
నెల్లూరు (బుచ్చిరెడ్డిపాళెం): చేపలు పట్టేందుకు వల విసిరితే 15 అడుగుల కొండచిలువ చిక్కింది. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో సోమవారం జరిగింది. ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ ఆఫీసర్ పిచ్చిరెడ్డి కథనం మేరకు.. మండలంలోని పల్లిపాళెంకు చెందిన కొందరు జాలర్లు దామరమడుగు–కళయకాగోల్లు గ్రామాల మధ్య పెన్నానది సమీపంలో ఉన్న గుంతలో చేపలు పట్టేందుకు వల విసిరారు. ఆ వలలో దాదాపు 15 అడుగుల భారీ కొండ చిలువ చిక్కుకుంది.
అయితే వలను లాగే సమయంలో బరువుగా ఉండడంతో ఎక్కువ సంఖ్యలో చేపలు పడ్డాయని భావించిన జాలర్లు మరి కొందరి జాలర్ల సహాయంతో వలను బయటకు తీశారు. వల బయటకు రావడంతో అందులో భారీ కొండ చిలువను చూసి భయంతో పరుగులు తీశారు. తర్వాత కొంత సమయానికి ధైర్యం తెచ్చుకున్న జాలర్లు తమకు సమాచారం అందిచారని తెలిపారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పామును స్వాధీనం చేసుకుని ఆత్మకూరు పారెస్ట్ ఏరియాలో వదిలి పెట్టామన్నారు. గతేడాది వచ్చిన భారీ వరదలకు కొండల నుంచి వచ్చిన ఈ పాములు పెన్నా నది సమీపంలోని చేపల గుంతల్లో చేరి చేప లను తింటూ జీవిస్తున్నాయని తెలిపారు. గతంలో కూడా రెండు చోట్ల కొండ చిలువలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment