అరుదైన సరీసృపాలు. ఇవి విషపూరితం కావు. చేపల చెరువుల వద్ద ఇవి సంచరిస్తున్నాయి. అరుదుగా జనాలకు తారసపడుతున్నాయి. ఇటీవల మత్స్యకారుల వలల్లో ఇవి చిక్కాయి. అటవీ శాఖ సిబ్బంది వీటిని అడవుల్లో సురక్షితంగా వదులుతున్నారు. కొండచిలువలు కనిపిస్తే వాటిని చంపొద్దు. వీటిని చంపటం నేరం. అందువల్ల ఎక్కడైనా కొండచిలువలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం తెలియజేయండి. – జె.శ్రీనివాస్, అటవీ శాఖ రేంజర్, కైకలూరు -
చేపల కోసం వల వేస్తే.. కొండ చిలువ చిక్కింది..
నెల్లూరు (బుచ్చిరెడ్డిపాళెం): చేపలు పట్టేందుకు వల విసిరితే 15 అడుగుల కొండచిలువ చిక్కింది. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో సోమవారం జరిగింది. ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ ఆఫీసర్ పిచ్చిరెడ్డి కథనం మేరకు.. మండలంలోని పల్లిపాళెంకు చెందిన కొందరు జాలర్లు దామరమడుగు–కళయకాగోల్లు గ్రామాల మధ్య పెన్నానది సమీపంలో ఉన్న గుంతలో చేపలు పట్టేందుకు వల విసిరారు. ఆ వలలో దాదాపు 15 అడుగుల భారీ కొండ చిలువ చిక్కుకుంది. అయితే వలను లాగే సమయంలో బరువుగా ఉండడంతో ఎక్కువ సంఖ్యలో చేపలు పడ్డాయని భావించిన జాలర్లు మరి కొందరి జాలర్ల సహాయంతో వలను బయటకు తీశారు. వల బయటకు రావడంతో అందులో భారీ కొండ చిలువను చూసి భయంతో పరుగులు తీశారు. తర్వాత కొంత సమయానికి ధైర్యం తెచ్చుకున్న జాలర్లు తమకు సమాచారం అందిచారని తెలిపారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పామును స్వాధీనం చేసుకుని ఆత్మకూరు పారెస్ట్ ఏరియాలో వదిలి పెట్టామన్నారు. గతేడాది వచ్చిన భారీ వరదలకు కొండల నుంచి వచ్చిన ఈ పాములు పెన్నా నది సమీపంలోని చేపల గుంతల్లో చేరి చేప లను తింటూ జీవిస్తున్నాయని తెలిపారు. గతంలో కూడా రెండు చోట్ల కొండ చిలువలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
వల నిండా.. కొండచిలువలు
అల్లాదుర్గం (మెదక్) : చేపలు పట్టేందుకు వల వేస్తే రెండు కొండచిలువలు చిక్కాయి. అల్లాదుర్గం గ్రామానికి చెందిన గోండ్ల సాయిలు మంగళవారం అప్పాజీపల్లి చెరువులో చేపలు పట్టేందుకు వల వేయగా రెండు కొండచిలువలు చిక్కుకున్నాయి. మీటరున్నర పొడవున్న వీటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలి వేసినట్లు సాయిలు తెలిపారు. (క్లిక్: మస్క్ మలన్‌తో మస్తు పైసలు) -
షాకింగ్ ఘటన: మృతదేహం చుట్టూ 125 పాములు
అమెరికాలో ఒళ్లు గగుర్పుడిచే ఘటన చోటుచేసుకుంది. అత్యంత విషమైన 125 పాములు మధ్య ఓ వ్యక్తి విగత జీవిగా పడిఉండటం తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. మేరీలాండ్‌లోని చార్లెస్ కౌంటీ ప్రాంతంలో నివసించే 49 ఏళ్ల వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వారు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఇంట్లో వ్యక్తి మృతదేహం కిందపడి ఉండగా.. ఆ మృతదేహం చుట్టే 125 పాములు పాకుతూ కనిపించాయి. అందులో అత్యంత విషపూరితమైన కోబ్రాలతోపాటు, 14 అడుగుల ఓ కొండచిలువ కూడా ఉంది. అయితే ఆ సర్పాలను అతడు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. సహాయక సిబ్బందితో కలిసి పోలీసులు ఆ పాములన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా అతడి మరణానికి ఇంకా కారణాలు తెలియలేదు. అయితే పాములే కాటు వేశాయా.. లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు! -
సిగ్గెక్కువ.. కానీ, కాటేస్తే వందమంది ఖతం!
ఈ భూమ్మీద సమస్త జీవరాశుల్లో సర్పాలు ఉన్నాయి. కానీ, మనుషుల భయాలు, అపోహలతో వాటి జనాభా తగ్గిపోతూ వస్తోంది. ఇది ఎంతవరకు సరైందన్నది పక్కనపెడితే.. చాలామందిలో చెడును చెప్పడానికి ‘పాములాంటోడు’ అని వర్ణిస్తుంటారు. కానీ, అవి అంత ప్రమాదకరమైనవి మాత్రం కావు. ఈ భూమ్మీద దాదాపు 4 వేల జాతుల దాకా పాములు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్తగా కనుగొంటూ పోతున్నారు. ఈ మొత్తంలో 650కి(25 శాతం) పైగా జాతులు మాత్రమే విషపూరితమైనవని సైంటిస్టులు ఇప్పటిదాకా(జులై 7 రిపోర్ట్ ప్రకారం) గుర్తించారు. అందులోనూ 200 జాతుల(10 శాతం) పాముల నుంచి మాత్రమే మనిషికి ముప్పు ఉంటోందని తేల్చారు. కానీ, అవేం పట్టించుకోకుండా కనిపిస్తే చంపేస్తూ.. వాటి జనాభాను తగ్గించేస్తున్నారు. అందుకే వాటి పరిరక్షణ కోసం, పాములన్నీ ప్రమాదకరమైనవి కాదని జనాల్లో అవగాహన కల్పించాలని.. అందుకోసం ఓ రోజు ఉండాలని జులై 16న వరల్డ్ స్నేక్ డే ను నిర్వహిస్తున్నారు కొందరు(స్నేక్ సొసైటీలు). ప్రతీ ఏడాది ఇదే థీమ్‌తో ముందుకు సాగుతున్నారు. వాసన కోసం నాలిక పాములకు చూపు సామర్థ్యం చాలా తక్కువ. చెవుల్లేకున్నా వినికిడి శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది. పాము కింది దడవలో ఉన్న ఎముకలు శబ్దతరంగాలను పసిగడతాయి. కానీ, వాసన విషయంలో మాత్రం గొప్ప సామర్థ్యం కలిగి ఉంటాయి. అవి నాలుకతోనే వాసనను పసిగడతాయి. అందుకే ఎప్పుడూ అవి నాలికను అలా బయటకు ఆడిస్తుంటాయి. అత్యంత విషపూరితమైనవి విషానికి ప్రాథమిక కొలమానం ఎల్డీ 50. లెథాల్ డోస్ 50 పర్సంట్ టెస్ట్ అని పిలుస్తారు దీన్ని. ఈ పద్దతిలో పాముల విషాన్ని పరిశీలించే.. అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాముల జాబితాను సిద్ధం చేస్తుంది ఇంటర్నేషనల్ స్నేక్ సొసైటీ. ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్.. ఆస్ట్రేలియాలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాము జాతి. దీని విషం నిమిషాల్లో మనిషిలో అంతర్గతంగా రక్త స్రావం అయ్యేలా చేస్తుంది. కిడ్నీలను పాడు చేస్తుంది. ఒక్కోసారి మెదడుకు చేరి పక్షవాతాన్ని కలగజేస్తుంది. చివరికి రక్తం గడ్డకట్టేలా చేసి మనిషి ప్రాణం తీస్తుంది. టైగర్ స్నేక్ ఎలాపిడ్ జాతికి చెందిన టైగర్ స్నేక్ పాములు కూడా ఆస్ట్రేలియా గడ్డపైనే కనిపిస్తాయి. ఒంటిపై ఉండే మచ్చల కారణంగా వాటికి టైగర్ స్నేక్ అనే పేరొచ్చింది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ.. అరగంటలో మనిషి మరణానికి కారణం అవుతుంటాయి. టైగర్స్నేక్స్ విషం నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపెడుతుంది. కండరాల్లో రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. కోబ్రా తరహాలో పడగ విప్పి.. భయపెడుతుంది. ఇన్‌ల్యాండ్ టైపాన్ ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైన పాము ఇది(అనధికారికంగా). వంద గ్రాముల విషంతో వంద మందిని చంపగలిగే సామర్థ్యం ఉన్న పాము ఇది. వంద గ్రాముల విషాన్ని ఒకే కాటుతో దింపగలదు ఇది. కానీ, ఎల్డీ50 ప్రకారం(త్వరగా ప్రాణం తీసే లెక్కప్రకారం).. లిస్ట్ వల్ల మూడో ప్లేస్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ విషం ప్రభావంతో గంటలో ప్రాణం పోవడం ఖాయం. ఇవి జనారణ్యానికి దూరంగా ఏకాంతంగా బతుకుతాయి. ఈ పాముకి ‘సిగ్గు’ ఎక్కువ అని అంటుంటారు. మనుషులను చూస్తే.. ఇవి వేగంగా పాక్కుంటూ వెళ్లి ఓ మూల దాక్కుంటాయి. అలా ఈ డేంజర్ స్నేక్కు ‘సిగ్గున్న పాము’గా ముద్దు పేరు వచ్చింది. రస్సెల్స్ వైపర్ ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పాము జాతిగా పేరుంది రస్సెల్స్ వైపర్‌కి. అంతేకాదు ఎక్కువ మరణాలకు కారణమైన జాతి కూడా ఇదే. దీనిని గుర్తించడం కూడా చాలా తేలిక. భయంతో ఉన్నప్పుడు అది గట్టిగా శబ్దం చేస్తుంటుంది. కాటు వేసిన మరుక్షణం నుంచే విషం శరీరంలోకి ఎక్కేస్తుంటుంది. ఒక్క రస్సెల్స్ వైపర్ గక్కే విషంతో లక్షా యాభై వేల ఎలుకలను చంపొచ్చనేది సైంటిస్టుల మాట. బ్లూ క్రాయిట్ ఆసియాలో ప్రమాదకరమైన పాముల్లో దీని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. దీని విషయం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది. చికిత్స అందినా సగం మంది చనిపోతుంటారు. అంత ప్రమాదకరమైంది ఈ పాము విషం. ఇవి విషపూరితమైన పాముల్నే ఆహారంగా తీసుకుంటాయి. జనసంచారానికి దూరంగా పగటి పూట పచ్చిక బయళ్లలో, అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి ఇవి. బూమ్స్లాంగ్ క్లౌబ్రిడ్ కుటుంబంలో అత్యంత విషపూరితమైన పాము జాతి ఇది. రంగు రంగుల్లో ఉంటాయి ఇవి. విషం అంత విషపూరితమైనది కాకపోయినా.. రక్తస్రావం కారణంగా ప్రాణం పోతుంటుంది. అందుకే ప్రమాదకరమైన పాముల లిస్ట్‌లో చేర్చారు. అయితే ఇవి మనుషులు కనిపిస్తే.. దూరంగా వెళ్లిపోతుంటాయి. ఇవి దాడులు చేసే సందర్భాలు చాలా తక్కువ. చెట్ల మీద ఉంటూ పక్షుల్ని, పురుగులని తింటాయి. మోజావే రాటెల్స్నేక్ అమెరికా నుంచి పాము జాతుల్లో అత్యంత విషపూరితమైన లిస్ట్‌లో ఫస్ట్ కనిపించేది ఇదే. రక్తం, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది దీని విషం. నైరుతి అమెరికా పప్రాంతంలో ఎక్కువ మరణాలు సంభవించేది ఈ పాముల వల్లే. స్టిలెట్టో స్నేక్ పరిణామంలో చిన్నగా ఉండి, కలుగుల్లో దాక్కునే పాము ఇది. కానీ, విషపూరితమైంది. అయితే అదృషవశాత్తూ ఇది ఎక్కువ విషాన్ని కక్కదు. కానీ, దీని విషం ఎంత ప్రమాదకరమంటే.. కణజాలాన్ని దెబ్బ తీయడంతో పాటు గుండె పనితీరును స్తంభింపజేస్తుంది. అంతేకాదు వీటిని పట్టడం కూడా అంత ఈజీ కాదు. కోరలు కూడా విచిత్రంగా వంగి ఉంటాయి. కాబట్టి, నేరుగా కాకుండా వంగి మరీ కాటు వేస్తుంది స్టిలెట్టో. సా స్కేల్డ్ వైపర్ ఇది అంత విషపూరితమైన పాము కాదు. కానీ, ప్రమాదకరమైన జాతిలో ఒకటి. భారత్ తో సహా చాలా దేశాల్లో ఇవి కనిపిస్తుంటాయి. చిన్నసైజులో ఉన్నప్పటికీ అగ్రెసివ్‌గా ఇవి దాడులు చేస్తాయి. వైపర్ జాతి పాముల్లాగే రక్తం గడ్డకట్టించి చంపుతాయి. అయితే విరుగుడు వెంటనే ఇవ్వకపోతే బతకడం కష్టం. ఇసుకలో దాక్కుని వేటాడుతుంటాయి. ఒకవేళ దగ్గరగా వెళ్లాలని ప్రయత్నిస్తే.. గట్టిగా శబ్ధం చేస్తూ భయపెడుతుంటాయి. కింగ్ కోబ్రా విషానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ జాతి. అత్యంత పొడవైన విషపూరితమైన పాము కింగ్ కోబ్రా. పైన చెప్పుకున్నంత రేంజ్లో వీటిలో విషం లేకపోయినా.. ఎక్కువ పరిమాణంలో విషం చిమ్మడం, కాటు వేయడంతో పాటు రూపంతోనే భయపెట్టేస్తుంటాయివి. ఇక ఆడ పాము గూడుకట్టి గుడ్లు పెట్టాక.. మగపాముతో కలిసి కాపలా కాస్తుంటుంది. వీటితో పాటు కోస్టల్ టైపాన్, బాండెడ్ క్రాయిట్, కామన్ డెత్ ఆడర్, సముద్రంలో ఉండే బీక్డ్ సీ స్నేక్, ఆఫ్రికన్ డేంజరస్ స్నేక్ జాతి ‘బ్లాక్ మాంబా’, చైనీస్ కోపర్హెడ్, సౌత్ అమెరికన బుష్‌మాస్టర్, ఫర్ డె డాన్స్, బెల్చర్స్ సీ స్నేక్, బ్లూ మలయన్ కోరల్ స్నేక్.. ఆ తర్వాతి స్థానాలో ఉన్నాయి. ఇక వీటితో పాటు విషం లేని బుక్స్నేక్(నార్త్ అమెరికా, అమెరికా), కొండ చిలువ జాతికి చెందిన పాములు, జెనస్ యూనెక్టస్కు చెందిన వాటర్ బోస్(అనకొండ) కూడా ఈ భూమ్మీద ఉన్నాయి. అదృష్టం అంటే దీనిదే.. చాలాకాలం కిందట వైరల్ అయిన వీడియో ఇది How could we dedicate #WorldSnakeDay to anything else? 🐍#PlanetEarth2 pic.twitter.com/B4YxSxqmvm — BBC Earth (@BBCEarth) July 16, 2018 "I'm asking you to respect these creatures, because they have a right to be on Earth, the same way we do." We know many of you may be scared of snakes but it's #WorldSnakeDay, so we asked the 'Snake Man of Lagos' - Dr Mark Ofua - why it's so important we protect them. 🐍 pic.twitter.com/DgWc12NvoS — BBC News Africa (@BBCAfrica) July 16, 2019 -
పాముల బుసలకు పైకప్పు మటాష్!
చిన్న పాము కనిపిస్తేనే భయంతో వణికిపోతాం. అమాంతం అక్కడి నుంచి పారిపోతాం. మళ్లీ కొద్ది రోజుల వరకు ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసించం. అలాంటి రెండు పెద్ద పెద్ద కొండ చిలువలు ఇంట్లోకి వస్తే.. సీలింగ్‌కు వేలాడి కొట్లాడుతూ కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా..? పై ప్రాణాలు పైకే పోతాయి. ఇలాంటి సంఘటనే ఓ ఆస్ట్రేలియన్‌కు ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ కి చెందిన డేవిడ్ టైట్ అనే వ్యక్తి పనిమీద బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తన కిచెన్‌లో రెండు పెద్ద పెద్ద కొండ చిలువలు సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాయి. బాగా లావుగా కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి 9 అడుగుల పొడవుతో దాదాపు 45 కిలోల బరువును కలిగి ఉన్నాయి. వాటిని చూసిన డేవిడ్ భయంతో బయటకు పరుగులు తీశాడు. వెంటనే పాములు పట్టుకునే వారికి సమాచారం అందించారు. దీంతో స్నేక్ క్యాచర్ వచ్చి రెండు పాములను పట్టుకున్నాడు. ఆరెండు పాములు మగవి అని, ఆడపాము కోసం అవి కొట్టుకున్నాయని పాములు పట్టే వ్యక్తి తెలిపారు. అయితే ఆడ పాము మాత్రం ఇంకా కనిపించలేదని తెలిపారు. కానీ కచ్చితంగా అది చుట్టుపక్కలో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
వామ్మో రెండు కొండ చిలువలు
డెహ్రాడూన్: పంట పొలాల్లో పనిచేసేందుకు వెళ్లిన రైతులకు భయానక అనుభవం ఎదురైంది. అక్కడ సుమారు 10 అడుగుల పొడవు గల రెండు కొండ చిలువలు దర్శనమివ్వడంతో వారు బెంబేలెత్తిపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీం పాములను పట్టి అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని గౌలాపర్ అనే ప్రాంతంలో సోమవారం జరిగింది. ఈ విషయం గురించి అటవీ శాఖ అధికారి ఒకరు మట్లాడుతూ.. ఆ రెండు పైథాన్లు 10 నుంచి 12 అడుగుల పొడవు ఉన్నాయి. సీజన్ మారుతున్న సమయంలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆ రెండింటిని అడవిలో వదిలిపెట్టాం అని చెప్పుకొచ్చారు. ఇక పంట పొలాల్లో కొండ చిలువలను సురక్షిత పద్ధతిలో బంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు రెస్క్యూ టీం ధైర్యాన్ని కొనియాడుతుండగా.. మరికొందరు.. ఇది చాలా భయంకరంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
తలుపు తెరిచి చూసి షాకైంది!
కాన్బెర్రా : ఇంటి ముందు అనుకోని అతిథి ప్రత్యక్షమవటంతో ఓ మహిళ గుండె ఝల్లుమంది. తలుపు దగ్గర 14 అడుగుల కొండచిలువను చూసి షాక్‌కు గురైంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. వారంరోజుల క్రితం క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ పనిమీద బయటకు వెళుతూ ఇంటి తలుపు తెరిచింది. బయటకు అడుగుపెట్టబోతూ కిందకు చూసింది. అంతే షాక్ తిన్నట్లు అయిపోయింది. అక్కడి నేలపై 14 అడుగుల అల్బినో బర్మీస్ పైథాన్ ఉండటం చూసి ఆమె గుండె ఝల్లుమంది. వెంటనే తలుపు మూసి, పాములను పట్టుకునే సిబ్బందికి సమాచారం అందించింది. ఇంటి దగ్గరకు వచ్చిన వారు పామును బంధించారు. 14 అడుగుల అల్బినో బర్మీస్ పైథాన్ ఈ సందర్భంగా పాములను పట్టుకునే సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. ‘‘ మేము పట్టుకున్న పాములలో ఇదే అతి పెద్దది. దాదాపు 80 కేజీల బరువుంది. ఆరోగ్యంగా కూడా ఉంది. ఈ బర్మీస్ పైథాన్లు ఇక్కడివి కాదు. ఎవరో దాన్ని అక్రమంగా పెంచుకుంటున్నారు. వారెవరో తెలిస్తే జీవితాంతం జైలులో ఉండాల్సి వస్తుంద’ని హెచ్చరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
వాటిని చంపితే జైలుశిక్ష అనుభవించాల్సిందే!
సాక్షి,శ్రీకాకుళం : ‘జాతీయ జంతువు పెద్దపులిని చంపినా... కొండ చిలువను చంపినా.. ఒకే రకమైన శిక్ష తప్పదని, వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ కృపాకర్ గుండాల హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కొండ చిలువలను హతం చేస్తున్న ఘటనలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కూడా చట్టం ప్రకారం నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. వణ్యప్రాణి సంరక్షణ చట్టం (1972) ప్రకారం షెడ్యూల్–1 కేటగిరీలో పెద్దపులి, నెమలి, జింక, ఫిషింగ్ క్యాట్, కొండ గొర్రె, ఏనుగు, చిరుత పులి, ఎలుగు బంటి తదితర జంతువులతోపాటు కొండ చిలువలను చంపితే చట్టప్రకారం ఏడాది నుంచి ఆరేళ్ల వరకు కఠిన జైలుశిక్షతోపాటు భారీ జరిమానా విధిస్తామని వివరించారు. జిల్లాలో 15 రోజుల్లోనే లావేరు, బూర్జ, గార, నందిగాం, పలాస, ఆమదాలవలస తదితర మండలాలతోపాటు ఏజెన్సీ మండలాల్లోనూ పది వరకు కొండచిలువలను చంపేసినట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఇది నిజంగా దారుణమన్నారు. కొండచిలువలు ఎక్కడైనా తారసపడితే.. వెంటనే తమ అటవీ శాఖాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలు మరింత అవగాహన కలిగించుకోవాలన్నారు. సచివాలయాల్లో అటవీ శాఖ అధికారుల వివరాలు జిల్లాలో వణ్యప్రాణి సంరక్షణ చట్టం అమల్లో భాగంగా అన్ని మండలాల్లోనూ సచివాలయాలతోపాటు పలు ప్రభుత్వ భవనాల వద్ద స్థానిక అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుతామని డీఎఫ్‌వో సందీప్ కృపాకర్ తెలియజేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ శాఖ చట్టంపై అవగాహన కలిగించేలా తమ అధికార బృందంతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నామని వివరించారు. ఇందులో ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. అదేవిధంగా ఇదే చట్టం ప్రకారం షెడ్యూల్–3లో అడవి పందిని చంపినా కచ్చితంగా నేరంగానే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇటీవల పొందూరు మండలంలో ఓ కేసును నమోదు చేసినట్లు గుర్తు చేశారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కూడా చట్టాలపై పూర్తి అవగాహనతో ఉండాలని, వణ్యప్రాణులను చంపిన వారిపై ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా, వెంటనే అప్రమత్తమై, క్షేత్ర స్థాయిలో వాస్తవాలను గుర్తించి నిందితులపై కేసులను నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇకమీదట వణ్యప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లుగా ప్రకటించారు. -
ఏకంగా 56 పాము పిల్లలు...
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్కత్తా అలీపూర్ లో పాము పిల్లలే పిల్లలు. జూలోని మూడు కొండ చిలువలు ఏకంగా 56 పాము పిల్లలకు జన్మనిచ్చాయి. రాక్, బర్మన్, రిటీకోలెడ్ జాతులకు చెందిన కొండ చిలువలు డజన్ల కొద్ది గుడ్లను పెట్టాయి. దీంతో అలీపూర్ జంతు ప్రదర్శనశాల నిర్వహకులు ఆ గుడ్లను భద్రంగా పొదిగించి పాముల్ని ఉత్పత్తి చేశారు. ఇప్పటివరకూ తమ జూలో ఇంత పెద్ద సంఖ్యలో కొండచిలువలను పొదిగించడం ఇదే మొదటిసారి అని జూ నిర్వహకులు తెలిపారు. ఈ పాములు తేమ ప్రదేశాలలో, చెట్ల తొర్రలలో నివసిస్తాయని, వీటిని తల్లి నుంచి వేరుచేసి ప్రత్యేకంగా పెంచనున్నామని, వాటికి ఆహారంగా ఎలుకలను వేస్తామని తెలిపారు. -
ఇండియన్ పైథాన్ హంటర్స్ పంటపండింది
వాషింగ్టన్: పాములు, కొండచిలువలు పట్టే ఇద్దరు తమిళనాడు వ్యక్తులకు గొప్ప అవకాశం వచ్చింది. ఫ్లోరిడాకు చెందిన వైల్డ్ లైఫ్ అధికారులు బర్మీస్ కొండచిలువలను పట్టుకునేందుకు వారిని ఎంపిక చేసుకున్నారు. అమెరికాలోని వాతావరణంలో విపరీతమార్పులు చోటుచేసుకొని క్షీరదాలను బర్మీస్ కొండచిలువలు చంపేస్తున్నాయి. ఎంతలా అంటే దాదాపు అవి అంతరించే పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు నిపుణులైన పైథాన్ హంటర్స్ కోసం గాలింపులు జరిపి చివరకు తమిళనాడులో మసి సదైయాన్, వైదివేల్ గోపాల్ (ఇద్దరూ 50 ఏళ్ల వయసున్నవారు) అనే ఇద్దరిని ఎంపిక చేసుకున్నారు. వారితోపాటు ఇద్దరు అనువాదకులు, ప్రత్యేక శిక్షణ పొందిన కుక్కలు పైథాన్ హంటింగ్ పాల్గొంటున్నాయి. వీరి పనితీరు చూసి ఫ్లోరిడా వైల్డ్ అధికారులు అవాక్కవుతున్నారు. ఎందుకంటే కేవలం వారం రోజుల్లోనే దాదాపు13 పైథాన్లు(వీటిలో 16 అడుగులు ఉన్నవి) పట్టుకొని వారిని ఆశ్చర్య పరిచారు. మొత్తం ఈ ప్రాజెక్టుకోసం 68,888 డాలర్లు వెచ్చిస్తున్నట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన ఈ ఇద్దరు ఇరుల తెగకు చెందిన వారు. వీరిన త్వరలోనే ఫ్లోరిడాకు తీసుకెళ్లి అక్కడే ఫిబ్రవరి వరకు ఉంచనున్నారు. -
ప్రేయసిపై ప్రబుద్ధుడి బిత్తిరి చర్య!
నిద్రపోతున్న గర్ల్ ఫ్రెండ్ మీద రెండు పేద్ద కొండ చిలువలు తెచ్చి పడేశాడో బోయ్ ఫ్రెండ్. పైథాన్లు మీద పడేసరికి తన గర్ల్ ఫ్రెండ్ ఎలా స్పందించిందన్న దృశ్యాన్ని తన స్నేహితులతో కలిసి వీడియో తీసి ఫేస్బుక్, యూట్యూబ్‌లలో పెట్టాడు డెరెక్ డెస్కో అనే ప్రబుద్ధుడు. ఇది తన ప్రాక్టికల్ జోక్ అని చెప్తున్నాడు. -
ప్రేయసిపై ప్రబుద్ధుడి బిత్తిరి చర్య!
-
25 పిల్లలకు జన్మనిచ్చిన కొండచిలువ
చెన్నై: వండలూర్ జూలో ఓ కొండచిలువ 25 పిల్లలకు జన్మనిచ్చింది. వండలూరు అన్నా జువాలజికల్ పార్కులో 25 కొండచిలువలు సంరక్షణలో ఉన్నాయి. అందులోని ఒక ఆడ కొండచిలువ ఏప్రిల్ 8వ తేదీ 45 గుడ్లుపెట్టింది. అందులో గత నెల 23న 20 గుడ్ల నుంచి 20 కొండచిలువ పిల్లలు బయటకు వచ్చాయి. అనంతరం ఈ నెల 18న మరో 25 గుడ్ల నుంచి 25 కొండచిలువ పిల్లలు వచ్చాయి. ప్రస్తుతం వీటితో కలిపి మొత్తం కొండచిలువ పిల్లల సంఖ్య 45కు చేరింది. సరాసరి బరువు 89.28 గ్రాములు ఉన్న ఈ కొండచిలువ పిల్లలు సుమారు 28 అడుగుల పొడవు వరకు పెరిగే అవకాశం ఉంది. -
'టాయిలెట్లో పాములుండొచ్చు జాగ్రత్త'
న్యూ సౌత్ వేల్స్ : 'కుక్కలున్నాయి జాగ్రత్త' అనే బోర్డు చాలామంది ఇళ్ల ముందు మనం చూస్తూనే ఉంటాం, 'పిక్ పాకెటర్స్ తో జాగ్రత్త', 'అపరిచితులతో అప్రమత్తంగా ఉండండి' లాంటి బోర్డులైతే బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో కనబడుతున్నాయి. కానీ 'టాయిలెట్లో పాములుండొచ్చు జాగ్రత్త' అనే సైన్ బోర్డు ఎక్కడైనా చూశారా? ఆస్ట్రేలియాలో ఇలాంటి బోర్డులు చాలా దర్శనిమిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని కొన్ని పబ్లిక్ టాయిలెట్లు, బీచ్ ల వద్ద ఏర్పాటు చేసిన బోర్డులు పలువురిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. మంగళవారం 'ఆస్ట్రేలియా డే'ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఆస్ట్రేలియా వాసులంతా ఉత్సాహంగా సన్నద్ధమవుతుండగా వాతావరణ, వారసత్వ విభాగానికి చెందిన న్యూ సౌత్ వేల్స్ ఆఫీసు రక్షణ చర్యలకు దిగింది. 'గమనిక-టాయిలెట్ బౌల్ లో పాములు ఉండొచ్చు' అంటూ టాయిలెట్ల తలుపులపై వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేసింది . 'విషపూరితంకాని పాములు ఇంతకుముందు ఈ టాయిలెట్లో కనిపించాయి. కావున టాయిలెట్ ను ఉపయోగించే ముందు చెక్ చేసుకోండి' అంటూ న్యూ సౌత్ వేల్స్ కు చెందిన జాతీయ పార్కులు, వన్యప్రాణుల సంరక్షణా విభాగం ఏర్పాట్లను చేసింది. అలాగే దక్షిణ సిడ్నీలోని గారీ బీచ్ వద్ద గల రాయల్ నేషన్ పార్క్ వద్ద కూడా 'రాళ్ల మధ్య కొండచిలువలు కలవు.. జాగ్రత్త' అంటూ సందర్శకులను అప్రమత్తం చేసే పనులు చేపట్టింది. దీనిపై ఓ ప్రభుత్వాధికారి మాట్లాడుతూ.. 'పాములు ఎటు నుంచైనా ఎప్పుడైనా రాగల జీవులు, అందుకే అప్రమత్తం చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పాములు తిరగడం ఈ మధ్య గమనించాం. రిస్క్ నుంచి ప్రజలను రక్షించేందుకే సాధారణ హెచ్చరికలను ఏర్పాటు చేశాం' అని చెప్పారు. అలాగే ప్రజలకు కలిగిన ఈ ఇబ్బంది తొలగించేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ముఖ్యంగా నదీ తీరాల్లో తిరిగే ఎరుపు రంగు ఉదరం గల నలుపు రంగు పాములు టాయిలెట్లలో చొరబడుతున్నాయట. ఒకవేళ ఈ పాముల బెడద నుంచి తప్పించుకున్నా తేనెటీగలు వదిలేట్టు లేవు. ప్రమాదకరమైన ఈగల నుంచి కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ అప్రమత్తం చేసింది ప్రభుత్వ సిబ్బంది. మొత్తానికి ఈ సైన్ బోర్డులు మనకు నవ్వు తెప్పిస్తున్నా.. ఆస్ట్రేలియా వాసులను మాత్రం పబ్లిక్ టాయిలెట్ల వైపు చూడాలంటేనే భయపెడుతున్నాయి. -
నట్టింట్లో 'పాముల'సంత!
కాలిఫోర్నియా: పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడి ఇంట్లో పాముల సంతే బయటపడింది. వందలకొద్దీ పాములు, చుంచులు, ఎలుకలతో చిట్టడవిని తలపించే ఆ ఇంటిని చూసి పోలీసులే హడలిపోయారు. కాలిఫోర్నియా శివార్లలోని ఓ ఇంట్లో నివసించే బుచ్మెన్ వత్తిరిత్యా ఉపాధ్యాయుడు. కొన్నాళ్లుగా ఆయన ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కలవారంతా పోలీసులకు సమాచారం అందించారు. ఇంటిలోపలికి వెళ్లి తనిఖీచేసిన పోలీసులు అక్కడ చచ్చిపోయిన పాములు, వెన్నులో వణకు పుట్టించే కొండచిలువలను చూసి భయపడిపోయారు. ఆ ఇంట్లోని నాలుగురూంలలో ఇంటిపైకప్పు నుంచి గదిలోపలివరకూ ప్లాస్టిక్ డబ్బాలలో వందలకొద్దీ పాములను నిల్వచేసినట్లు గుర్తించారు. 350 వరకు పాములను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పనిలోపనిగా జంతువులను సంరక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహ రించారని బుచ్మెన్ను అరెస్టు చేశారు. అయితే తాను పాముల పునరుత్పత్తికి సంబంధించిన వ్యాపారంలో భాగంగానే ఇదంతా చేసినట్లు బచ్మెన్ చెప్పుకొచ్చాడు.