Fishing net
-
చేపల కోసం వల వేస్తే.. కొండ చిలువ చిక్కింది..
నెల్లూరు (బుచ్చిరెడ్డిపాళెం): చేపలు పట్టేందుకు వల విసిరితే 15 అడుగుల కొండచిలువ చిక్కింది. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో సోమవారం జరిగింది. ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ ఆఫీసర్ పిచ్చిరెడ్డి కథనం మేరకు.. మండలంలోని పల్లిపాళెంకు చెందిన కొందరు జాలర్లు దామరమడుగు–కళయకాగోల్లు గ్రామాల మధ్య పెన్నానది సమీపంలో ఉన్న గుంతలో చేపలు పట్టేందుకు వల విసిరారు. ఆ వలలో దాదాపు 15 అడుగుల భారీ కొండ చిలువ చిక్కుకుంది. అయితే వలను లాగే సమయంలో బరువుగా ఉండడంతో ఎక్కువ సంఖ్యలో చేపలు పడ్డాయని భావించిన జాలర్లు మరి కొందరి జాలర్ల సహాయంతో వలను బయటకు తీశారు. వల బయటకు రావడంతో అందులో భారీ కొండ చిలువను చూసి భయంతో పరుగులు తీశారు. తర్వాత కొంత సమయానికి ధైర్యం తెచ్చుకున్న జాలర్లు తమకు సమాచారం అందిచారని తెలిపారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పామును స్వాధీనం చేసుకుని ఆత్మకూరు పారెస్ట్ ఏరియాలో వదిలి పెట్టామన్నారు. గతేడాది వచ్చిన భారీ వరదలకు కొండల నుంచి వచ్చిన ఈ పాములు పెన్నా నది సమీపంలోని చేపల గుంతల్లో చేరి చేప లను తింటూ జీవిస్తున్నాయని తెలిపారు. గతంలో కూడా రెండు చోట్ల కొండ చిలువలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
చేపల కోసం వలేస్తే.. మొసలి చిక్కింది!
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామశివారులోని పెద్దచెరువులో శుక్రవారం మత్స్యకారుల వలకు ఓ మొసలి చిక్కింది. చేపల పట్టుకునేందుకు కొందరు వలలు వేయగా.. ఆ వలలో మొసలి పడింది. మరికొందరితో కలిసి దానిని ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు, ఫారెస్ట్ బీట్ అధికారి రత్నాకర్‌కు సమాచారం ఇచ్చారు. సిబ్బందితో కలిసి వచ్చిన ఆయన మొసలిని తీసుకెళ్లారు. సమీప గోదావరి నదిలో విడిచి పెట్టారు. మొసలి వయసు సుమారు రెండేళ్లు ఉంటుందని, అరవై కేజీల బరువుంటుందని రత్నాకర్ తెలిపారు. కాగా, గ్రామ చెరువులో తొలిసారి మొసలి ప్రత్యక్షం కావడంతో మత్స్యకారులు కొద్దిగా ఆందోళన చెందారు. -
ప్రాణం తీసిన ఉపాధి ‘వల’
ఇల్లెందు: చెరువులో చేపలు వేటాడితేనే అతని కుటుంబానికి ఉపాధి. కానీ చేపల వేటకు ఉపయోగించే వలే ఆయన ప్రాణం తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మాణిక్యారం పంచాయతీ పరిధి ఎల్లాపురానికి చెందిన పూనెం రాంబాబు మరికొందరితో కలిసి శుక్రవారం స్థానిక చెరువులో చేపల వేటకు వెళ్లాడు. చేపలను కట్టపైకి చేర్చాక వలను మరో ఒడ్డున ఉన్న సహచరులకు ఇచ్చేందుకు చెరువులో ఈదుతూ బయల్దేరాడు. లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లాక రాంబాబు వద్ద ఉన్న వల అతని కాలి బొటన వేలితోపాటు చేయి, తలకు చుట్టుకుని బిగుసుకుపోయింది. దీంతో ఊపిరాడక నీటిలో మునిగి ప్రాణాలొదిలాడు. ఎంతకూ రాంబాబు రాకపోవడంతో ఆయన వెంట వెళ్లిన వారు శుక్రవారం రాత్రి వరకు వెతికినా ఆచూకీ దొరకలేదు. శనివారం ఉదయం చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు వంద మంది చెరువులోకి దిగి గాలిం చగా.. లోతట్టు ప్రదేశంలో మృతదేహం లభించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా అంత్యక్రియలు నిర్వహించారు. -
అదృష్టానికి అడ్డంగా దొరికాడు.. చేపల కోసం వల వేస్తే ఏకంగా..
అదృష్టం ఏ రూపాన వస్తుందో ఎవరికీ తెలియదు. అలా ఓ సారి వచ్చిన చాలు దెబ్బకు కోటీశ్వరులుగా మారిన వాళ్లు ఉన్నారు. తాజాగా ఓ జాలరీకి కూడా ఇలాంటి అదృష్టమే వరించింది. వివరాల్లోకి వెళితే.. ఓ మత్స్యకారుడు ఎప్పటిలానే సముద్రంలో వేటకి వెళ్లాడు. కొంత దూరం వెళ్లాక చేపల కోసం వల వేసి ఎదురుచూస్తున్నాడు. కాసేపు తరువాత తాను విసిరిన వలలో ఏదో చిక్కుకున్నట్లు అనిపించింది. అదేమిటో చూడాలని వలను లాగడానికి ప్రయత్నించాడు. అయితే అది కాస్త బరువుగా ఉండడంతో అంత సులువుగా రాలేదు. చివరికి ఎలాగో ఒకలా వలను పైకి లాగగా అందులో చాలా పెట్టెలు ఉన్న విషయాన్ని గ్రహించాడు. అలాగే ఆ పెట్టెలపై ఆపిల్ లోగో ఉంది. మొదట్లో ఆ పెట్టె ఖాళీ అయ్యుంటుందని భావించినప్పటికీ, దాన్ని తెరిచే చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ బాక్సులన్నీ యాపిల్ ఉత్పత్తులతో నిండిపోయాయి. అందులో చాలా ఐఫోన్, మ్యాక్బుక్లు ఉన్నాయి. వాటి విలువ లక్షల్లో ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే అతనికో చిన్న నిధి దొరికినట్లుగా భావించాడు. అయితే నీటిలో ఉన్న కారణంగా ఫోన్, మ్యాక్‌బుక్ పాడై ఉండొచ్చని అనుకున్నప్పటికీ అలా ఏం జరగలేదు. అందులో కొన్ని ఫోన్లను తెరిచి చూడగా అవి బాగానే పనిచేస్తున్నాయి. ఎందుకుంటే ఐఫోన్ వాటర్‌ప్రూఫ్ కనుక అవి నీటిలో ఉన్న అవి పాడైపోలేదు. మత్స్యకారుడు ఈ ఘటనను వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు పబ్లిసిటీ కోసమే ఈ బాక్సులను తానే మొదట విసిరాడని, తర్వాత అవి దొరికనట్లుగా సృష్టించాడని పలువురు వాపోతున్నారు. కొందరు లక్కీ బాయ్ అంటూ కామెంట్ పెట్టారు. చదవండి: బాప్రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్ వీడియో -
Photo Feature: అటు కిటకిట.. ఇటు వ్యతిరేకత
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. 25 వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పంపుహౌస్‌ల నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న చమురు ధరలపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతున్నాయి. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి. -
గుడ్డునైనా వదలరు!
మహబూబ్‌నగర్/వనపర్తి: జిల్లాలోని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఆంధ్రా ప్రాంత జాలర్లు నిషేధిత అలవి వలలతో యథేచ్ఛగా చేపలవేట సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో చేపలు పడుతూ మత్స్యసంపదను కొల్లగొడుతున్నారు. స్థానికంగా ఉండే కొందరు నాయకులు, అధికారులు వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.. తమకు దక్కాల్సిన మత్స్య సంపదను ఆంధ్రా జాలర్లు కొల్లగొడుతున్నారని జిల్లాకు చెందిన మత్స్యకార్మికులు స్వయంగా కలెక్టర్, అధికారులకు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి చిన్నంబావి మండలంలోని కృష్ణానది తీర ప్రాంతంలోని మత్స్యకారులు వలస జాలర్లు అలవి వలలతో పట్టిన చిన్న చిన్న చేపపిల్లలను తీసుకుని కలెక్టరేట్‌కు వచ్చారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి కృష్ణానదిలో రూ.80లక్షల చేపపిల్లలను వదిలితే అవి పెరగకముందే అలవి వలలతో పట్టి కార్పొరేట్ కంపెనీలకు విక్రయిస్తున్నారని కలెక్టర్ శ్వేతామహంతికి ఫిర్యాదు చేశారు. సుమారు 50మంది స్థానిక మత్స్యకారులు చేపపిల్లల సంచులతో కలెక్టరేట్‌కు వచ్చారు. రాత్రి సమయాల్లో మరబోట్లలో వచ్చి చేపల వేట సాగిస్తున్నారని ఇదివరకు రెండుసార్లు ఫిర్యాదుచేసినా ప్రయోజనం లేదని వారు వాపోయారు. జిల్లా మత్స్యశాఖ అధికారులకు సమాచారమిస్తే వెంటనే ఆంధ్రాప్రాంత జాలర్లకు తెలిసిపోతుందని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి కొందరు గుంపు గుంపులుగా కృష్ణానదిలో చేపల వేట సాగించారని, వారి పట్టుకునేందుకు వెళ్తే పారిపోయారని చెప్పుకొచ్చారు. అనువైన ప్రాంతాలు జిల్లాలోని చెల్లెపాడు, వెల్టూరు, చిన్నమారూరు, పెద్దమారూరు, గడ్డబస్వాపురం, బెక్కెం, గూడెం తదితర ప్రాంతాల్లో నిత్యం అలవి వలలతో చేపల వేట కొనసాగుతోంది. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చించి స్థానిక చెరువులతో పాటు శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో 80లక్షల చేప పిల్లలను వదిలారు. అవి పెరిగితే నదీతీర ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలకు ఏడాది పొడవునా జీవనోపాధి లభిస్తుంది. కానీ ఆంధ్రా ప్రాంత జాలర్లు చేపలు అభివృద్ధి చెందకముందే దోమ తెరను తలపించే అలవి వలతో మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు. క్వింటాలు చేపలను రూ.12నుంచి రూ.15వరకు విక్రయిస్తున్నారు. అధికారులు పట్టించుకోడం లేదు.. చిన్నంబావి మండలంలోని కృష్ణాతీర ప్రాంతంలో ఆంధ్రా జలార్ల అలవి వేట నిత్యం కొనసాగుతుందని అధికారులకు ముందే తెలుసు. మేం వారు వేటకు వచ్చిన ప్రతిసారి సమాచారం ఇస్తూనే ఉన్నాం. ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. – మధు, వెల్టూరు, చిన్నంబావి మండలం కలెక్టర్ స్పందించాలి ఈ విషయంపై కలెక్టర్ సీరియస్‌గా స్పందించాలి. ఈ విషయంపై మూడవసారి ఫిర్యాదుచేశాం. నదీతీర ప్రాంతంలోని మత్స్య కార్మికులకు చెందాల్సిన మత్స్య సంపదను ఆంధ్రా ప్రాంత జాలర్ల నుంచి కాపాడాలి. స్థానిక మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలి. – వాకిటి ఆంజనేయులు, మత్స్యకారుడు, చిన్నంబావి మండలం దాడులు నిర్వహిస్తాం కృష్ణానదిలో ఆంధ్రా జాలర్లు అలవి వలలతో చిన్న చేపలను కొల్లగొడుతున్నారని సోమవారం నాకు ఫిర్యాదు అందింది. దాడులు నిర్వహించేందుకు పోలీస్‌శాఖ సహకారం తీసుకునేందుకు ఏఎస్పీ సురేందర్‌రెడ్డిని కలిశాం. వారి సహకారంతో దాడులు చేసి అలవి వలలను సీజ్‌చేస్తాం. – రాధారోహిణీ, జిల్లా మత్స్యశాఖ అధికారి, వనపర్తి -
చేప కాదు.. కొండ చిలువ చిక్కింది!
కొల్చారం: చేపలు పట్టేందుకు ఓ జాలరి వల విసరగా కొండచిలువ చిక్కింది. ఈ అరుదైన ఘటన మెదక్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామ సమీపంలోని మంజీర వాగులో చేపలు పడుతున్న ఓ జాలరి వలకు కొండచిలువ చిక్కింది. దాదాపు 10 ఫీట్ల వరకు ఉన్న కొండచిలువను మరికొందరు వ్యక్తులతో కలిసి గట్టుపైకి చేర్చారు. సమీపంలోని చెట్ల పొదల్లోకి వదిలేసినట్లు స్థానికలు తెలిపారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
చేపల వలలో మొసలి..
కొల్పారం (మెదక్) : చేపల వేటకు వెళ్లిన జాలర్లు చేపల కోసం వల వేస్తే.. అందులో మొసలి ప్రత్యక్షమైన సంఘటన మెదక్ జిల్లా కొల్పారం మండలం ఘన్‌పూర్‌లో మంగళవారం వెలుగుచూసింది. స్థానిక ఆనకట్టలో చేపలు పడుతున్న జాలర్లు వలలో చిక్కిన మొసలిని గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు మొసలిని మంజీరా అభయారణ్యానికి తరలించారు.