మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఆళ్ల నాని. చిత్రంలో మంత్రులు పేర్ని నాని, సుచరిత, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ మోపిదేవి
సాక్షి, అమరావతి/వన్‌టౌన్ (విజయవాడ (పశ్చిమ): విజయవాడలోని రమేష్ హాస్పిటల్ అనుబంధ కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాద ఘటనపై విచారణకు రెండు కమిటీలను నియమించామని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆస్పత్రికి అనుమతులు, ఇతర అంశాలపై విచారణకు ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌లతో ఒక కమిటీ, ప్రమాదానికి కారణాలపై ఇతర అధికారులతో మరో కమిటీని నియమించినట్లు చెప్పారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఈ రెండు కమిటీలను ఆదేశించామన్నారు. ఘటనా స్థలిని సందర్శించాక మంత్రులు.. మేకతోటి సుచరిత, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు, సంబంధిత అధికారులతో విజయవాడలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నాని ఆదివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఏమన్నారంటే..
► రమేష్ ఆస్పత్రికి అనుబంధంగా హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున 4.45 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారిని అగ్నిమాపక శాఖ సిబ్బంది కాపాడారు.
► ఆస్పత్రి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించాం. ఆస్పత్రిపై గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశాం.
► రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులపై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం.
► ఘటనకు కారణమైనవారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రులు మేకతోటి సుచరిత, వెలంపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఘటనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment