World Snake Day 2021: Most Venomous Snakes On Earth - Sakshi
Sakshi News home page

World Snake Day: వీటి విషానికి పవరెక్కువ! మోస్ట్‌ డేంజరస్‌ పాములు

Published Fri, Jul 16 2021 9:09 AM | Last Updated on Sat, Jul 17 2021 11:50 AM

World Snake Day Special Story And Most Venomous Snakes On Earth - Sakshi

ఈ భూమ్మీద సమస్త జీవరాశుల్లో సర్పాలు ఉన్నాయి. కానీ, మనుషుల భయాలు, అపోహలతో వాటి జనాభా తగ్గిపోతూ వస్తోంది. ఇది ఎంతవరకు సరైందన్నది పక్కనపెడితే.. చాలామందిలో చెడును చెప్పడానికి ‘పాములాంటోడు’ అని వర్ణిస్తుంటారు. కానీ, అవి అంత ప్రమాదకరమైనవి మాత్రం కావు. 
ఈ భూమ్మీద దాదాపు 4 వేల జాతుల దాకా పాములు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్తగా కనుగొంటూ పోతున్నారు. ఈ మొత్తంలో 650కి(25 శాతం) పైగా జాతులు మాత్రమే విషపూరితమైనవని సైంటిస్టులు ఇప్పటిదాకా(జులై 7 రిపోర్ట్‌ ప్రకారం) గుర్తించారు. అందులోనూ 200 జాతుల(10 శాతం) పాముల నుంచి మాత్రమే మనిషికి ముప్పు ఉంటోందని తేల్చారు. కానీ, అవేం పట్టించుకోకుండా కనిపిస్తే చంపేస్తూ.. వాటి జనాభాను తగ్గించేస్తున్నారు. అందుకే వాటి పరిరక్షణ కోసం, పాములన్నీ ప్రమాదకరమైనవి కాదని జనాల్లో అవగాహన కల్పించాలని.. అందుకోసం ఓ రోజు ఉండాలని జులై 16న వరల్డ్‌ స్నేక్‌ డే ను నిర్వహిస్తున్నారు కొందరు(స్నేక్‌ సొసైటీలు). ప్రతీ ఏడాది ఇదే థీమ్‌తో ముందుకు సాగుతున్నారు.
  
వాసన కోసం నాలిక
పాములకు చూపు సామర్థ్యం చాలా తక్కువ. చెవుల్లేకున్నా వినికిడి శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది. పాము కింది దడవలో ఉన్న ఎముకలు శబ్దతరంగాలను పసిగడతాయి.  కానీ, వాసన విషయంలో మాత్రం గొప్ప సామర్థ్యం కలిగి ఉంటాయి. అవి నాలుకతోనే వాసనను పసిగడతాయి. అందుకే ఎప్పుడూ అవి నాలికను అలా బయటకు ఆడిస్తుంటాయి. 

అత్యంత విషపూరితమైనవి
విషానికి ప్రాథమిక కొలమానం ఎల్‌డీ 50. లెథాల్‌ డోస్‌ 50 పర్సంట్‌ టెస్ట్‌ అని పిలుస్తారు దీన్ని. ఈ పద్దతిలో పాముల విషాన్ని పరిశీలించే.. అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాముల జాబితాను సిద్ధం చేస్తుంది ఇంటర్నేషనల్‌ స్నేక్‌ సొసైటీ.
ఈస్ట్రన్‌ బ్రౌన్‌ స్నేక్‌..

ఆస్ట్రేలియాలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాము జాతి. దీని విషం నిమిషాల్లో మనిషిలో అంతర్గతంగా రక్త స్రావం అయ్యేలా చేస్తుంది. కిడ్నీలను పాడు చేస్తుంది. ఒక్కోసారి మెదడుకు చేరి పక్షవాతాన్ని కలగజేస్తుంది. చివరికి రక్తం గడ్డకట్టేలా చేసి మనిషి ప్రాణం తీస్తుంది.
టైగర్‌ స్నేక్‌

ఎలాపిడ్‌ జాతికి చెందిన టైగర్‌ స్నేక్‌ పాములు కూడా ఆస్ట్రేలియా గడ్డపైనే కనిపిస్తాయి. ఒంటిపై ఉండే మచ్చల కారణంగా వాటికి టైగర్‌ స్నేక్‌ అనే పేరొచ్చింది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ.. అరగంటలో మనిషి మరణానికి కారణం అవుతుంటాయి. టైగర్‌స్నేక్స్‌ విషం నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపెడుతుంది. కండరాల్లో రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. కోబ్రా తరహాలో పడగ విప్పి.. భయపెడుతుంది. 
ఇన్‌ల్యాండ్‌ టైపాన్‌

ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైన పాము ఇది(అనధికారికంగా). వంద గ్రాముల విషంతో వంద మందిని చంపగలిగే సామర్థ్యం ఉన్న పాము ఇది. వంద గ్రాముల విషాన్ని ఒకే కాటుతో దింపగలదు ఇది. కానీ, ఎల్డీ50 ప్రకారం(త్వరగా ప్రాణం తీసే లెక్కప్రకారం).. లిస్ట్‌ వల్ల మూడో ‍ప్లేస్‌ ఇవ్వాల్సి వచ్చింది. ఈ విషం ప్రభావంతో గంటలో ప్రాణం పోవడం ఖాయం. ఇవి జనారణ్యానికి దూరంగా ఏకాంతంగా బతుకుతాయి. ఈ పాముకి ‘సిగ్గు’ ఎక్కువ అని అంటుంటారు. మనుషులను చూస్తే.. ఇవి వేగంగా పాక్కుంటూ వెళ్లి ఓ మూల దాక్కుంటాయి. అలా ఈ డేంజర్‌ స్నేక్‌కు ‘సిగ్గున్న పాము’గా ముద్దు పేరు వచ్చింది.
రస్సెల్స్‌ వైపర్‌

ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పాము జాతిగా పేరుంది రస్సెల్స్‌ వైపర్‌కి. అంతేకాదు ఎక్కువ మరణాలకు కారణమైన జాతి కూడా ఇదే. దీనిని గుర్తించడం కూడా చాలా తేలిక. భయంతో ఉన్నప్పుడు అది గట్టిగా శబ్దం చేస్తుంటుంది. కాటు వేసిన మరుక్షణం నుంచే  విషం శరీరంలోకి ఎక్కేస్తుంటుంది. ఒక్క రస్సెల్స్‌ వైపర్‌ గక్కే విషంతో లక్షా యాభై వేల ఎలుకలను చంపొచ్చనేది సైంటిస్టుల మాట. 
బ్లూ క్రాయిట్‌

ఆసియాలో ప్రమాదకరమైన పాముల్లో దీని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. దీని విషయం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది. చికిత్స అందినా సగం మంది చనిపోతుంటారు. అంత ప్రమాదకరమైంది ఈ పాము విషం. ఇవి విషపూరితమైన పాముల్నే ఆహారంగా తీసుకుంటాయి. జనసంచారానికి దూరంగా పగటి పూట పచ్చిక బయళ్లలో, అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి ఇవి. 
బూమ్‌స్లాంగ్‌

క్లౌబ్రిడ్‌ కుటుంబంలో అత్యంత విషపూరితమైన పాము జాతి ఇది. రంగు రంగుల్లో ఉంటాయి ఇవి. విషం అంత విషపూరితమైనది కాకపోయినా.. రక్తస్రావం కారణంగా ప్రాణం పోతుంటుంది. అందుకే ప్రమాదకరమైన పాముల లిస్ట్‌లో చేర్చారు. అయితే ఇవి మనుషులు కనిపిస్తే.. దూరంగా వెళ్లిపోతుంటాయి. ఇవి దాడులు చేసే సందర్భాలు చాలా తక్కువ. చెట్ల మీద ఉంటూ పక్షుల్ని, పురుగులని తింటాయి.
మోజావే రాటెల్‌స్నేక్‌

అమెరికా నుంచి పాము జాతుల్లో అత్యంత విషపూరితమైన లిస్ట్‌లో ఫస్ట్‌ కనిపించేది ఇదే. రక్తం, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది దీని విషం. నైరుతి అమెరికా పప్రాంతంలో ఎక్కువ మరణాలు సంభవించేది ఈ పాముల వల్లే.
స్టిలెట్టో స్నేక్‌

పరిణామంలో చిన్నగా ఉండి, కలుగుల్లో దాక్కునే పాము ఇది. కానీ, విషపూరితమైంది. అయితే అదృషవశాత్తూ ఇది ఎక్కువ విషాన్ని కక్కదు. కానీ, దీని విషం ఎంత ప్రమాదకరమంటే.. కణజాలాన్ని దెబ్బ తీయడంతో పాటు గుండె పనితీరును స్తంభింపజేస్తుంది. అంతేకాదు వీటిని పట్టడం కూడా అంత ఈజీ కాదు. కోరలు కూడా విచిత్రంగా వంగి ఉంటాయి. కాబట్టి, నేరుగా కాకుండా వంగి మరీ కాటు వేస్తుంది స్టిలెట్టో.
సా స్కేల్డ్‌ వైపర్‌

ఇది అంత విషపూరితమైన పాము కాదు. కానీ, ప్రమాదకరమైన జాతిలో ఒకటి. భారత్‌ తో సహా చాలా దేశాల్లో ఇవి కనిపిస్తుంటాయి. చిన్నసైజులో ఉన్నప్పటికీ అగ్రెసివ్‌గా ఇవి దాడులు చేస్తాయి. వైపర్‌ జాతి పాముల్లాగే రక్తం గడ్డకట్టించి చంపుతాయి. అయితే విరుగుడు వెంటనే ఇవ్వకపోతే బతకడం కష్టం. ఇసుకలో దాక్కుని వేటాడుతుంటాయి. ఒకవేళ దగ్గరగా వెళ్లాలని ప్రయత్నిస్తే.. గట్టిగా శబ్ధం చేస్తూ భయపెడుతుంటాయి. 
కింగ్‌ కోబ్రా

విషానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ ఈ జాతి. అత్యంత పొడవైన విషపూరితమైన పాము కింగ్‌ కోబ్రా. పైన చెప్పుకున్నంత రేంజ్‌లో వీటిలో విషం లేకపోయినా.. ఎక్కువ పరిమాణంలో విషం చిమ్మడం, కాటు వేయడంతో పాటు రూపంతోనే భయపెట్టేస్తుంటాయివి. ఇక ఆడ పాము గూడుకట్టి గుడ్లు పెట్టాక.. మగపాముతో కలిసి కాపలా కాస్తుంటుంది.

వీటితో పాటు కోస్టల్‌ టైపాన్‌, బాండెడ్‌ క్రాయిట్‌, కామన్‌ డెత్‌ ఆడర్‌, సముద్రంలో ఉండే బీక్‌డ్‌ సీ స్నేక్‌, ఆఫ్రికన్‌ డేంజరస్‌ స్నేక్‌ జాతి ‘బ్లాక్‌ మాంబా’, చైనీస్‌ కోపర్‌హెడ్‌, సౌత్‌ అమెరికన​ బుష్‌మాస్టర్‌, ఫర్‌ డె డాన్స్‌, బెల్చర్‌స్‌ సీ స్నేక్‌, బ్లూ మలయన్‌ కోరల్‌ స్నేక్‌.. ఆ తర్వాతి స్థానాలో ఉన్నాయి. ఇక వీటితో పాటు విషం లేని బుక్‌స్నేక్‌(నార్త్‌ అమెరికా, అమెరికా), కొండ చిలువ జాతికి చెందిన పాములు, జెనస్‌ యూనెక్టస్‌కు చెందిన వాటర్‌ బోస్‌(అనకొండ) కూడా ఈ భూమ్మీద ఉన్నాయి.

అదృష్టం అంటే దీనిదే.. చాలాకాలం కిందట వైరల్‌ అయిన  వీడియో ఇది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement