
మూడు రోజుల శిశువుకు బయోస్టెంట్
- గుంటూరు రమేశ్ ఆస్పత్రిలో విజయవంతం
- ఆపరేషన్‌కు నాలుగు గంటల సమయం
- దేశంలోనే తొలి కేసుగా వైద్యుల వెల్లడి
గుంటూరు మెడికల్: దేశంలోనే మొట్టమొదటిసారిగా మూడు రోజుల శిశువుకు రక్తనాళాల్లో సహజంగా కరిగిపోయే బయో అబ్జార్బబుల్ స్టెంట్‌ను గుంటూరు రమేశ్ హాస్పటల్‌లో అమర్చారు. శనివారం గుంటూరు రమేశ్ ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీరామకాలనీకి చెందిన హనుమంతు, రేవతిలకు తొలి సంతానంగా జన్మించిన మగబిడ్డకు పుట్టుకతోనే గుండెజబ్బు వచ్చింది. స్థానిక వైద్యులు వైద్యపరీక్షలు చేసి గుంటూరు రమేశ్ ఆస్పత్రికి పంపారు. ఈనెల 12న ప్రముఖ శిశువైద్య గుండె నిపుణుడు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వైద్యపరీక్షలు చేసి గుండెకు రక్తం సరఫరా చేసే బృహత్‌ధమనిలో సమస్య ఏర్పడినట్లు గుర్తించారు.
దీనివల్ల గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం సన్నబడి హృదయ స్పందనలు తగ్గిపోవడం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పల్స్‌రేట్ పడిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆ మూడురోజుల మగబిడ్డకు ఈనెల 13న ఆపరేషన్ చేసి రక్తనాళంలో సహజంగా కరిగిపోయే బయో అబ్జార్బబుల్ స్టెంట్‌ను విజయవంతంగా అమర్చినట్లు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి చెప్పారు. ఇలా చేయడం దేశంలోనే తొలికేసు అని వెల్లడించారు. స్టెంట్ అమర్చి రక్తప్రసరణ సాఫీగా జరిగేటట్లు చేయడం ద్వారా శిశువు ప్రాణాలు కాపాడగలిగామన్నారు. ఆపరేషన్ చేసేందుకు నాలుగు గంటల సమయం పట్టిందని, ఆపరేషన్ ప్రక్రియలో తనతో పాటు వైద్యులు నాగ హరిత, జ్యోతిప్రకాశ్‌రెడ్డి, విజయసింగ్‌పాటిల్, రాజావిశ్వనాథ్ పాల్గొన్నట్లు చెప్పారు. శిశువు తల్లిదండ్రులు పేదవారవడంతో రూ.
రెండు లక్షల ఖరీదు చేసే స్టెంట్‌ను డాక్టర్ రమేశ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అమర్చామన్నారు. రెండురోజుల్లో శిశువును ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. సకాలంలో వైద్యపరీక్షలు చేసి ఉచితంగా స్టెంట్ అమర్చి తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన వైద్యులకు, రమేశ్ ఆస్పత్రి యాజమాన్యానికి తల్లిదండ్రులు హనుమంతు, రేవతి కృతజ్ఙతలు తెలిపారు. సమావేశంలో ఆస్పత్రి పరిపాలనాధికారి డాక్టర్ కిశోర్, కార్డియాలజిస్టు డాక్టర్ నాగ హరిత తదితరులు పాల్గొన్నారు.