
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో రమేష్ ఆస్పత్రి.. స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో నిర్వహిస్తున్న ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి కారణాలు వెలికి తీసే పనిలో అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులతోపాటు ఇతర విభాగాల అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.
► ఇప్పటికే విద్యుత్, అగ్నిమాపక, పురపాలక, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు రెండు రోజులపాటు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలను విశ్లేషించారు.
► బుధవారం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) డైరెక్టర్ నేతృత్వంలో ఇద్దరు అధికారుల బృందం స్వర్ణ ప్యాలెస్‌లోని ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్‌ను క్షుణ్నంగా శోధించింది.
► అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతాలను పరిశీలించి.. కాలిపోయిన పరికరాలను తమ వెంట తీసుకెళ్లింది.
► ప్రమాదం ఎలక్ట్రిక్ పరికరాల వల్ల జరిగిందా? కెమికల్ వల్లా? లేక మరేతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో అధికారుల బృందం పరిశీలించింది.
► సేకరించిన ఆధారాలను ల్యాబ్‌లో పరీక్షించాకే అసలు విషయం వెలుగులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
► కాగా, 10 మంది మృతికి కారణమైన హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసబాబు, రమేశ్ హాస్పిటల్స్ యజమాని రమేశ్‌బాబు పరారీలోనే ఉన్నారు.
► వారిద్దరిని పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నట్లు సౌత్‌జోన్ ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు.