
ఆలయంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌తో ఆలయ ఈవో సుబ్బారెడ్డి తదితరులు
ద్వారకాతిరుమల: ‘ఆ ఒక్కటీ అడక్కు..’ ఇటీవల జరిగిన మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల తీరుపై అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ సినీఫక్కీలో స్పందించిన తీరిది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని చిన వెంకన్నను దర్శించుకునేందుకు శనివారం కుటుంబసమేతంగా విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా కొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు.
తాను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎంత హుందాగా ఉందో.. అలా ఉండాలని మనస్ఫూర్తిగా అందరికీ చెప్పానన్నారు. మంచి అజెండాతో గెలిచినవారు మంచే చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఈవో సుబ్బారెడ్డి స్వామివారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. కాగా, విజయదశమి పండుగను పురస్కరించుకుని సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనంత ప్రభు శుక్రవారం చిన వెంకన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment