రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్‌లోని రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ గురువారం తనిఖీ చేశారు. ముందుగా దువ్వాడ–రాజమండ్రి సెక్షన్ల మధ్య రియర్ విండో తనిఖీ ద్వారా ట్రాక్, సిగ్నలింగ్ భద్రత వ్యవస్థ అంశాలను పరిశీలించారు. అక్కడ నుంచి రాజమండ్రి స్టేషన్‌లో పర్యటించి క్రూ కంట్రోల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, అక్కడి సిబ్బంది బుకింగ్ లాబీ పనితీరును సమీక్షించారు.
లోకో పైలట్లు, గార్డుల విధుల నిర్వహణకు సంబంధించిన క్రూ మేనేజ్‌మెంట్ పనితీరును పరిశీలించారు. ముఖ్యంగా రన్నింగ్ స్టాఫ్‌ని డ్యూటీకి తీసుకునే ముందు తగిన విశ్రాంతిని అందించడంపై దృష్టి సారించాలని, అలాగే సిబ్బందికి తగిన విశ్రాంతి ఉండేలా డ్యూటీ నిర్వహణ పద్ధతిని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మల్టిపర్పస్ స్టాల్స్, వన్ స్టేషన్– వన్ ప్రొడక్ట్ స్టాల్స్, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల సౌకర్యాలపై సమీక్షించారు.
స్టేషన్ ఆవరణలో త్వరలో ప్రారంభం కానున్న రైల్ కోచ్ రెస్టారెంట్‌ను కూడా ఆయన సందర్శించారు. ఆయనతో పాటు విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ ఉన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు జీఎం అరుణ్‌కుమార్ జైన్‌ను కలిసి పలు రైల్వే ప్రాజెక్టులపై మాట్లాడి వినతిపత్రాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment