సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడలోని రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్‌లో కనీస వైద్య ప్రమాణాలు పాటించనందున ఏకంగా పది మంది చనిపోతే దర్యాప్తు చేయొద్దని, ఆపేయాలని హైకోర్టు ఆదేశించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో నిరాటంకంగా దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది. దర్యాప్తునకు ప్రతివాది పూర్తిగా సహకరించాల్సిందేనని చెప్పింది. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే కోవిడ్ కేర్ సెంటర్‌లో ప్రమాదం జరిగిందన్న వాదనలను పరిగణనలోకి తీసుకుంది. దర్యాప్తు నిలిపివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోని పేరా 20పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
- ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతుండగా ఆస్పత్రి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తులో తదుపరి చర్యలన్నీ నిలిపి వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
- సోమవారం ఈ పిటిషన్‌ను జస్టిస్ రోహింటన్ ఫాలీనారీమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ప్రభుత్వ న్యాయవాది మెహఫూజ్ ఎ.నజ్కీ వాదనలు వినిపించారు.
- ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 5 రోజులలోపు దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం సమర్థనీయం కాదని ముకుల్ రోహత్గీ వాదించారు. ఆస్పత్రి నిర్వహణపై 161 మంది సాక్షుల ప్రత్యక్ష ఆరోపణలు ఉన్నాయని, నిందితులు పరారీలో ఉన్నారని, విచారణకు సహకరించ లేదని నివేదించారు.
- ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాదులు శ్యామ్ దివాన్, కె.వి.విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారం హైకోర్టు విచారణలో ఉందని, దీనిపై మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే వెలువడినందున ఆ ఉత్తర్వుల్లో జోక్యం తగదని వాదించారు.
- మరింత సమగ్రంగా వాదనలు వినిపిస్తానని ప్రతివాది తరపు న్యాయవాది శ్యామ్ దివాన్ నివేదించగా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. “వాదనలన్నీ వినిపించాక మళ్లీ సమగ్రంగా వినిపిస్తామంటున్నారు. సీనియర్ న్యాయవాదిగా మీ నుంచి ఈ అభ్యర్థనను ఊహించలేదు..’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శ్యామ్‌దివాన్ క్షమాపణలు కోరారు.
- ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులను అదుపులోకి తీసుకోరాదని, దర్యాప్తునకు ప్రతివాది సహకరించాలని షరతు విధించింది. ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ అంశంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టుకు స్వేచ్ఛ ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment