సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ చికిత్స పేరుతో వైద్యానికి తమదైన వెలకట్టిన రమేష్ ఆస్పత్రి యాజమాన్యం గత సర్కారు హయాంలో భారీ ఎత్తున ఆర్జించినట్టు తెలుస్తోంది. నిర్దేశిత ప్యాకేజీ రేట్లకు మించి రోగుల నుంచి అదనంగా వసూళ్లు చేసినందుకు ఒక్క ఏడాదిలోనే రూ.7 లక్షల పెనాల్టీ విధించడం రమేష్ ఆస్పత్రి నిర్వాకాలను రుజువు చేస్తోంది. అక్రమాలపై క్షుణ్నంగా విచారణ జరుగుతుందనే భయంతోనే ఆరోగ్యశ్రీ చికిత్సకు యాజమాన్యం నిరాకరిస్తోందని భావిస్తున్నారు.
బాధితుల నుంచి భారీగా ..
► టీడీపీ అధికారంలో ఉండగా రమేష్ ఆస్పత్రి యాజమాన్యం ఎన్టీఆర్ వైద్యసేవ పేరుతో భారీగా రోగులను చేర్చుకుంది. ప్యాకేజీలో ఉన్న రేటుకంటే భారీగా వసూళ్లు చేశారు. దీనిపై అప్పట్లో కొందరు ఫిర్యాదులు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు.
► సాధారణ మెటాలిక్ స్టంట్ ధర ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో రూ.45 వేలు మాత్రమే ఉండగా ఇంపోర్టెడ్ స్టంట్ అమరుస్తున్నట్లు రూ.30వేల నుంచి రూ.50 వేల వరకూ అదనంగా వసూలు చేసినట్టు తేలింది.
► ఐదేళ్లలో అక్కడ ఎంతమంది ఆరోగ్యశ్రీలో చికిత్సపొందారు? అనే అంశాల ఆధారంగా విచారిస్తే మొత్తం వసూళ్లు వెలుగులోకి వస్తాయని ఓ అధికారి పేర్కొన్నారు.
అదనపు వసూళ్లకు రూ.7 లక్షలు పెనాల్టీ
► నిబంధనలకు విరుద్ధంగా ప్యాకేజీ రేట్ల కంటే అధికంగా వసూళ్లు చేయడంపై పలువురు బాధితులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఫిర్యాదు చేశారు. గత 12 నెలల వ్యవధిలో రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి రూ.7 లక్షల జరిమానా విధించారంటే ఎంత దారుణంగావ్యవహరించారో అంచనా వేయవచ్చు.
విచారణ భయంతోనే..
► మూడు నెలల క్రితం అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆరోగ్యశ్రీలో వైద్యం చేయలేమని రమేష్ ఆస్పత్రి యాజమాన్యం లేఖ ఇచ్చింది.
► ఐదేళ్ల క్రితం పెద్ద ఎత్తున చికిత్సలు నిర్వహించిన యాజమాన్యం ఇప్పుడు నిరాకరించడానికి కారణాన్ని తేలికగానే ఊహించవచ్చని పేర్కొంటున్నారు. విచారణ భయంతోనే ఆరోగ్యశ్రీ సేవల నుంచి తప్పుకున్నట్లు పేర్కొంటున్నారు.
ఆస్పత్రి నుంచి ఫైల్ రావటమే ఆలస్యం...
► చంద్రబాబు ముఖ్యమంత్రిగాఉండగా సీఎంవో అంతా తమదే అనే తరహాలో రమేష్ ఆస్పత్రి హవా కొనసాగింది. రాష్ట్రంలో అత్యధికంగాముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి (సీఎంఆర్‌ఎఫ్) నిధులు పొందింది రమేష్ ఆస్పత్రే కావడం గమనార్హం.
► గుంటూరులో మోకాలి చిప్ప ఆపరేషన్ నిర్వహించిన ఓ ఆస్పత్రి సీఎంఆర్‌ఎఫ్‌కు లేఖ పంపగా గత సర్కారు రూ.1.20 లక్షలు మంజూరు చేసింది. అదే రమేష్ ఆస్పత్రి నుంచి లేఖ అందితే రూ.1.60 లక్షలు మంజూరు చేసింది. టీడీపీ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఓ అధికారి రమేష్ ఆస్పత్రినుంచి వచ్చే ఏ ఫైలునైనా క్షణం కూడా జాప్యం చేసేవారు కాదని సచివాలయంలో అదే విభాగంలో పనిచేసే ఓ అధికారి వెల్లడించారు.
► రమేష్ ఆస్పత్రికి అధికంగా చెల్లింపులపై అభ్యంతరం చెబితే తమకు బిల్లులు మంజూరయ్యేవి కావని గుంటూరుకు చెందిన ఓ ఆస్పత్రి యజమాని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment