Ramesh Hospital
-
రఘురామను అక్కడికి పంపడమంటే టీడీపీ ఆఫీస్‌కు పంపినట్టే: ఏఏజీ
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును రమేష్ ఆస్పత్రికి పంపడమంటే టీడీపీ ఆఫీస్‌కు పంపినట్టేనని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని అతని తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్థావించారు. తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడిచే రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం, వారు చెప్పిందే నివేదికగా ఇచ్చే అవకాశం ఉందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టు స్వయంగా జీజీహెచ్ బృందాన్ని ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రైవేట్ వైద్యులు, సీఆర్పీఎఫ్ భద్రత, కుటుంబ సభ్యులు ఉంటారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను హైకోర్టు నిన్న సాయంత్రం 6:40కే వెల్లడించిందని తెలిపారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చాక రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని సీఐడీ కోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని ఆయన వివరించారు. ఈ అంశాన్ని సీఐడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. హైకోర్టు ఆర్డర్ కాపీ ఇస్తే తమ తీర్పును సవరిస్తామని సీఐడీ కోర్టు తెలిపిన విషయాన్ని ఆయన వెల్లడించారు. చదవండి: ‘రఘురామకృష్ణరాజు ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు’ -
రమేష్ బాబు కేసు: వేగం పెంచిన పోలీసులు
సాక్షి, కృష్ణా: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబుపై రెండో రోజు విచారణ కొనసాగుతోంది. అగ్ని ప్రమాద ఘటనలో పది మంది మృతిపై పోలీసులు విచారణలో వేగం పెంచారు. డాక్టర్ రమేష్ విచారించేందుకు హైకోర్టు అనుతించడంతో మంగళవారం రెండో రోజు ఏడీసీపీ లక్ష్మీపతి విచారిస్తున్నారు. సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌కు చేరుకొన్న రమేష్‌ను న్యాయవాది సమక్షంలో నేటి సాయంత్రం 5గంటల వరకు ఏడీసీపీ విచారించనున్నారు. ఈరోజు విచారణలో కీలక అంశాలపై వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేశారన్న మృతుల బంధువుల ఆరోపణపై నిజాలు రాబట్టేందుకు ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. లోపభూయిష్టంగా, నిబంధనలు పాటించకుండా కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహించారన్న అభియోగంపై విచారణ సాగుతోంది. చదవండి: రమేష్ బాబు విచారణకు హైకోర్టు అనుమతి -
రమేష్ బాబు విచారణకు హైకోర్టు అనుమతి
సాక్షి, అమరావతి : విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబును విచారించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. అతన్ని కస్టడియల్ విచారణకు అనుమతిని మంజూరు చేస్తూ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో నిందితుడుని అదుపులోకి తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ పొలీసులు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు విచారించనున్నారు. రమేష్ బాబు న్యాయవాది పరివేక్షణలో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ (రమేష్ హాస్పిటల్)లో మంటలు చెలరేగి 10 మంది చనిపోయి 20 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. (రమేష్ ఆస్పత్రిపై సుప్రీంకు ఏపీ సర్కార్) కాగా స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి గవర్నర్‌పేట పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేశ్‌బాబు, చైర్మన్ ఎం.సీతారామ్మోహనరావులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు వారిపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనాడి రమేష్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే విచారణకు అనుమతి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా... తాజాగా మంజూరు చేసింది. దీంతో స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ఇన్ని రోజులు తప్పించుకు తిరిగిన రమేష్ బాబు పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు. -
రమేష్ ఆస్పత్రి నిర్వాకం.. డబ్బులు చెల్లించాకే
సాక్షి, గుంటూరు మెడికల్: బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న మహిళ మృతిచెందగా, డబ్బులు చెల్లించాకే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం తేల్చిచెప్పిన ఘటన గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో సోమవారం జరిగింది. ప్రజాసంఘాలు ఆస్పత్రి ఎదుట ధర్నా చేయటంతో చివరకు మృతదేహాన్ని అప్పగించారు. గుంటూరు మార్కెట్ సెంటర్లోని రమేష్ హాస్పిటల్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామానికి చెందిన చింతగుంట్ల విజయలక్ష్మి (40)కి గత నెల 26న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం విజయవాడ రమేష్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మెరుగైన చికిత్స గుంటూరు రమేష్ హాస్పిటల్లో ఉందంటూ ఆస్పత్రి యాజమాన్యం అదే నెల 29న గుంటూరుకు ఆమెను రిఫర్ చేసింది. గుంటూరులో రూ.3 లక్షలు ఖర్చుపెట్టుకుంటే విజయలక్ష్మి కోలుకుంటుందని చెప్పటంతో కుటుంబసభ్యులు ఆ మేరకు సొమ్ము చెల్లించారు. సెపె్టంబర్ ఒకటిన ఆపరేషన్ చేసినా ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. నాలుగు రోజుల్లో ఆరోగ్యం కుదుటపడుతుందని ఆస్పత్రి వైద్యులు చెప్పినా మెరుగుపడకపోవటంతో కుటుంబ సభ్యులు ఈ విషయంపై వైద్యులను ప్రశ్నించారు. ప్రతిరోజూ రూ.50 వేలు కడితేనే ఆస్పత్రిలో వైద్యం అందిస్తామని, లేకపోతే వెళ్లిపోవాలని చెప్పటంతో ఇప్పటివరకు రూ.11 లక్షలు ఖర్చు చేసినట్టు విజయలక్ష్మి భర్త రాజు తెలిపారు. అప్పు చేసి ఆస్పత్రికి రూ.11 లక్షలు కట్టినా తన భార్య సోమవారం చనిపోయిందని రాజు వాపోయాడు. ఆమె భౌతికకాయాన్ని అప్పగించేందుకు రూ.1.30 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి యజమాన్యం డిమాండ్ చేయటంతో బాధితుడు ప్రజా సంఘాల వారిని సంప్రదించాడు. ఆంధ్ర బహుజన సమితి నాయకుడు పంతగాని రమేష్, అంబేడ్కర్ యువజన సంఘం నాయకుడు బత్తుల వీరాస్వామి, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు విజయభాస్కర్, వినయ్‌కిషోర్, ఇతర సంఘాల నేతలు ఆస్పత్రి యాజమాన్యం తీరును నిరసిస్తూ రమేష్ హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం దిగివచ్చి విజయలక్ష్మి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది. (పది మంది చనిపోతే దర్యాప్తు చేయొద్దా?) -
పది మంది చనిపోతే దర్యాప్తు చేయొద్దా?
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడలోని రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్లో కనీస వైద్య ప్రమాణాలు పాటించనందున ఏకంగా పది మంది చనిపోతే దర్యాప్తు చేయొద్దని, ఆపేయాలని హైకోర్టు ఆదేశించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో నిరాటంకంగా దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది. దర్యాప్తునకు ప్రతివాది పూర్తిగా సహకరించాల్సిందేనని చెప్పింది. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే కోవిడ్ కేర్ సెంటర్లో ప్రమాదం జరిగిందన్న వాదనలను పరిగణనలోకి తీసుకుంది. దర్యాప్తు నిలిపివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోని పేరా 20పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతుండగా ఆస్పత్రి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తులో తదుపరి చర్యలన్నీ నిలిపి వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సోమవారం ఈ పిటిషన్‌ను జస్టిస్ రోహింటన్ ఫాలీనారీమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ప్రభుత్వ న్యాయవాది మెహఫూజ్ ఎ.నజ్కీ వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 5 రోజులలోపు దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం సమర్థనీయం కాదని ముకుల్ రోహత్గీ వాదించారు. ఆస్పత్రి నిర్వహణపై 161 మంది సాక్షుల ప్రత్యక్ష ఆరోపణలు ఉన్నాయని, నిందితులు పరారీలో ఉన్నారని, విచారణకు సహకరించ లేదని నివేదించారు. ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాదులు శ్యామ్ దివాన్, కె.వి.విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారం హైకోర్టు విచారణలో ఉందని, దీనిపై మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే వెలువడినందున ఆ ఉత్తర్వుల్లో జోక్యం తగదని వాదించారు. మరింత సమగ్రంగా వాదనలు వినిపిస్తానని ప్రతివాది తరపు న్యాయవాది శ్యామ్ దివాన్ నివేదించగా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. “వాదనలన్నీ వినిపించాక మళ్లీ సమగ్రంగా వినిపిస్తామంటున్నారు. సీనియర్ న్యాయవాదిగా మీ నుంచి ఈ అభ్యర్థనను ఊహించలేదు..’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శ్యామ్దివాన్ క్షమాపణలు కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులను అదుపులోకి తీసుకోరాదని, దర్యాప్తునకు ప్రతివాది సహకరించాలని షరతు విధించింది. ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ అంశంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టుకు స్వేచ్ఛ ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఏపీ ప్రభుత్వానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్
-
రమేష్ ఆస్పత్రిపై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ : పదిమంది కరోనా బాధితుల మృతికి కారణమైన విజయవాడ రమేష్ ఆస్పత్రిపై చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రమాద కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తుపై ఏకపక్షంగా నిషేధం విధించడం సరికాదన్నారు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల 10 మంది కరోనా పేషెంట్లు చనిపోయారని వివరించారు. రమేష్ ఆస్పత్రి యాజమాన్యం దర్యాప్తునకు సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. (తప్పంతా రమేష్ ఆస్పత్రిదే) దర్యాప్తు సాగే విధంగా హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని న్యాయవాది వాదించారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డాక్టర్ రమేష్ కేసులో విచారణ జరపొచ్చుని తెలిపింది. దర్యాప్తునకు డా.రమేష్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. అయితే రమేష్ అరెస్ట్‌పై సాక్ష్యాల ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చిన ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఆయనకు, మరో డైరెక్టర్ సీతా రామ్మోహన్ రావులను అరెస్టు చేయకుండా స్టే ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ గత గురువారం ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా సుప్రీంకోర్టు నిర్ణయంతో ఏపీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దోషులను కోర్టు నిలబెట్టే విధంగా విచారణ జరుపనున్నారు. -
రమేష్ ఆస్పత్రిపై సుప్రీంకు ఏపీ సర్కార్
సాక్షి, న్యూఢిల్లీ/ అమరావతి : పదిమంది కరోనా బాధితుల మృతికి కారణమైన విజయవాడ రమేష్ ఆస్పత్రిపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రమాద కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేసింది. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల 10 మంది కరోనా పేషెంట్లు చనిపోయారని వివరించింది. ఆస్పత్రి నిర్వహణలో అనేక లోపాలున్నాయని ఏపీ ప్రభుత్వం గురువారం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. రమేష్ ఆస్పత్రి యాజమాన్యం దర్యాప్తునకు సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. నిందితుడు రమేష్ పరారీలో ఉన్నారని కోర్టుకు తెలిపింది. దర్యాప్తుపై స్టే విధంచడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. దీనివల్ల దర్యాప్తను ఆటకం కలుగుతోందని ప్రభుత్వం తెలిపింది. (తప్పంతా రమేష్ ఆస్పత్రిదే) రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఆయనకు, మరో డైరెక్టర్ సీతా రామ్మోహన్ రావులను అరెస్టు చేయకుండా హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం త్వరలోనే విచారణ చేపట్టనుంది. కాగా విజయవాడ రమేష్ ఆస్పత్రికి చెందిన ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి గవర్నర్‌పేట పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేశ్‌బాబు, చైర్మన్ ఎం.సీతారామ్మోహనరావులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు వారిపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనాడి రమేష్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
రమేష్ ఆస్పత్రి యాజమాన్యంపై తదుపరి చర్యలన్నీ నిలిపివేత
సాక్షి, అమరావతి: విజయవాడ రమేష్ ఆస్పత్రికి చెందిన ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి గవర్నర్‌పేట పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేశ్‌బాబు, చైర్మన్ ఎం.సీతారామ్మోహనరావులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు వారిపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనాడి రమేష్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ► రమేష్‌బాబు, సీతారామ్మోహన్రావులపై కఠిన చర్యలేవీ తీసుకోబోమని చెబితే కేసు పూర్వాపరాల్లోకి వెళ్లబోమని, లేని పక్షంలో ఈ ఘటనకు జిల్లా కలెక్టర్, మిగిలిన అధికారులను బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయమూర్తి ప్రతిపాదించారు. ► అధికారులను నిందితులుగా చేయకుండా ఈ కేసులో ముందుకెళ్లడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో రమేష్ ఆస్పత్రి కంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందన్నారు. ► అంతకుముందు పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం ఘటనలో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని చెప్పారు. ► స్వర్ణ ప్యాలెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అందులో సౌకర్యాలు, లోపాలు చూసుకోవాల్సిన బాధ్యత ఆస్పత్రి యాజమాన్యంపైనే ఉందని తెలిపారు. ► కోవిడ్ కేంద్రానికి అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతరపత్రం లేదన్నారు. ఈ విషయం తెలిసి కూడా ఆ హోటల్‌తో ఆస్పత్రి ఒప్పందం చేసుకుందని చెప్పారు. ► దర్యాప్తు పూర్తిస్థాయిలో జరుగుతోందని, పిటిషనర్లను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయన్నారు. ► కాగా, హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
తప్పంతా రమేష్ ఆస్పత్రిదే
స్వర్ణ ప్యాలెస్‌కు అన్ని అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయని అనుకుని ఆ హోటల్‌తో ఒప్పందం చేసుకున్నామన్న రమేష్ ఆస్పత్రి యాజమాన్యం వాదనను తోసిపుచ్చుతున్నాం. లీజుకు తీసుకునేటప్పుడు సౌకర్యాలు గురించి పట్టించుకోకపోవడం, హోటల్లో ఉన్న లోపాలను ప్రమాదం జరిగిన ఆగస్టు 9 నాటికి కూడా సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం పూర్తిగా నిర్లక్ష్యం కిందకే వస్తుంది. – కోర్టు వ్యాఖ్య సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్: విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పదిమంది కోవిడ్ రోగులు మరణించిన ఘటనతో తమకేమీ సంబంధం లేదన్న రమేష్ ఆస్పత్రి యాజమాన్యం వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని విజయవాడ ఐదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో తప్పంతా ఆస్పత్రి యాజమాన్యానిదేనని స్పష్టం చేసింది. ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయంది. రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం తన బాధ్యత నుంచి ఏ మాత్రం తప్పించుకోలేదంది. ► కోవిడ్ సెంటర్‌గా స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను వాడుకుంటామని జిల్లా వైద్యాధికారి (డీఎంవో)కి లేఖ రాసింది.. ఆస్పత్రేనని గుర్తు చేసింది. ► హోటల్‌తో ఒప్పందం చేసుకునేటప్పుడే దానికి అన్ని అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయో, లేదో చూసుకోవాల్సిన బాధ్యత రమేష్ ఆస్పత్రిదేనని తేల్చిచెప్పింది. ► ఈ దశలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు, రికార్డులను తారుమారు చేయడంతోపాటు దర్యాప్తులో జోక్యం చేసుకుంటారంది. ► స్వర్ణ ప్యాలెస్ ఘటనలో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రమేష్ ఆస్పత్రి సీవోవో డాక్టర్ కొడాలి రాజగోపాల్రావు, జీఎం డాక్టర్ కూరపాటి సుదర్శన్, పీఆర్వో పి.వెంకటేష్‌లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. ► ఈ మేరకు విజయవాడ ఐదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఏమందంటే.. ► స్వర్ణ ప్యాలెస్‌కు అన్ని అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయని అనుకుని ఆ హోటల్‌తో ఒప్పందం చేసుకున్నామన్న రమేష్ ఆస్పత్రి యాజమాన్యం వాదనను తోసిపుచ్చుతున్నాం. ► ఆ హోటల్లో అగ్నిమాపక, ఫైర్ అలారమ్ పరికరాలు కూడా లేవు. ► కోవిడ్ కేంద్రం రోజువారీ నిర్వహణ చూసుకునే రమేష్ ఆస్పత్రికి ఈ పరికరాలు లేవన్న విషయం స్పష్టంగా తెలిసే ఉంటుంది. ► లీజుకు తీసుకునేటప్పుడు సౌకర్యాలు గురించి పట్టించుకోకపోవడం, హోటల్లో ఉన్న లోపాలను ప్రమాదం జరిగిన ఆగస్టు 9 నాటికి కూడా సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం పూర్తిగా నిర్లక్ష్యం కిందకే వస్తుంది. ► అగ్నిప్రమాదం జరిగితే ప్రాణహాని ఉంటుందన్న విషయం కూడా ఆస్పత్రి యాజమాన్యానికి తెలుసు. ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. ► అన్నీ తెలిసే స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ కేంద్రాన్ని తెరిచారు. ► ఈ విషయంలో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేయడం సబబే. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కీలక నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంది. -
రమేష్ హాస్పిటల్: నిందితులకు కోర్టులో చుక్కెదురు
సాక్షి, విజయవాడ: స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రిమాండ్‌లో ఉన్న నిందితులకు కోర్టులో చుక్కెదురయ్యింది. బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు రాజగోపాల్, సుదర్శన్, వెంకటేష్‌లు సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న తర్వాత బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టేశారు. దీంతో రేపు రమేష్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు నిందితులను సబ్ జైలులో సౌత్ జోన్ ఏసీపీ సూర్యచంద్ర రావు విచారించనున్నారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్లో అగ్ని ప్రమాదం ఘటన జరిగిన తరువాత పరారీలో ఉన్న డాక్టర్ రమేష్‌బాబు, ముత్తవరపు శ్రీనివాసబాబుల ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని విజయవాడ నగరపోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అగ్నిప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంగళవారం అందజేశారు. (చదవండి : స్వర్ణ ప్యాలెస్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం) -
అక్రమాల ఆసుపత్రి
సాక్షి, అమరావతి బ్యూరో/పటమట: అత్యాధునిక వైద్యం పేరుతో రోగుల నుంచి అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్న రమేష్ ఆస్పత్రి యాజమాన్యం యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడింది. రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పోతినేని రమేష్‌బాబు గత సర్కారు అండదండలతో ధనార్జనే లక్ష్యంగా అడ్డదిడ్డంగా నిర్మాణాలు చేపట్టారు. క్యాంటీన్ ‘సెట్’ చేశారు.. ► విజయవాడలోని లయోలా కళాశాల ప్రాంగణంలో 1988లో ఆరు పడకలతో ప్రారంభమైన రమేష్ ఆస్పత్రి పార్కింగ్ స్థలంలో నిర్మాణాలు చేపట్టటంతోపాటు సెట్‌బ్యాక్ స్థలంలో క్యాంటీన్ ఏర్పాటు చేసింది. బందరు రోడ్డు బ్రాంచ్ ఆస్పత్రిలో ఏకంగా రోడ్డుపైనే ర్యాంపుల నిర్మాణం చేపట్టారు. సెట్‌బ్యాక్ నిబంధనలు పాటించలేదు. ► ఆస్పత్రి, నర్సింగ్‌హోం, క్లినిక్స్ లాంటి వాటికి బిల్టప్ ఏరియాలో 20 శాతం స్టాఫ్ పార్కింగ్‌కు, 10 శాతం సందర్శకుల పార్కింగ్‌కు కేటాయించాలి. రమేష్ ఆస్పత్రి నిర్వాహకులు పార్కింగ్ కోసం రోడ్లను వినియోగిస్తున్నారు. ► 10–15 మీటర్ల ఎత్తున్న ఆస్పత్రులకు 2.5 మీటర్లు సెట్‌బ్యాక్ వదలాల్సి ఉండగా రమేష్ ఆస్పత్రిలో 1.5 మీటర్లు మాత్రమే ఉంది. ఫలితంగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు తిరిగేందుకు అవకాశం లేదు. చివరకు మరుగుదొడ్లలోనూ.. ► పార్కింగ్‌కు కేటాయించిన స్థలాన్ని స్టోర్ రూంగా వినియోగిస్తున్నారు. ► ప్రధాన ఆసుపత్రి ఎదురుగా ఉన్న పోస్టాఫీస్ వద్ద డ్రైనేజీని మూసివేసి పార్కింగ్‌కు వాడుతున్నారు. ఇక్కడ అనధికారికంగా నిర్మించిన అంతస్తుకు ఎలాంటి అనుమతులు లేవు. ► మినీ సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటు చేయకుండా ఆస్పత్రి వ్యర్థాలను నేరుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి(యూజీడీ)కి కలిపేస్తున్నారు. ► బ్రాంచ్ ఆస్పత్రిలో ఒక్క కనెక్షన్‌కే పన్ను చెల్లిస్తుండగా అందులో సుమారు 20 టాయిలెట్లు ఉన్నాయి. ప్రధాన ఆస్పత్రిలోనూ ఒక్క కనెక్షనే తీసుకుని 30 పైగా టాయిలెట్లకు పన్ను చెల్లించడం లేదు. చివరకు మరుగుదొడ్ల పన్నును కూడా ఆసుపత్రి యాజమాన్యం ఎగ్గొట్టింది. గుట్టుగా బయోవేస్ట్ డంపింగ్.. ► రమేష్ హాస్పిటల్స్‌లో రోజుకు సగటున రెండు టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఆస్పత్రులు విడుదల చేసే బయోవేస్ట్‌ను పర్యావరణశాఖ అనుమతులున్న ఏజెన్సీ ద్వారా డిస్పోజ్ చేయాలి. లేదా ఆస్పత్రి ఆవరణలోనే భూమిలో కలిసేలా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి. రమేష్ ఆస్పత్రి యాజమాన్యం అలాంటి ఏర్పాట్లేమీ చేయకపోగా గుట్టుగా వీఎంసీ డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. ఉల్లంఘనలపై కఠిన చర్యలు ‘ఆస్పత్రికి అనుమతులపై పరిశీలన జరుగుతోంది. బందరు రోడ్డు విస్తరణలో నిర్వాసితులకు ఇచ్చిన రాయితీలను పరిశీలిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవు. అక్రమాలు నిర్థారణ అయితే కూల్చివేస్తాం’ – సూరజ్, ఇన్చార్జి సిటీ ప్లానర్ రమేష్ ఆస్పత్రి ఘటన నిందితులకు రిమాండ్ పొడిగింపు విజయవాడ లీగల్: విజయవాడ రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలోని ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అరెస్టు అయిన ముగ్గురు నిందితులకు వచ్చే నెల ఒకటో తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పి.శ్రీసత్యాదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ (రమేష్ హాస్పిటల్)లో మంటలు చెలరేగి 10 మంది చనిపోయి 20 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో గవర్నర్‌పేట పోలీసులు డాక్టర్ కొడాలి రాజగోపాలరావు, డాక్టర్ కూరపాటి సుదర్శన్, మేనేజర్ పల్లపోతు వెంకటేష్‌లను ఈనెల 9న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఈనెల 21 వరకు రిమాండ్ విధించారు. రిమాండ్ ముగియడంతో మచిలీపట్నం సబ్‌జైలులో ఉన్న నిందితులకు న్యాయమూర్తి వీడియో లింకేజి ద్వారా వచ్చే నెల ఒకటో తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా స్వర్ణ ప్యాలెస్ ఘటనలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయమని కోరుతూ రమేష్ హాస్పిటల్స్ అధినేత దాక్టర్ పి.రమేష్‌బాబు ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి.. ఏపీపీ కౌంటర్ వేసేందుకు సమయం కోరడంతో కౌంటర్, వాదనల నిమిత్తం సోమవారానికి పిటిషన్‌ను వాయిదా వేశారు. -
డా.రమేష్ ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి
సాక్షి, అమరావతి బ్యూరో: స్వర్ణ ప్యాలెస్ హోటల్లో అగ్ని ప్రమాదం ఘటన జరిగిన తరువాత పరారీలో ఉన్న డాక్టర్ రమేష్‌బాబు, ముత్తవరపు శ్రీనివాసబాబుల ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని విజయవాడ నగరపోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ప్రకటించారు. పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ►స్వర్ణ ప్యాలెస్‌లో క్వారంటైన్ సెంటర్ కాకుండా కోవిడ్ కేర్ సెంటర్ పేరుతో రోగులకు చికిత్స అందించారు. ఎటువంటి జాగ్రత్తలు, నిబంధనలు పాటించకుండా కోవిడ్ కేర్ సెంటర్‌ను నిర్వహించారు. ట్రీట్మెంట్కు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఉంటే అందరూ బతికే వారు. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని విచారించాం. స్వర్ణ ప్యాలెస్ హోటల్, రమేష్ ఆసుపత్రి యాజమాన్యాల మధ్య ఏం ఒప్పందం జరిగిందో చెప్పలేక పోతున్నారు. 91 సీఆర్పీసీ కింద ఆస్పత్రి బోర్డు సభ్యులకు నోటీసులు ఇచ్చాం. ►కేసు విచారణకు ముద్దాయిలు, అనుమానితులు సహకరించడం లేదు. దర్యాప్తునకు సహకరిస్తే వారికే మంచిది. పోలీసులకు అందరూ సమానమే. -
కులాన్ని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు
సాక్షి, హనుమాన్ జంక్షన్ రూరల్ : ‘ఏ సమస్య వచ్చినా దానికి కులం రంగు పూయడం చంద్రబాబునాయుడుకు అలవాటైంది. కమ్మ వాళ్లను భ్రష్టు పట్టిస్తున్నాడు’ అని కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం బాపులపాడు మండలం ఆరుగొలనులో మీడియాతో మాట్లాడారు. ఐదు నెలల్లో నాలుగు రోజులు మాత్రమే రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఫోన్‌ను ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవ్వరికి లేదన్నారు. వంశీ ఇంకా ఏమన్నారంటే.. ► ఉమక్క (దేవినేని ఉమ) చెప్పే దానికి ఏమైనా అర్థం ఉందా? 70 లక్షల మంది కమ్మ వాళ్లపై ఎవరు కక్ష సాధిస్తారు? నాపై, మీపై ఎవరైనా కక్ష సాధిస్తున్నారా? తప్పు చేసినప్పుడు కేసు పెడితే కక్ష సాధింపు ఎలా అవుతుంది? మీకు (రమేష్ హాస్పటల్స్) ఆరోగ్యశ్రీ బిల్లులు మొత్తం ఇచ్చినప్పుడు జగన్మోహన్రెడ్డి మంచితనం కనపడలేదా? ► రమేష్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేశారా? లక్షలకు లక్షలు ఫీజులు తీసుకుని, కరోనా లేని వారిని కూడా హోటల్లోని కోవిడ్ సెంటర్లో పెట్టారు. ఇలాంటి ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. కానీ అక్కడ బాబు, లోకేష్ నోరు పెగలదు. మన దగ్గరే విచిత్రం. ► విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగాక కేసులు పెట్టారు. వారిని అరెస్టు చేయాలని చంద్రబాబు రోజూ ప్రెసిడెంట్‌కు, పీఎంకు లేఖలు రాశారు. మీ ఆసుపత్రిలో పది మంది ప్రాణాలు పోయి, కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు కులం కనపడుతుంది. -
నెగిటివ్ ఉన్నా చికిత్స
సాక్షి, అమరావతి: రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా 10 మంది మృత్యువాత పడ్డారని విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాద ఘటనపై జేసీ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. ధనార్జనే ధ్యేయంగా రమేష్ ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించిందని తేల్చింది. ఈమేరకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్, సబ్‌కలెక్టర్, డీఎంహెచ్ఓ, రీజనల్ ఫైర్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లతో కూడిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. ► రమేష్ ఆస్పత్రి అన్ని నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది ► డబ్బు యావతో నియమాలు, చట్టాలను పట్టించుకోలేదు. ► కోవిడ్ ఆస్పత్రిలో పదిమంది ప్రాణాలు కోల్పోవటానికి రమేష్ ఆస్పత్రి యాజమాన్యానిదే బాధ్యత. ► కోవిడ్ కేంద్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలూ ఉల్లంఘించింది. ► కోవిడ్ సోకిందన్న అనుమానం ఉన్నవారిని, నెగిటివ్ వచ్చినవారినీ చేర్చుకున్నారు. ► ప్రభుత్వ అనుమతి లేకుండానే, అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించకుండా స్వర్ణప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. ► అనుమతి లేకున్నా ప్లాస్మా థెరపీ నిర్వహించారు. ► అవసరం లేకున్నా ఖరీదైన రెమ్‌డెసివర్ మందులు ఇచ్చారు. ► హోటల్‌కు అగ్నిమాపక పరికరాలు గానీ, నిరభ్యంతర పత్రంగాని లేవు. ► భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు. ► మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.33.69లక్షల పన్ను బకాయిలు చెల్లించలేదు. -
‘రమేష్ ఆస్పత్రి నిబంధనలు ఉల్లంఘించింది’
-
స్వర్ణ ప్యాలెస్ ఘటనతో.. నిరంతరం నిఘా
మచిలీపట్నం: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనతో కోవిడ్ ఆసుపత్రులపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కోవిడ్ ఆసుపత్రులుగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు, వారి భద్రతకు పెద్దపీట వేసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆసుపత్రులపై పర్యవేక్షణ పెంచడంతో పాటు, నిఘాను పట్టిష్టం చేసేలా చర్యలకు ఉపక్రమించింది. కోవిడ్ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జారీచేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో ఎంపిక చేసిన 13 ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా దృష్టి సారించారు. ఇప్పటికే 11 ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడలోని లిబర్టీ ఆసుపత్రి, మచిలీపట్నం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న కోవిడ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం నాటికి సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టారు. లిబర్టీ ఆసుపత్రిలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి కోవిడ్ ఆసుపత్రుల్లో పర్యవేక్షణ పెంచేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రుల్లోని కోవిడ్ కేంద్రం మొత్తం సీసీ కెమెరాలతో అనుసంధానం చేస్తున్నారు. ప్రధాన గేటు మొదలుకొని కేంద్రంలోని అన్ని గదులు, పరీక్షలు నిర్వహించే ప్రదేశం, వైద్య సేవలు అందించే వార్డులు, నమోదు కేంద్రం ఇలా అన్ని చోట్లా సీసీ కెమెరాలను అమర్చాలని ఆదేశాలు అందాయి. వీటిని కోవిడ్ విభాగం ఉన్నతాధికారులు తరచూ పర్యవేక్షణ చేయడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా సీసీ పుటేజీలను భద్రపరచాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు విముఖత చూపే ఆసుపత్రుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, కోవిడ్ నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో కరోనా తగ్గుముఖం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఐసీఎంఆర్ తాజా నివేదికల మేరకు 2,89,290 లక్షల మందికి జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహించారు. 12,760 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 9,665 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఇంకా 2,863 మంది కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజా గణాంకాల మేరకు ఇతర జిల్లాలతో పోలిస్తే కృష్ణాలోనే తక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి. రికవరీ శాతం కూడా జిల్లాలో బాగానే ఉండటం అధికారులకు ఊరటనిస్తోంది. రానున్న రోజుల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ద్వారా జిల్లాలో కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం రేయింబవళ్లు పనిచేస్తున్నారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులు: 13 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినవి: 11 కరోనా పరీక్షల సంఖ్య: 2,89,290 పాజిటివ్ కేసులు: 12,760 కోలుకున్న వారు: 9,665 చికిత్స పొందుతున్న వారు: 2,863 -
అగ్నిప్రమాదం కేసు: కస్టడీ పిటీషన్‌పై నేడు విచారణ
సాక్షి, విజయవాడ: అగ్నిప్రమాదం లో పది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన కేసులో నిందితుల కస్టడీ పిటీషన్ పై నేడు కోర్టు విచారణ జరపనుంది. కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న రమేష్ ఆసుపత్రికి చెందిన కీలక వ్యక్తులు జైలులో ఉన్న రమేష్ ఆసుపత్రి సీ ఓఓ రాజగోపాల్, జనరల్ మేనేజర్ సుదర్శన్, కోఆర్డినేటర్ వెంకటేష్ కస్టడీకి పోలీసులు పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ స్వర్ణపాలెస్ హోటల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని పిటీషన్లో పేర్కొన్నారు. (రమేష్ వాటాదారు ‘ఆస్టర్’కు నోటీసులు) ముగ్గురు నుంచి కీలక సాక్ష్యాలు రాబట్టాలని పిటీషన్లో పోలీసులు కోరారు.పోలీసులు కస్టడీ పిటీషన్ పై మూడవ అదనపు మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు నేడు విచారించనుంది. కస్టడీ నుంచి తప్పించుకునేందుకు బెయిల్ కి ప్రయత్నిస్తున్న నిందితులు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలపనున్నారు. రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం వల్లే పదిమంది ప్రాణాలు పోయాయని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు స్పష్టం చేశారు. (ఆరోగ్యశ్రీ ముసుగులో ‘రమేష్’ మోసాలు!) -
రమేష్ వాటాదారు ‘ఆస్టర్’కు నోటీసులు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో పదిమంది కరోనా బాధితుల మృతికి కారణమైన రమేష్ ఆస్పత్రి యాజమాన్యం నిర్వాకంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆస్పత్రి భాగస్వామ్యసంస్థలను కూడా విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు రమేష్ ఆస్పత్రిలో ప్రధాన వాటాదారుగా ఉన్న ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ యాజమాన్యానికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. దుబాయ్ కేంద్రంగా ఆస్టర్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రూ.250 కోట్ల పెట్టుబడులు! ► కేరళకు చెందిన డాక్టర్ అజాద్ మూపెన్ ఫౌండర్ చైర్మన్, ఎండీగా దుబాయ్‌లో 1987లో ‘ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్’ సంస్థను ప్రారంభించారు. రమేష్ హాస్పిటల్స్‌లో 51 శాతం వాటా కింద ఆస్టర్ సుమారు రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒంగోలు, గుంటూరు, విజయవాడలోని ఆస్పత్రుల్లో ఈ సంస్థకు వాటాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రమేష్ హాస్పిటల్స్ వాటాదారైన ‘ఆస్టర్’ సంస్థకు కూడా నోటీసులు జారీ చేసి వివరాలు సేకరిస్తామని ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు. మూడు రాష్ట్రాల్లో గాలింపు.. ► ఘటన అనంతరం రమేష్ హాస్పిటల్ సీవోవో, జీఎం, మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రి అధినేత డాక్టర్ రమేష్‌బాబు స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా అప్పటికే పరారైనట్లు గుర్తించారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసబాబు సైతం పరారు కావడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. -
ఆరోగ్యశ్రీ ముసుగులో ‘రమేష్’ మోసాలు!
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ చికిత్స పేరుతో వైద్యానికి తమదైన వెలకట్టిన రమేష్ ఆస్పత్రి యాజమాన్యం గత సర్కారు హయాంలో భారీ ఎత్తున ఆర్జించినట్టు తెలుస్తోంది. నిర్దేశిత ప్యాకేజీ రేట్లకు మించి రోగుల నుంచి అదనంగా వసూళ్లు చేసినందుకు ఒక్క ఏడాదిలోనే రూ.7 లక్షల పెనాల్టీ విధించడం రమేష్ ఆస్పత్రి నిర్వాకాలను రుజువు చేస్తోంది. అక్రమాలపై క్షుణ్నంగా విచారణ జరుగుతుందనే భయంతోనే ఆరోగ్యశ్రీ చికిత్సకు యాజమాన్యం నిరాకరిస్తోందని భావిస్తున్నారు. బాధితుల నుంచి భారీగా .. ► టీడీపీ అధికారంలో ఉండగా రమేష్ ఆస్పత్రి యాజమాన్యం ఎన్టీఆర్ వైద్యసేవ పేరుతో భారీగా రోగులను చేర్చుకుంది. ప్యాకేజీలో ఉన్న రేటుకంటే భారీగా వసూళ్లు చేశారు. దీనిపై అప్పట్లో కొందరు ఫిర్యాదులు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ► సాధారణ మెటాలిక్ స్టంట్ ధర ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో రూ.45 వేలు మాత్రమే ఉండగా ఇంపోర్టెడ్ స్టంట్ అమరుస్తున్నట్లు రూ.30వేల నుంచి రూ.50 వేల వరకూ అదనంగా వసూలు చేసినట్టు తేలింది. ► ఐదేళ్లలో అక్కడ ఎంతమంది ఆరోగ్యశ్రీలో చికిత్సపొందారు? అనే అంశాల ఆధారంగా విచారిస్తే మొత్తం వసూళ్లు వెలుగులోకి వస్తాయని ఓ అధికారి పేర్కొన్నారు. అదనపు వసూళ్లకు రూ.7 లక్షలు పెనాల్టీ ► నిబంధనలకు విరుద్ధంగా ప్యాకేజీ రేట్ల కంటే అధికంగా వసూళ్లు చేయడంపై పలువురు బాధితులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఫిర్యాదు చేశారు. గత 12 నెలల వ్యవధిలో రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి రూ.7 లక్షల జరిమానా విధించారంటే ఎంత దారుణంగావ్యవహరించారో అంచనా వేయవచ్చు. విచారణ భయంతోనే.. ► మూడు నెలల క్రితం అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆరోగ్యశ్రీలో వైద్యం చేయలేమని రమేష్ ఆస్పత్రి యాజమాన్యం లేఖ ఇచ్చింది. ► ఐదేళ్ల క్రితం పెద్ద ఎత్తున చికిత్సలు నిర్వహించిన యాజమాన్యం ఇప్పుడు నిరాకరించడానికి కారణాన్ని తేలికగానే ఊహించవచ్చని పేర్కొంటున్నారు. విచారణ భయంతోనే ఆరోగ్యశ్రీ సేవల నుంచి తప్పుకున్నట్లు పేర్కొంటున్నారు. ఆస్పత్రి నుంచి ఫైల్ రావటమే ఆలస్యం... ► చంద్రబాబు ముఖ్యమంత్రిగాఉండగా సీఎంవో అంతా తమదే అనే తరహాలో రమేష్ ఆస్పత్రి హవా కొనసాగింది. రాష్ట్రంలో అత్యధికంగాముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి (సీఎంఆర్ఎఫ్) నిధులు పొందింది రమేష్ ఆస్పత్రే కావడం గమనార్హం. ► గుంటూరులో మోకాలి చిప్ప ఆపరేషన్ నిర్వహించిన ఓ ఆస్పత్రి సీఎంఆర్ఎఫ్కు లేఖ పంపగా గత సర్కారు రూ.1.20 లక్షలు మంజూరు చేసింది. అదే రమేష్ ఆస్పత్రి నుంచి లేఖ అందితే రూ.1.60 లక్షలు మంజూరు చేసింది. టీడీపీ హయాంలో సీఎంఆర్ఎఫ్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఓ అధికారి రమేష్ ఆస్పత్రినుంచి వచ్చే ఏ ఫైలునైనా క్షణం కూడా జాప్యం చేసేవారు కాదని సచివాలయంలో అదే విభాగంలో పనిచేసే ఓ అధికారి వెల్లడించారు. ► రమేష్ ఆస్పత్రికి అధికంగా చెల్లింపులపై అభ్యంతరం చెబితే తమకు బిల్లులు మంజూరయ్యేవి కావని గుంటూరుకు చెందిన ఓ ఆస్పత్రి యజమాని వాపోయారు. -
ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి నోటీసులిస్తాం: ఏసీపీ
-
ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి నోటీసులిస్తాం: ఏసీపీ
సాక్షి, విజయవాడ : విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని ఏసీపీ సూర్యచంద్రరావు పేర్కొన్నారు. ఏసీపీ సూర్యచంద్రరావు ఆదివారం సాక్షి టీవీ మాట్లాడారు. ' రమేశ్ ఆసుపత్రి యాజమాన్య వ్యవహారంపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నాం. ఇప్పటి వరకు డాక్టరు మమత, సౌజన్యను విచారించాం. విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి కూడా నోటీసులిస్తాం. రమేష్ అల్లుడు కళ్యాణ్ చక్రవర్తి ఈరోజు విచారణకు రావాలి. ఆరోగ్యం బాగోలేదు రెండు వారాలు క్వారంటెన్లో ఉండాలని మెయిల్ చేశారు.ఆయన సోదరుడు ఆరోగ్యం బాగోలేదని, ఇంట్లోనే అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇంట్లోనే విచారణకు రమ్మన్నారు. నిజంగా ఆరోగ్యం బాగాలేదా లేక నోటీసులు తీసుకుని విచారణకు ఆటంకం కలిగించడానికి ఈవిధంగా చేస్తున్నారా అన్నది పరిశీలిస్తున్నాం. వృద్దాప్యంలో ఉన్నవారు విచారణకు రాలేకపోతే ఇంటికికే వెళ్లి విచారిస్తాం..మిగిలిన వారు తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే.. ప్రమాదానికి పూర్తి బాధ్యత ఎవరిది అన్నది దర్యాప్తులో తేలుతుంది. రమేష్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. (అడుగడుగునా నిర్లక్ష్యం) 'సెల్ స్విచ్ ఆఫ్ చేసి, సొంత కారును అక్కడే వదిలేసి మరో కారులో వెళ్లిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా లేరు. పరారీలో ఉండి దొంగచాటుగా ఆడియో టేపు విడుదల చేసి విచారణకు సహకరిస్తామని చెప్పడం సరికాదు. నేడు 91 సీఆర్పీసీ కింద ఆయన వద్ద ఉన్న డాక్యుమెంట్లను తీసుకు రావాలని నోటీసు ఇస్తాం. ఆక్సిజన్ సిలిండర్లు, ఫార్మసీ వంటి వాటికి ఏయే ఎంవోయూ చేసుకున్నారో మాకు తెలియజేయాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారో చూపించాలి.ఆస్టర్ గ్రూప్ తో అగ్రిమెంట్, బోర్డ్ అఫ్ డైరెక్టర్స్, వారి బాధ్యత తెలియాలి. హోటల్ వేరు, కోవిడ్ కేర్ సెంటర్ వేరు. ఇందులో పేషన్ట్లు ఉంటారు కాబట్టి.. ప్రతి అంతస్తుకు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి. స్వర్ణ ప్యాలస్, రమేష్ ఆసుపత్రి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ జరిగిందో ఇప్పటి వరకు మాకు చూపించలేదు. దీనిపై ఆయనకు అవగాహన లేదనిపిస్తుంది. క్వారంటెన్ వేరు, కొవిడ్ కేర్ సెంటర్ వేరు.. ఎవరి అభప్రాయాలు వారికి ఉంటాయి. విచారణకు ఎవరు ఆటంకం కలిగించినా నోటీసులు ఇస్తాం.' అంటూ వెల్లడించారు. రామ్ అసత్య ఆరోపణలు మానుకోవాలి అగ్నిప్రమాదంలో పదిమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సినీ హీరో రామ్ ట్వీట్లను పోలీసులు తప్పుపడుతున్నారు .క్వారెంటైన్ సెంటర్‌కి కోవిడ్ కేర్ సెంటర్‌కి తేడా తెలుసుకోకుండా పోస్టింగులు పెట్టడం సరికాదంటున్నారు. బాబాయ్ డాక్టర్ రమేష్‌ని కాపాడుకొనేందుకు అసత్య ఆరోపణలతో విచారణకు అడ్డు తగిలితే రామ్‌కి కూడా నోటీసులు ఇస్తామని హెచ్చరిస్తున్నారు. పదిమంది ప్రాణాలు పోతే రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్ బాబు పారిపోయి ఆడియో టేపులు విడుదల చేయటం బాధ్యతారాహిత్యమంటున్నారు. ట్వీట్లు ,ఆడియో టేపులు పంపటం మాని ఆధారాలు ఉంటే విచారణకు హాజరు కావాలని ఏసీపీ సూర్యచంద్రరావు సూచించారు. -
అడుగడుగునా నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: రమేష్ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యానికి పది నిండు ప్రాణాలు పోయాయి. కోవిడ్ భయంతో వచ్చి హోటల్లో చేరినవారు చివరకు ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్యానికి బలయ్యారు. ‘‘రమేష్ యాజమాన్యం ఆ హోటల్‌కు అగ్నిమాపక అనుమతులు ఉన్నాయా లేదా.. రోగులకు ఎలాంటి వసతులు ఉన్నాయి అన్నది పట్టించుకోనేలేదు. హోటల్లో రోగుల కోసం కనీసం స్పెషలిస్టు డాక్టరును కూడా కేటాయించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది.’’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదిక పేర్కొంది. 13 పేజీల నివేదికలో రమేష్ ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్యాన్ని అడుగడుగునా ప్రస్తావించింది. రోగులను చేర్చుకోవడం, వారినుంచి డబ్బు తీసుకోవడం మినహా..ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదని, ప్రభుత్వ నిబంధనలు గానీ, ఐసీఎంఆర్ నిబంధనలు గానీ ఏవీ పాటించలేదని కమిటీ పేర్కొంది. స్వయానా కొంతమంది బాధితులే కమిటీ ముందుకొచ్చి రమేష్ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగినట్టు స్టేట్మెంటు ఇచ్చారని పేర్కొంది. కోవిడ్ పాజిటివ్ వచ్చినవారికి చికిత్స అందించాల్సిన ఆస్పత్రి యాజమాన్యం పాజిటివ్ రానివారిని కూడా అక్కడ ఉంచి డబ్బులు దండుకుందని తేల్చింది. నివేదికలో ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.. డీఎంహెచ్‌వోకు సమాచారమే లేదు.. ► కోవిడ్ కేర్ సెంటర్ కోసం అనుమతులు ఇచ్చాక అక్కడ చేర్చుకునే పేషెంట్లు, డిశ్చార్జి అయ్యే వారి వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో)కి తెలియజేయాలి. కానీ ఏ ఒక్కరోజూ ఒక్క పేషెంటు వివరం కూడా చెప్పలేదు. ► రెండు హోటళ్లలో కోవిడ్‌సెంటర్ నిర్వహణకు ప్రాథమిక అనుమతి ఇవ్వగా ఇతర హోటళ్లలో అనుమతి లేకుండా కోవిడ్ సెంటర్లను నిర్వహించారు. (అయితే ఈ సెంటర్లలో దేనికీ మున్సిపల్ పర్మిషన్లు గానీ, ఫైర్‌సేఫ్టీ ఎన్ఓసీలు గానీ లేనే లేవు.) ఎక్స్‌రే, స్కానింగ్‌లతోనే.. ► ఆర్టీపీసీఆర్ లేదా ట్రూనాట్ ద్వారా పాజిటివ్ అని నిర్ధారించిన తర్వాతే కోవిడ్ కేర్ సెంటర్లో చేర్చాలి. కానీ ఎక్స్‌రే, సీటీస్కాన్లు నిర్వహించి.. పాజిటివ్ అని తేలకపోయినా సెంటర్లో చేర్చుకున్నారు. ► హోటల్ చార్జీ, ట్రీట్మెంటు చార్జీల పేరిట రోజుకు రూ.25 వేలు వసూలు చేశారు. ► ప్రైవేటు సెంటర్ నిర్వాహకులు 10 పడకలు ఆరోగ్యశ్రీకి ఇవ్వాలని ఉంది. కానీ ఒక్క పడక కూడా ఇవ్వలేదు ► కొంతమంది రోగులను పాజిటివ్ అని తేల్చారు.. కానీ వారికి ఆ తర్వాత అపోలో సెంటర్లో నిర్ధారణ చేయగా నెగిటివ్ అని వచ్చింది. ఇంజక్షన్ల వాడకంలోనూ నిర్లక్ష్యం.. ► రోగి లక్షణాల తీవ్రత, రక్తంలో ఆక్సిజన్ తీవ్రత తగ్గడం వంటివి పరిశీలించాకనే రెమ్‌డెసివిర్ అనే యాంటీ వైరల్ మందులు ఇవ్వాలి. కానీ అందరికీ ఈ మందులు ఇచ్చినట్టు వెల్లడయ్యింది. ► తీవ్రత లేనివారికి కోవాఫిర్ ఇంజక్షన్లు ఇవ్వకూడదు. కానీ ఈ ఇంజక్షన్లు ఇచ్చినట్టు బిల్లుల్లో చూపించారు. ► ప్లాస్మా చికిత్స చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రాష్ట్ర అథారిటీకి అధికారిక సమాచారం ఇవ్వాలి. అవేమీ లేకుండానే ప్లాస్మా చికిత్స చేశారు. ► రమేష్ ఆస్పత్రిలోనూ రోజుకు రూ.40వేల నుంచి రూ.60వేలు వసూలు చేశారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. తనవద్ద భారీగా వసూలు చేసినట్టు ఓ బాధితుడు కమిటీకి వాంగ్మూలమిచ్చాడు. ► చికిత్సలకు రోగులు ఎంత చెల్లించాలో డిస్ప్లే బోర్డులు పెట్టాలని నిబంధనలలో ఉన్నా ఎక్కడా పాటించలేదు. -
తప్పు ఆస్పత్రిదే.. అడుగడుగునా నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: కరోనా బూచి చూపించి విజయవాడ రమేష్ ఆస్పత్రి యాజమాన్యం బాధితుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శకాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ.. బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. అనుమతులు లేకుండా క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు.. భద్రతా ప్రమాణాల పట్ల నిర్లక్ష్యం.. వైద్య ప్రమాణాల పట్ల అలక్ష్యం.. ఖరీదైన వైద్యం మాటున దోపిడీ.. ఇలా దేనికీ అంతనేది లేకుండా వ్యవహరించింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో రమేష్ ఆస్పత్రికి చెందిన కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో పదిమంది మృతికి తప్పంతా ఆస్పత్రి యాజమాన్యానిదేనని తేలింది. ఈ మేరకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ నేతృత్వంలో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో కోవిడ్ కేర్ సెంటర్‌గా రమేష్ ఆస్పత్రి గుర్తింపును రద్దు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. దీంతోపాటు ఆ ఆస్పత్రికి చెందిన నాలుగు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు చేసి మూసివేయించారు. కరోనాకు వైద్యం చేయొద్దని, పాజిటివ్ రోగులను చేర్చుకోవద్దని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. అడుగడుగునా భద్రతా లోపాలు.. ► స్వర్ణ ప్యాలెస్, స్వర్ణ హైట్స్ హోటళ్లలో 50 బెడ్స్ ఏర్పాటుకు, కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణకు రమేష్ ఆస్పత్రికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జూలై 19న అనుమతులు ఇచ్చారు. ► అయితే అనుమతులు రాకముందే స్వర్ణ హైట్స్‌లో జూలై 13, స్వర్ణ ప్యాలెస్‌లో 15 నుంచే కరోనా రోగులకు చికిత్స అందించినట్లు కమిటీ విచారణలో తేలింది. ► అలాగే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎం5 హోటల్లో జూలై 29, మెట్రోపాలిటిన్ హోటల్లో ఆగస్టు 8 నుంచి అనధికారికంగా కోవిడ్ కేర్ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు కమిటీ స్పష్టం చేసింది. ► వైద్య, ఆరోగ్య శాఖ అనుమతులు పొందిన రెండు కేంద్రాలకు కూడా అగ్నిమాపక శాఖ, మున్సిపల్ శాఖల అనుమతుల కోసం ఆస్పత్రి యాజమాన్యం దరఖాస్తే చేయలేదు. ► దరఖాస్తు చేసి ఉంటే సంబంధిత శాఖల అధికారులు హోటల్‌ను పరిశీలించి అసలు అనుమతులు ఇచ్చేవారే కాదు. ► ప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలెస్‌తోపాటు మిగతా మూడు కోవిడ్ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాల గురించి రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. ► కనీసం అగ్నిమాపక శాఖ అనుమతి కూడా లేని హోటల్‌ను కోవిడ్ సెంటర్‌గా ఎంపిక చేసింది. ► అందులో 24 గంటలూ నిపుణులైన సిబ్బందిని ఉంచలేదు. స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ప్రమాదం జరిగిన ఆగస్టు 9న పొగ వస్తున్నా ఎవరూ గుర్తించనే లేదు. స్మోక్ అలారంలు కూడా ఏర్పాటు చేయలేదు. ► కోవిడ్ కేంద్రాలుగా నిర్ణయించిన హోటళ్లలో మౌలిక, వైద్య వసతుల గురించి రమేశ్ హాస్పిటల్స్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. తరచూ కోవిడ్ కేంద్రాలను శానిటైజ్ చేయాల్సి ఉంది. దీనికి తగిన భద్రతా ప్రమాణాలు పాటించే వైద్య, విద్యుత్ టెక్నీషియన్లను నియమించలేదు. ► ఆక్సిజన్ సిలిండర్లను కూడా ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఓ గదిలో ఉంచింది. ఆ సిలిండర్లకు మంటలు వ్యాపించకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ► ఏమాత్రం నైపుణ్యం లేని సిబ్బంది విద్యుత్ స్విచ్ బోర్డులు, వైర్ల మీద కూడా శానిటైజర్లు జల్లడంతో అగ్నిప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో క్షణాల్లోనే మంటలు అంతటా వ్యాపించి పదిమంది మృతికి కారణమయ్యాయి. ఫీజుల పేరుతో దోపిడీ ► రమేష్ ఆస్పత్రి జీవో నంబర్ 77 ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు వసూలు చేయకుండా భారీ మొత్తంలో గుంజినట్టు కమిటీ గుర్తించింది. ► రాష్ట్రంలో మరే ఆస్పత్రి వసూలు చేయనంతగా బాధితుల నుంచి పది రోజులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వసూలు చేసింది. ► కోవిడ్ కేర్ సెంటర్లో చేరే సమయంలోనే అడ్వాన్స్ పేరిట రూ.75 వేల నుంచి రూ.లక్ష వసూలు చేసినట్లు పేర్కొంది. ► రూమ్ అద్దె, వైద్యం, టెస్ట్‌ల పేరిట రోజుకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు తీసుకున్నట్లు తేలింది. ► మరికొందరి నుంచి రోజుకు రూ.40 వేలు –రూ.60 వేల వరకు కూడా వసూలు చేసింది. ► కోవిడ్ అనుమానిత కేసుకు కూడా రోజుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బాదింది. ► బి.సుజాత అనే ఆమె నుంచి ఒక రోజు చికిత్సకు రూ.లక్షతోపాటు నాలుగు బంగారు గాజులను కూడా తీసుకుంది. నిబంధనల మేరకు రోజుకు రూ.8,250 తీసుకోవాల్సి ఉండగా సుజాత నుంచి రూ.91,750 అదనంగా తీసుకోవడంతోపాటు నాలుగు బంగారు గాజులను ఫీజు కింద వసూలు చేసింది. ► వి.హనుమంతరావు అనే వ్యక్తి 5 రోజులు కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నారు. దీనికి ఫీజు కింద రూ.41,250 తీసుకోవాల్సి ఉండగా రూ.1,84,301 పిండుకున్నారు. ► టి.స్వర్ణలత, పి.కృష్ణమోహన్, కె.శివప్రసాద్ అనే వ్యక్తులకు కోవిడ్ లేదు. కనీసం కోవిడ్ లక్షణాలు లేకపోయినా వారిని ప్రమాదం జరగడానికి ముందు కోవిడ్ సెంటర్లో చేర్చుకుంది. ► అగ్నిప్రమాదంలో మరణించిన పదిమందిలో ఎనిమిదిమంది కరోనా నెగెటివ్ వ్యక్తులే. ► రోగుల అడ్మిషన్, డిశ్చార్జ్ వివరాలను కూడా జిల్లా యంత్రాంగానికి తెలపలేదు. ► కాగా, రమేష్ ఆస్పత్రి నిర్వహణలోని కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి 215 మంది డిశ్చార్జ్ అయినట్లు కమిటీ గుర్తించింది. ►అగ్నిప్రమాదం జరిగాక ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాలు రెండూ జిల్లా యంత్రాంగానికి సహకరించలేదు. అంతేకాకుండా జవాబుదారీతనంతో వ్యవహరించలేదని పేర్కొంది. రెమిడెసివర్ అవసరం లేకపోయినా.. ► ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ జరిగి వారిలో ఓ మోస్తరు లక్షణాలుంటేనే క్వారంటైన్ సెంటర్లకు తేవాలి. ► అయితే.. రమేష్ ఆస్పత్రి కోవిడ్ టెస్టులు చేయకుండానే, లక్షణాలు లేకుండానే బాధితులను క్వారంటైన్ కేంద్రాల్లో చేర్చుకుంది. ► ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం లక్షణాలు తీవ్రంగా ఉంటేనే రెమిడెసివర్ ఇవ్వాల్సి ఉండగా లక్షణాలు లేకున్నా పలువురు రోగులకు రెమిడెసివర్ ఇంజక్షన్ ఇచ్చింది. ► ఆ రోగులకు ఇంజక్షన్ అవసరం లేదని, కొంతమందికి ఇవ్వకుండానే ఇచ్చినట్టు బిల్లుల్లో పొందుపరిచిందని కమిటీ గుర్తించింది. -
రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్ రద్దు
సాక్షి, విజయవాడ: స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యంతో పది మంది రోగుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన రమేష్ ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా కోవిడ్ కేర్ సెంటర్లను నడుపుతున్నట్లు శుక్రవారం కమిటీ నివేదిక వెల్లడించింది. దీంతో రమేష్ ఆస్పత్రికి అనుమతిచ్చిన కోవిడ్ కేర్ సెంటర్లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రద్దు చేశారు. విజయవాడ ఎంజీ రోడ్‌లోని డాక్టర్ రమేష్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్పత్రి మాత్రమే కోవిడ్ రోగుల చికిత్స కోసం గుర్తింపు పొందినట్లు గుర్తించారు. (మోసమే మార్గం.. దోపిడీయే లక్ష్యం) రమేష్ ఆస్పత్రి నియంత్రణలో ఉన్న హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఆగస్టు 8న అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో నిబంధనలకు వ్యతిరేకంగా కోవిడ్ కేర్ సెంటర్‌ను పెట్టినట్లు తేలింది. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని వెల్లడైంది. అంతేకాక ఆసుపత్రిలో చేరిన రోగుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేశారని నివేదిక పేర్కొంది. దీంతో కోవిడ్ కేర్ సెంటర్‌గా రమేష్ ఆసుపత్రికి ఇచ్చిన గుర్తింపు రద్దు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. కరోనా పాజిటివ్ రోగులను చేర్చుకోవద్దని రమేష్ ఆసుపత్రిని ఆదేశించారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. (మంటలు తీవ్రమైన తర్వాతే సమాచారం ఇచ్చారా?) -
రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసులు
సాక్షి, విజయవాడ : స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి, బంధువులకు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 160 సీఆర్పీసీ కింద పదిమందికి నోటీసులు అందచేశారు. వీరంతా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి 10మంది మృతి చెందడానికి కారణమైన ఘటనలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్ యజమాని శ్రీనివాస్ బాబుకోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.(స్వర్ణ ప్యాలెస్ రక్షణ వ్యవస్థ అస్తవ్యస్తం) -
రమేష్ ఆస్పత్రి ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్‌పై దర్యాప్తు వేగవంతం
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో రమేష్ ఆస్పత్రి.. స్వర్ణ ప్యాలెస్ హోటల్లో నిర్వహిస్తున్న ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి కారణాలు వెలికి తీసే పనిలో అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులతోపాటు ఇతర విభాగాల అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ► ఇప్పటికే విద్యుత్, అగ్నిమాపక, పురపాలక, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు రెండు రోజులపాటు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలను విశ్లేషించారు. ► బుధవారం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) డైరెక్టర్ నేతృత్వంలో ఇద్దరు అధికారుల బృందం స్వర్ణ ప్యాలెస్‌లోని ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్‌ను క్షుణ్నంగా శోధించింది. ► అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతాలను పరిశీలించి.. కాలిపోయిన పరికరాలను తమ వెంట తీసుకెళ్లింది. ► ప్రమాదం ఎలక్ట్రిక్ పరికరాల వల్ల జరిగిందా? కెమికల్ వల్లా? లేక మరేతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో అధికారుల బృందం పరిశీలించింది. ► సేకరించిన ఆధారాలను ల్యాబ్‌లో పరీక్షించాకే అసలు విషయం వెలుగులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ► కాగా, 10 మంది మృతికి కారణమైన హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసబాబు, రమేశ్ హాస్పిటల్స్ యజమాని రమేశ్‌బాబు పరారీలోనే ఉన్నారు. ► వారిద్దరిని పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నట్లు సౌత్‌జోన్ ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు. -
స్వర్ణ ప్యాలెస్ ఘటన స్థలానికి ఎఫ్ఎస్ఎల్ బృందం
-
స్వర్ణ ప్యాలెస్ ఘటన స్థలానికి ఎఫ్ఎస్ఎల్ బృందం
సాక్షి, విజయవాడ : ప్రైవేటు కోవిడ్ సెంటర్లో (స్వర్ణ ప్యాలెస్) జరిగిన అగ్నిప్రమాదం ఘటన స్థలానికి ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు బుధవారం చేరుకున్నారు. స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదంపై ఈ బృందం పూర్తి వివరాలు సేకరించనుంది. అగ్నిప్రమాదం ఎలా జరిగింది.. దానికి గల కారణాలపై కమిటీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఇప్పటికే స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని జిల్లా స్ధాయి కమిటీ పరిశీలించగా.. రాష్ట్ర స్ధాయి కమిటీ రావడంతో మరికొన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. (అగ్ని ప్రమాదం ఘటన.. నిందితులకు రిమాండ్) -
మోసమే మార్గం.. దోపిడీయే లక్ష్యం
‘హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో అశువులు బాసిన వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. నా డాక్టర్స్ కమ్యూనిటీని చూస్తుంటే కోపం కలుగుతోంది. మన ఆశకి అంతులేకుండా పోతోంది. మనందరికీ తెలుసు.. ఇప్పుడు హాస్పిటల్స్‌లో వైద్యం చేస్తున్న కరోనా పేషెంట్స్‌లో ఎంతమందిని ఆస్పత్రుల్లో ఉంచాల్సిన అవసరం ఉందో? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వీలైనంత తక్కువలో వైద్యం చేయాల్సిందిపోయి మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి. ఇలాంటి పనుల వల్లే మనం ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాం’. ఇదీ.. విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి చెందిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించి పదిమంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో డాక్టర్ల వాట్సాప్ గ్రూప్‌లో సురక్ష హాస్పిటల్స్ యజమాని, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ వీవీబీ చౌదరి ఆవేదన వ్యక్తం చేస్తూ పెట్టిన పోస్టు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం పేరిట జరుగుతున్న దోపిడీ వైనాన్ని డాక్టర్ చౌదరి అభిప్రాయాలు తేటతెల్లం చేస్తున్నాయని మెజార్టీ వైద్యులు అంగీకరిస్తున్నారు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కరోనాను ఆసరా చేసుకుని కార్పొరేట్ ఆస్పత్రులు ధనార్జనకు దారులు వేసుకున్నాయి. కరోనా రోగుల నుంచి ఎంత ఫీజు వసూలు చేయాలనే దానిపై విజయవాడలో కొన్ని వారాల కిందట వైద్యులు భేటీ అయ్యారు. ఇందులో ప్రముఖ వైద్యుడు చేసిన ఫీజుల ప్రతిపాదనలను విన్న సీనియర్ డాక్టర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రోజుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల కంటే ఎక్కువ ఛార్జీ వద్దన్న అభిప్రాయాలకు మద్దతు లభించలేదు. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సలహాలు ఇద్దామన్న ప్రతిపాదనను కూడా తోసిపుచ్చడం కార్పొరేట్ ధనదాహానికి నిదర్శనం. ప్రభుత్వ టెస్టులను కాదని సిటీ స్కాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కరోనా టెస్టుల కంటే సిటీ స్కాన్ ద్వారా మెరుగైన ఫలితం వస్తుందని కార్పొరేట్ ఆస్పత్రులు ప్రచారం మొదలెట్టాయి. టెస్టుల్లోనే రూ.వేలకు వేలు వసూళ్లు చేసుకోవడంతోపాటు జబ్బు రెండు, మూడు, నాలుగు దశలకు చేరిందంటూ ఆస్పత్రిలో చేరాలని, వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరని, క్వారంటైన్లో ఉండాలనే సూచనలతో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరారు. దోపిడీ ఇలా.. రమేశ్ ఆస్పత్రితోపాటు ఒక్కో కార్పొరేట్ ఆస్పత్రికి ఒక్కో రకంగా కరోనాకు ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. పది రోజులకు రూ. 5 లక్షలు, ఏడు రోజులకు రూ.4 లక్షలు, ఐదు రోజులకు రూ.3 లక్షలు చొప్పున నిర్ణయించాయి. బీమా క్లెయిమ్ చేసుకుంటామని రశీదులు ఇవ్వాలని రోగులు అడిగినా ఆస్పత్రులు ఇవ్వడం లేదు. కోవిడ్ పేషెంట్ల వద్దకు బంధుమిత్రులు ఎవరూ రాకపోవడం, వచ్చినా అనుమతించకపోవడం ఆస్పత్రి వర్గాలకు అనుకూలమైంది. క్వారంటైన్లో ఉండే వారే దఫదఫాలుగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. ► ఆర్థికంగా స్థితిమంతులను ఎంపిక చేసుకుని మరీ కోవిడ్ కేర్ సెంటర్లలో చేర్చుకున్నారు. ఇందుకు సహకరించిన ఆర్ఎంపీలు, దళారులకు కొంత చెల్లించారని నిఘా వర్గాలు, పరిశీలన బృందాలు గుర్తించాయి. 26 మందికి నెగెటివ్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన పది మందిలో ఎనిమిది మందికి కరోనా నెగెటివ్ వచ్చింది. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో ప్రమాద సమయానికి ఉన్న మొత్తం 31 మందిలో 26 మందికి నెగెటివ్ ఉండటం గమనార్హం. ఒకరికి స్వాబ్ టెస్టులో రెండు సార్లు నెగెటివ్ వచ్చింది. నిమ్ము చేరిందని వైద్యానికి వస్తే కోవిడ్ కేర్ సెంటర్లో ఉంచడంతో అగ్నిప్రమాదంలో మృతి చెందాడు. ప్రభుత్వ ఆస్పత్రులే.. కోవిడ్ పాజిటివ్ ఉన్న వారికి పెద్ద అండగా ప్రభుత్వాస్పత్రులే నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న కిట్లలో పల్స్ ఆక్సీమీటర్‌తో సహా ఏడు వస్తువులు ఉంటున్నాయని, పాజిటివ్ వచ్చిన వారు కూడా హోం క్వారంటైన్లో ఉండి కోలుకుని వస్తున్నారని నిఘా విభాగంలోని ఓ అధికారి చెప్పారు. సమంజసమైతేనే సమర్థిస్తాం కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల ఫీజుల విషయానికొస్తే సమంజసమైనంత వరకే ఐఎంఏ సమర్థిస్తుంది. అసమంజస, అనైతిక అంశాలకు మద్దతు ఇవ్వం. ప్రభుత్వమే సముచిత నిర్ణయాలు తీసుకోవాలి. – డాక్టర్ ఫణిధర్, రాష్ట్ర కార్యదర్శి, ఐఎంఏ -
విజయవాడ: పరారీలో రమేష్ ఆస్పత్రి యజమాని!
సాక్షి, విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది మృతి చెందిన కేసులో నిందితుడు, రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్‌బాబు పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి. ఫైర్, విద్యుత్, వైద్య, భద్రతా సిబ్బంధి నివేదికలను కమిటీల సభ్యులు సిద్ధం చేశారు. ఈ రోజు సాయంత్రం కలెక్టర్ ఇంతియాజ్‌కు వాటిని సమర్పించనున్నారు. ఇక స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు కమిటీల విచారణలో తేలినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వారు అగ్నిమాపక దళానికి సమాచారం ఇవ్వలేదని కమిటీ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. (‘పర్ఫెక్ట్’వల్లే శానిటైజర్ మరణాలు) మంటలు చెలరేగిన తర్వాత ఫైర్కి సమాచారం ఇచ్చినందువల్లే ప్రమాదస్థాయి పెరిగిందని తెలిసింది. అగ్ని ప్రమాదం గుర్తించే కనీస పరికరాలు, స్మోక్ డిటెక్టర్, పని చేయని అలారం వల్లే ప్రాణనష్టం జరిగినట్టు కమిటీ సభ్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. రమేష్ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదని కమిటీ సభ్యులు నిర్దారించారు. దీంతోపాటు కరోనా రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు, అనుమతికి మించి రోగులను చేర్చుకున్నట్టు వారి కమిటీ సభ్యులు గుర్తించినట్టు తెలిసింది. స్వర్ణ ప్యాలెస్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు చాలా తక్కువని కమిటీ తేల్చినట్టు తెలిసింది. కలప, ఫైబర్‌తో చేసిన ఇంటీరియర్ డెకరేషన్‌కు శానిటైజేషన్ ఎక్కువగా చేయడం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని విద్యుత్ శాఖ తేల్చింది. (అగ్ని ప్రమాదం ఘటనలో నిందితులకు రిమాండ్) -
అగ్ని ప్రమాదం ఘటన.. నిందితులకు రిమాండ్
సాక్షి, విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో అరెస్టయిన ముగ్గురు నిందితులను న్యాయమూర్తి ముందు పోలీసులు హజరు పరిచారు. ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ కొడాలి రాజగోపాలరావు, స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ఇన్చార్జి, ఆస్పత్రి జీఎం డాక్టర్ కె.సుదర్శన్, కోవిడ్ కేర్ సెంటర్ కోఆర్డినేటింగ్ మేనేజర్ పల్లెపోతు వెంకటేశ్‌లకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను మచిలీపట్టణం స్పెషల్ సబ్ జైలుకు పోలీసులు తరలించారు. (నిలువెత్తు నిర్లక్ష్యం) విజయవాడ రమేశ్ ఆస్పత్రి.. హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదానికి కారణం యాజమాన్యం నిర్లక్ష్యం, కనీస భద్రతా చర్యలు లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. సోమవారం అధికారులు, పోలీసులతో కూడిన మూడు ప్రత్యేక బృందాలు స్వర్ణ ప్యాలెస్‌తో సహా రమేశ్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించాయి. నగరపాలక సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. భవన నిర్మాణం జరగకపోవడం, అధికంగా పేషెంట్లను చేర్చుకోవడం, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడం, తదితర లోపాలను తనిఖీ బృందాలు గుర్తించాయి. -
రమేశ్ ఆస్పత్రి ఘటనపై ఎందుకు మాట్లాడవు బాబూ?
సాక్షి, అమరావతి: విజయవాడలో రమేశ్ ఆస్పత్రికి చెందిన కోవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మృతి చెందితే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. విశాఖలో ఏం జరిగినా ప్రభుత్వ వైఫల్యమనే ఆయన అగ్నిప్రమాదంపై మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. తన పార్టీకి చెందినవారికైతే ఒక న్యాయం.. మరొకరికైతే మరో న్యాయమా అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో శ్రీకాంత్‌రెడ్డి ఏమన్నారంటే.. ► చంద్రబాబు జూమ్ మీటింగ్‌లో డాక్టర్ రమేశ్ చౌదరి టీడీపీ వారియర్నంటూ పాల్గొని ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు చేపట్టట్లేదని బురద జల్లారు. అవి తన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమయ్యాయి? ఆయన నిర్లక్ష్యం వల్లే 10 మంది మరణించడం వాస్తవం కాదా? ► రమేశ్ ఆస్పత్రి ఘటనపై బాబు నిజనిర్ధారణ కమిటీ ఎందుకు వేయలేదు? ► ఈ ఘటనను రాజకీయం చేసే ఉద్దేశం మాకు లేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు అందులో తన మనుషులు, తన పార్టీకి చెందిన వాళ్ల ప్రమేయం ఉంటే ఒకలా, లేకుంటే మరోలా స్పందించడం బాబు నైజం. ► ప్రతి విషయంలో కుల రాజకీయాలు చేయడం, కులాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం బాబుకు అలవాటు. ► ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక విచారణలో స్పష్టంగా ఆస్పత్రి యాజమాన్యానిదే తప్పని అధికారులు చెబుతున్నారు. ► 48 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక రాగానే తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. రాయలసీమ గురించి మాట్లాడే హక్కు లోకేశ్, చంద్రబాబుకు లేదు. -
విజయవాడలో అనధికార ఆస్పత్రులు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో రమేశ్ ఆస్పత్రికి చెందిన ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం ఘటనతో కృష్ణా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల భద్రత చర్చనీయాంశమవుతోంది. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు చిన్నా, చితకా ఆస్పత్రులు, డెంటల్ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు తదితరాలు కలిపి 1,018 వరకు ఉండగా.. వీటిలో 88 ప్రభుత్వ ఆస్పత్రులు, మరో 90 ఇతర ఆస్పత్రులు మినహాయిస్తే 840 ఆస్పత్రులకు అగ్నిమాపక శాఖ అనుమతుల్లేవు. చాలా ఆస్పత్రుల్లో అగ్నిప్రమాద నియంత్రణ ఏర్పాట్లు కనిపించడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రులు మినహాయిస్తే పడకలు లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులు, 25 పడకల లోపు, ఆపై ఉన్న పడకల ఆస్పత్రులు మొత్తం 930 ఉండగా వీటిలో కేవలం 90 ఆస్పత్రులకు మాత్రమే అగ్నిమాపక శాఖ ఎన్వోసీలు ఉన్నాయి. మెజార్టీ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ పంపింగ్ మోటార్లు, సంపులు లేవు. 50 శాతం ఆస్పత్రులు మాత్రమే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ లను కలిగి ఉన్నాయి. -
నిలువెత్తు నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి బ్యూరో/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ రమేశ్ ఆస్పత్రి.. హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదానికి కారణం యాజమాన్యం నిర్లక్ష్యం, కనీస భద్రతా చర్యలు లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. సోమవారం అధికారులు, పోలీసులతో కూడిన మూడు ప్రత్యేక బృందాలు స్వర్ణ ప్యాలెస్‌తో సహా రమేశ్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించాయి. నగరపాలక సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. భవన నిర్మాణం జరగకపోవడం, అధికంగా పేషెంట్లను చేర్చుకోవడం, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడం, తదితర లోపాలను తనిఖీ బృందాలు గుర్తించాయి. రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం ప్రమాదానికి కారణమని నిర్ధారిస్తూ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ కొడాలి రాజగోపాలరావు, స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ఇన్చార్జి, ఆస్పత్రి జీఎం డాక్టర్ కె.సుదర్శన్‌తోపాటు కోవిడ్ కేర్ సెంటర్ కోఆర్డినేటింగ్ మేనేజర్ పల్లెపోతు వెంకటేశ్‌లను విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా.. – ఐదు కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ఆస్పత్రి యాజమాన్యం అనుమతి కోరగా రెండు సెంటర్లకు మాత్రమే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అనుమతిచ్చారు. – కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చుతున్నందున అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంగా సూచనలు చేశారు. కానీ ఆస్పత్రి యాజమాన్యం వాటిని విస్మరించింది. – కోవిడ్ కేర్ సెంటర్లో శానిటైజర్లు ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ నిర్లక్ష్యంగా వదిలేయడంతో మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమైందని తనిఖీ బృందాలు గుర్తించాయి. స్వర్ణ ప్యాలెస్‌లో లోపాలెన్నో... – ఏలూరు రోడ్డులో 1984లో ఎస్వీ (శ్రీ వెంకటేశ్వర) ఎస్టేట్స్ పేరుతో భవన నిర్మాణానికి యాజమాన్యం విజయవాడ నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు.. భవన నిర్మాణ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని నాటి కార్పొరేషన్æ కమిషనర్ తిరస్కరించారు. అదనపు అంతస్తుల నిర్మాణం, పార్కింగ్, సెల్లార్ వంటి విభాగాల్లో పూర్తిగా డీవియేషన్లు ఉన్నాయని ప్లాన్ అనుమతిని పెండింగ్‌లో పెట్టారు. 1989లో అనుమతి లభించింది. – రెసిడెన్షియల్ భవనానికి అనుమతులు పొందిన స్వర్ణ ప్యాలెస్.. హోటల్ కేటగిరిలో వ్యాపారం నిర్వహిస్తోంది. – ఇలాంటివి నిర్వహించేటప్పుడు ప్రమాదం సంభవిస్తే తప్పించుకుని బయటకు వెళ్లేందుకు రెండు మార్గాలు ఉండాలి. కానీ ఒక మార్గమే ఉంది. – ఎమర్జెన్సీ లైట్లు కూడా లేవు. – అగ్నిప్రమాదాలు సంభవిస్తే ఆర్పేందుకు ఏర్పాట్లూ, డేంజరస్ అండ్ అఫెన్సివ్ ట్రేడ్ లైసెన్స్, తదితరాలు కూడా లేవు. – నాలుగు అంతస్తుల నిర్మాణానికి అనుమతి ఉండగా ఐదు అంతస్తులు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేక బృందాల తనిఖీలతో.. – విజయవాడలో రమేశ్ ఆస్పత్రికి చెందిన సిద్ధార్థ నగర్, లబ్బీపేట బ్రాంచ్ ఆసుపత్రులు, ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న స్వర్ణ హైట్స్, స్వర్ణ ప్యాలెస్ హోటల్లో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో సోమవారం జాయింట్ కలెక్టర్ శివశంకర్, ఏసీపీ సూర్యచంద్రరావు నేతృత్వంలోని మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. – తనిఖీల్లో పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, పేషెంట్ల రికార్డులు స్వాధీనం చేసుకున్నాయి. కోవిడ్ పేషెంట్ల వివరాలు, వారికి అందిస్తున్న వైద్యం, అందుకు వసూలు చేస్తున్న ఫీజులు తదితరాలపై ఆరా తీశాయి. – ఈ తనిఖీల్లో ఆస్పత్రి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మంది పేషెంట్లను చేర్చుకొని వారి నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేలింది. – స్వర్ణ ప్యాలెస్ యజమాని ముత్తవరపు శ్రీనివాసబాబు ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. – స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాద స్థలాన్ని జేసీ శివశంకర్ నేతృత్వంలోని బృందం పరిశీలించింది. ముఖ్యంగా హోటల్లో సంరక్షణ చర్యలు ఉన్నాయా? కోవిడ్ నిబంధనలు పాటించారా? ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి? అనే అంశాలపై విచారణ జరిపి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. -
విచారణకు రెండు కమిటీలు
సాక్షి, అమరావతి/వన్‌టౌన్ (విజయవాడ (పశ్చిమ): విజయవాడలోని రమేష్ హాస్పిటల్ అనుబంధ కోవిడ్ సెంటర్లో అగ్నిప్రమాద ఘటనపై విచారణకు రెండు కమిటీలను నియమించామని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆస్పత్రికి అనుమతులు, ఇతర అంశాలపై విచారణకు ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్లతో ఒక కమిటీ, ప్రమాదానికి కారణాలపై ఇతర అధికారులతో మరో కమిటీని నియమించినట్లు చెప్పారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఈ రెండు కమిటీలను ఆదేశించామన్నారు. ఘటనా స్థలిని సందర్శించాక మంత్రులు.. మేకతోటి సుచరిత, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు, సంబంధిత అధికారులతో విజయవాడలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నాని ఆదివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఏమన్నారంటే.. ► రమేష్ ఆస్పత్రికి అనుబంధంగా హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లో ఆదివారం తెల్లవారుజామున 4.45 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారిని అగ్నిమాపక శాఖ సిబ్బంది కాపాడారు. ► ఆస్పత్రి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించాం. ఆస్పత్రిపై గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశాం. ► రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులపై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం. ► ఘటనకు కారణమైనవారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రులు మేకతోటి సుచరిత, వెలంపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఘటనపై జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. -
క్షణాల్లోనే రక్షణగా...
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలోని రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం వేకువజామున అగ్నిప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద విషయం తెలిసిన ఐదు నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని కేవలం 30 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానిక పోలీసులు, జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలతో కలిసి హోటల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించారు. వారు కరోనా రోగులని తెలిసినా ఏమాత్రం వెరవకుండా వారి ప్రాణాలను కాపాడారు. క్షతగాత్రులు, కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వారిని హుటాహుటిన బందర్ రోడ్డులో ఉన్న రమేశ్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది ► అగ్నిమాపక అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించి అరగంటలోనే మంటలను అదుపులోకి తెచ్చారు. ► అగ్నిమాపక శాఖ డీజీ స్వయంగా స్వర్ణ ప్యాలెస్‌కు చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి వెంటనే దర్యాప్తు చేపట్టారు. ► షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నప్పటికీ.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. వైద్య శాఖ అలర్ట్ ► ప్రమాదం విషయం తెలియగానే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ► ప్రమాదం జరిగిన కోవిడ్ సెంటర్లో ఎంత మంది రోగులు ఉన్నారు? ఏ ప్రాంతానికి చెందిన వారు? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వంటి వివరాలను రమేష్ ఆస్పత్రికి వెళ్లి తెలుసుకున్నారు. ► రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ అరుణకుమారితోపాటు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఐ.రమేష్, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ సంతోష్, డాక్టర్ చైతన్య తదితరులు ప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలెస్‌కు వెళ్లి వివరాలు సేకరించారు. మంత్రుల సందర్శన ► ప్రమాద విషయం తెలిసిన వెంటనే మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఘటన స్థలికి చేరుకున్నారు. ► మంత్రులు.. మేకతోటి సుచరిత, పేర్ని నాని, ఆళ్ల నాని, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కిటికీల అద్దాలు పగలకొట్టి.. ► తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకోవడం.. మెట్లు, లిఫ్ట్ మార్గం ద్వారా బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో భవనంలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. ఈలోగా ఘటన స్థలికి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర పోలీసు కమిషనర్ శ్రీనివాసులు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ► ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు, పోలీసులు కలిసి నిచ్చెన సాయంతో బాధితులను కిందికి దించారు. మూడు రూముల కిటికీ అద్దాలు పగులగొట్టి రోగులను రక్షించారు. -
మృత్యు కీలలు
ఆదివారం ఉదయం 4.45 గంటలు.. విజయవాడలో ఘోరం.. నగరంలోని స్వర్ణా ప్యాలెస్ హోటల్లో రమేష్ ఆస్పత్రి ఏర్పాటుచేసిన ప్రైవేట్ కోవిడ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. మరికొద్దిసేపట్లో తెల్లవారుతుందనగా ఒక్కసారిగా అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. జీవితాలను చీకటిమయం చేశాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అక్కడివారందరినీ పొగ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక్కసారిగా హోటల్ అంతా హాహాకారాలు.. ప్రాణాలు దక్కించుకునేందుకు ఎవరికి వారు ఉరుకులు.. పరుగులు. ఈ ప్రయత్నంలో కొందరు హోటల్ పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు ఎటూ వెళ్లలేక నిస్సహాయ స్థితిలో ఆహుతయ్యారు. ఇలా మొత్తం 10 మంది బలయ్యారు. అగ్నిమాపక శాఖ క్షణాల్లో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చి భారీ నష్టాన్ని నిలువరించింది. సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చి మృతులకు రూ.50లక్షల పరిహారం ప్రకటించారు. ప్రధాని మోదీ కూడా ఈ సంఘటనపై సీఎంను ఆరా తీశారు. సాక్షి, అమరావతి బ్యూరో/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలవగా, మరో 18 మంది గాయపడ్డారు. నగరంలోని రమేష్ ఆస్పత్రి.. ఏలూరు రోడ్డులో ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో మొత్తం 43 మంది ఉన్నారు. వీరిలో 31 మంది కోవిడ్ బాధితులు. వీరు కాకుండా ఆరుగురు చొప్పున మొత్తం 12 మంది హోటల్, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. రిసెప్షన్లో ఉన్న పాత విద్యుత్ కేబుళ్ల నుంచి పొగలు వ్యాపించి మంటలు చెలరేగడమే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అరగంటలోనే మంటలను అదుపులోకి తేవడంతో పెనుముప్పు తప్పింది. పోలీసులు, జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్ఎఫ్) సత్వరమే స్పందించి బాధితులను రక్షించి గాయపడ్డవారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, ఆళ్ల నాని, పేర్ని నాని, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఘటనా స్థలిని సందర్శించి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో మృతిచెందినవారికి సర్కార్ రూ.50 లక్షల చొప్పున భారీ పరిహారం ప్రకటించింది. ప్రధాని మోదీ.. సీఎం వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ సెంట్రల్ కార్యాలయ తహసీల్దార్ జయశ్రీ ఫిర్యాదు మేరకు గవర్నర్‌పేట పోలీసులు రమేష్ ఆస్పత్రి యాజమాన్యం, హోటల్ యాజమాన్యంపై 304(2), 308 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనా స్థలం నుంచి బాధితురాలిని తరలిస్తున్న సహాయక సిబ్బంది ప్రమాదం జరిగిందిలా.. ► హోటల్ స్వర్ణ ప్యాలెస్ మొత్తం ఐదంతస్తుల్లో ఉంది. నాలుగు అంతస్తుల్లో రూములు ఉండగా, ఐదో అంతస్తులో మీటింగ్ హాల్ ఉంది. లాక్‌డౌన్‌తో మార్చి 24 నుంచి జూలై 17 వరకు హోటల్ మూతపడి ఉంది. జూలై 18 నుంచి రమేష్ ఆస్పత్రి ఈ హోటల్లో ప్రైవేటు కోవిడ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. హోటల్లో మొత్తం 45 గదులు ఉండగా ఇందులో 30 గదుల్లో ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. ► హోటల్ రిసెప్షన్ పక్కనే భవనానికి సంబంధించిన మొత్తం విద్యుత్ పరికరాలకు చెందిన కరెంట్ బోర్డ్ ఉంది. ► తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు పాత విద్యుత్ కేబుళ్ల నుంచి పొగలు వ్యాపించి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రిసెప్షన్లో మంటలు చెలరేగాయి. దీంతో రిసెప్షన్ కాలిపోయింది. రోజూ హోటల్‌ను శానిటైజ్ చేస్తుండటంతో మంటలు సులువుగా పై అంతస్తులకు వ్యాపించాయి. ► గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు వరకు దట్టంగా మంటలు వ్యాపించాయి. రెండు, మూడో అంతస్తుల్లోకి పొగ చేరింది. గాయపడ్డవారు వివిధ ఆస్పత్రులకు తరలింపు ► ఘటనలో పది మంది మృతి చెందగా, మిగిలిన రోగులు సురక్షితంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ► గాయపడ్డవారిలో ఐదుగురిని రమేష్ ఆస్పత్రికి, మరో ఐదుగురిని ఎమ్5 హోటల్లోని కోవిడ్ కేర్ సెంటర్‌కు, ఇద్దరిని స్వర్ణ హైట్స్ కోవిడ్ కేర్ సెంటర్‌కు, ఒకరిని వైబ్రెంట్ హోటల్‌కి, ఇద్దరిని మెట్రోపాలిటన్కు, ఒకరిని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. ► మరో ఐదుగురు ఇళ్లకు వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. ► రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరికి శరీరం కాలిన గాయాలైనట్లు చెబుతున్నారు. అయితే వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలిలోనే మృతులకు కరోనా పరీక్షలు.. ► విజయవాడ అగ్నిప్రమాద మృతులకు యాంటీజెన్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. ► 10 మందిలో ఎనిమిది మందికి కరోనా నెగిటివ్ రాగా.. ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ► పాజిటివ్‌గా తేలిన రెండు మృతదేహాలను ప్రత్యేక జాగ్రత్తలతో అధికారులు తరలించారు. జేసీ శివశంకర్ నేతృత్వంలో విచారణ కమిటీ ► ప్రమాద ఘటనపై విచారణకు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ నేతృత్వంలో కమిటీని నియమిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ► కమిటీలో విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి.గీతాబాయ్, ఆర్ఎఫ్వో టి.ఉదయకుమార్, సీపీడీసీఎల్ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ► ప్రమాదానికి దారితీసిన కారణాలు, పరిస్థితులతోపాటు భద్రతా నిబంధనలు, ఆస్పత్రి నిర్వహణలో లోపాలు, వసూలు చేసిన అధిక ఫీజుల ఆరోపణలపై దృష్టి సారించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ► కాగా, ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు ఆదివారం సాయంత్రం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నుంచి ఒక బృందం వచ్చి ఆధారాలు సేకరించింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చాకే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బాధితుల హాహాకారాలు.. ► అగ్నిప్రమాదాన్ని గుర్తించిన కరోనా రోగులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ► మరికొందరు పొగ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ రక్షించాలని కిటికీల్లోంచి కేకలు వేశారు. ► ప్రాణభయంతో ఒకటో అంతస్తు నుంచి నలుగురు వ్యక్తులు హోటల్ పక్కన ఉన్న సందులోకి దూకి ప్రాణాలతో బయట పడ్డారు. మూడో అంతస్తు నుంచి ఇద్దరు రోగులు వెనుక వైపునకు దూకడంతో మృత్యువాత పడ్డారు. ► ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాధితులను భవనంలోని మెట్ల మార్గం ద్వారా తీసుకురావడం కుదరకపోవడంతో కిటికీ అద్దాలను పగలగొట్టి నిచ్చెన సాయంతో కిందికి తీసుకొచ్చారు. -
విజయవాడ ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
-
రమేష్ ఆస్పత్రి ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు
-
20 ఏళ్లు..20 వేల గుండె ఆపరేషన్లు..
సాక్షి, విజయవాడ: ఇరవై వేల గుండె ఆపరేషన్లు నిర్వహించి విజయవాడ రమేష్ ఆసుపత్రి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. గురువారం ఆస్పత్రి యాజమాన్యం... 1,020 మంది పేషేంట్లను ఒకే వేదికపై సమావేశపరిచింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అధినేత డా.రమేష్, సినీ హీరో రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకోవడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న 3 వేల మంది సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమయిందన్నారు. 1996లో ఆసుపత్రి ప్రస్థానం ప్రారంభమయ్యిందని, ఈస్ట్ కోస్ట్ ఏరియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నామని తెలిపారు. విజయవాడను ప్రపంచ పటంలో నిలపాలన్నదే ధ్యేయం అని పేర్కొన్నారు. 20 సంవత్సరాల్లో 20 వేల గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. త్వరలో హార్ట్ ట్రాన్స్ప్లాన్టేషన్ (గుండె మార్పిడి) కూడా చేపట్టబోతున్నామన్నారు. నిబద్ధత,పారదర్శకత ద్వారానే ఈ స్థాయికి చేరామని తెలిపారు. -
రమేష్ ఆస్పత్రిలో డీఎంహెచ్‌వో తనిఖీలు
-
విజయవాడ రమేష్ ఆస్పత్రిలో తనిఖీలు
సాక్షి, విజయవాడ: నగరంలోని రమష్ ఆస్పత్రిలో శుక్రవారం డీఎంహెచ్‌వో (జిల్లా వైద్యఆరోగ్య శాఖ) ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వివిధ విభాగాల్లోని మెడికల్ పరికరాలను అధికారులు పరిశీలించారు. వివరాల్లోకి వెళితే.. పాయకరావుపేట రాజీవ్ నగర్‌కు చెందిన ఆసుల సీతామహాలక్ష్మి అనే మహిళకు జ్వరం రావడంతో ఆమె కుటుంబసభ్యులు గత ఏడాది ఆగస్ట్ 31న బందర్‌రోడ్‌లోని రమేష్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు స్వైన్ ఫ్లూ ఉందంటూ నివేదిక ఇచ్చారు. రెండు రోజుల అనంతరం కుటుంబసభ్యులు...మహిళను గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్చించారు. వైద్య పరీక్షల అనంతరం సీతా మహాలక్ష్మికి స్వైన్ ఫ్లూ లేదని ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చారు. జరిగిన తప్పిదంపై మహిళ కుటుంబీకులు అప్పట్లో రమేష్ ఆస్పత్రి సీఈవోను కలిసి ఈ ఘటనపై వివరణ అడిగారు. స్పైన్ ఫ్లూ ఉందని చికిత్స కోసం రూ.52 వేలు వసూలు చేశారని ప్రశ్నించగా, తాము చేయాల్సిన పని చేశామని తమ తప్పు లేదని సీఈవో చెప్పడంతో జరిగిన తప్పిదంపై బాధిత మహిళ కుటుంబసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే పోలీసులు కూడా స్పందించకపోవడంతో కమిషనర్‌ను కలిసి తమ ఆవేదన తెలిపారు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో తమకు సరైన వైద్యం చేయకుండా ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యం గా వ్యవహరించారని సీతామహాలక్ష్మి కుమారుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణకు ఆదేశించడంతో డీఎంహెచ్‌వో రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. -
ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్
-
ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్
విజయవాడ : గుండెకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందిగామ జెడ్పీటీసీ ప్రమీలారాణిని వైఎస్స్సార్ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్, ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రమీలారాణి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆమె రమేష్ ఆస్పత్రిలో చేరారు. ప్రమీలారాణిని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ చేబ్రోలు మండలం నుద్దపల్లికి బయలుదేరారు. అధికార నేతల అక్రమ క్వారీలను వ్యతిరేకిస్తూ మూడు రోజులుగా రైతులు చేస్తున్న దీక్షకు మద్దతిచ్చేందుకు ఆయన నుద్దపల్లికి వెళ్లారు. రైతుల దీక్షకు మద్దతు తెలుపుతూ వైఎస్ జగన్ కూడా ఈ దీక్షలో పాల్గొననున్నారు. -
మూడు రోజుల శిశువుకు బయోస్టెంట్
- గుంటూరు రమేశ్ ఆస్పత్రిలో విజయవంతం - ఆపరేషన్‌కు నాలుగు గంటల సమయం - దేశంలోనే తొలి కేసుగా వైద్యుల వెల్లడి గుంటూరు మెడికల్: దేశంలోనే మొట్టమొదటిసారిగా మూడు రోజుల శిశువుకు రక్తనాళాల్లో సహజంగా కరిగిపోయే బయో అబ్జార్బబుల్ స్టెంట్‌ను గుంటూరు రమేశ్ హాస్పటల్లో అమర్చారు. శనివారం గుంటూరు రమేశ్ ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీరామకాలనీకి చెందిన హనుమంతు, రేవతిలకు తొలి సంతానంగా జన్మించిన మగబిడ్డకు పుట్టుకతోనే గుండెజబ్బు వచ్చింది. స్థానిక వైద్యులు వైద్యపరీక్షలు చేసి గుంటూరు రమేశ్ ఆస్పత్రికి పంపారు. ఈనెల 12న ప్రముఖ శిశువైద్య గుండె నిపుణుడు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వైద్యపరీక్షలు చేసి గుండెకు రక్తం సరఫరా చేసే బృహత్ధమనిలో సమస్య ఏర్పడినట్లు గుర్తించారు. దీనివల్ల గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం సన్నబడి హృదయ స్పందనలు తగ్గిపోవడం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పల్స్రేట్ పడిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆ మూడురోజుల మగబిడ్డకు ఈనెల 13న ఆపరేషన్ చేసి రక్తనాళంలో సహజంగా కరిగిపోయే బయో అబ్జార్బబుల్ స్టెంట్‌ను విజయవంతంగా అమర్చినట్లు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి చెప్పారు. ఇలా చేయడం దేశంలోనే తొలికేసు అని వెల్లడించారు. స్టెంట్ అమర్చి రక్తప్రసరణ సాఫీగా జరిగేటట్లు చేయడం ద్వారా శిశువు ప్రాణాలు కాపాడగలిగామన్నారు. ఆపరేషన్ చేసేందుకు నాలుగు గంటల సమయం పట్టిందని, ఆపరేషన్ ప్రక్రియలో తనతో పాటు వైద్యులు నాగ హరిత, జ్యోతిప్రకాశ్రెడ్డి, విజయసింగ్పాటిల్, రాజావిశ్వనాథ్ పాల్గొన్నట్లు చెప్పారు. శిశువు తల్లిదండ్రులు పేదవారవడంతో రూ. రెండు లక్షల ఖరీదు చేసే స్టెంట్‌ను డాక్టర్ రమేశ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అమర్చామన్నారు. రెండురోజుల్లో శిశువును ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. సకాలంలో వైద్యపరీక్షలు చేసి ఉచితంగా స్టెంట్ అమర్చి తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన వైద్యులకు, రమేశ్ ఆస్పత్రి యాజమాన్యానికి తల్లిదండ్రులు హనుమంతు, రేవతి కృతజ్ఙతలు తెలిపారు. సమావేశంలో ఆస్పత్రి పరిపాలనాధికారి డాక్టర్ కిశోర్, కార్డియాలజిస్టు డాక్టర్ నాగ హరిత తదితరులు పాల్గొన్నారు.