
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతంగా అమలు చేస్తున్నారని కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే కితాబునిచ్చారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన శనివారం విజయవాడలో అధికారులతో సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్ ఎంపీలుగా పని చేసినప్పటి నుంచి తనకు సాన్నిహిత్యం ఉందని, ఇద్దరూ స్నేహభావంతో మెలిగే వ్యక్తులని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ ప్రజలు బ్రహ్మండమైన మద్దతు పలికారన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న తీరు చాలా బాగుందన్నారు. ప్రధానంగా దళితుల ఉద్ధరణకు సీఎం జగన్ చేస్తున్న కృషి బాగుందని తెలిపారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్రంలోని బీజేపీతో చేతులు కలపలేదని, కానీ ప్రధాని మోదీతో కలిసి ఉంటే రాష్ట్రానికి మరింత మంచి జరుగుతుందని చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని సానుకూలంగా ఉన్నారని, అందుకు అనుగుణంగానే కేంద్రం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు సీఎం జగన్ అనేకసార్లు ప్రధానిని కలిశారని, వారి ఎంపీలు కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తున్నారని గుర్తు చేశారు.
ఈ నెల 17న జరిగే సమావేశంలో రాష్ట్రానికి విభజన హామీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాజధానికి నిధులిచ్చే అంశాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటోందన్నారు. ఒక్క రాజధాని అమరావతి అభివృద్ధి చెందడంలేదని, ఈ పరిస్థితిలో మూడు రాజధానులు సరికాదన్నది తన అభిప్రాయమన్నారు. దేనికైనా నిధులు ముఖ్యమన్నారు. ఏపీలో మూడు రాజదానులు నిర్మించడం కష్టసాధ్యమేనని అభిప్రాయపడ్డారు.
బీజేపీ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం
దేశంలో బీజేపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందన్నారు. విద్యాలయాల్లో విద్యార్థుల వస్త్రధారణ మతాలకు అతీతంగా ఉండాలని, మతపరమైన వస్త్రధరణను తాను సమర్థించబోనని చెప్పారు. మీడియా సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్త బి.నాగేశ్వరరావు, ఏపీ అధ్యక్షుడు కె.బ్రహ్మానందరెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment