ఇండియన్ పైథాన్ హంటర్స్ పంటపండింది
వాషింగ్టన్: పాములు, కొండచిలువలు పట్టే ఇద్దరు తమిళనాడు వ్యక్తులకు గొప్ప అవకాశం వచ్చింది. ఫ్లోరిడాకు చెందిన వైల్డ్ లైఫ్ అధికారులు బర్మీస్ కొండచిలువలను పట్టుకునేందుకు వారిని ఎంపిక చేసుకున్నారు. అమెరికాలోని వాతావరణంలో విపరీతమార్పులు చోటుచేసుకొని క్షీరదాలను బర్మీస్ కొండచిలువలు చంపేస్తున్నాయి. ఎంతలా అంటే దాదాపు అవి అంతరించే పరిస్థితి తలెత్తింది.
దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు నిపుణులైన పైథాన్ హంటర్స్ కోసం గాలింపులు జరిపి చివరకు తమిళనాడులో మసి సదైయాన్, వైదివేల్ గోపాల్ (ఇద్దరూ 50 ఏళ్ల వయసున్నవారు) అనే ఇద్దరిని ఎంపిక చేసుకున్నారు. వారితోపాటు ఇద్దరు అనువాదకులు, ప్రత్యేక శిక్షణ పొందిన కుక్కలు పైథాన్ హంటింగ్ పాల్గొంటున్నాయి.
వీరి పనితీరు చూసి ఫ్లోరిడా వైల్డ్ అధికారులు అవాక్కవుతున్నారు. ఎందుకంటే కేవలం వారం రోజుల్లోనే దాదాపు13 పైథాన్లు(వీటిలో 16 అడుగులు ఉన్నవి) పట్టుకొని వారిని ఆశ్చర్య పరిచారు. మొత్తం ఈ ప్రాజెక్టుకోసం 68,888 డాలర్లు వెచ్చిస్తున్నట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన ఈ ఇద్దరు ఇరుల తెగకు చెందిన వారు. వీరిన త్వరలోనే ఫ్లోరిడాకు తీసుకెళ్లి అక్కడే ఫిబ్రవరి వరకు ఉంచనున్నారు.