
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో పదిమంది కరోనా బాధితుల మృతికి కారణమైన రమేష్ ఆస్పత్రి యాజమాన్యం నిర్వాకంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆస్పత్రి భాగస్వామ్యసంస్థలను కూడా విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు రమేష్ ఆస్పత్రిలో ప్రధాన వాటాదారుగా ఉన్న ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ యాజమాన్యానికి 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. దుబాయ్ కేంద్రంగా ఆస్టర్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
రూ.250 కోట్ల పెట్టుబడులు!
► కేరళకు చెందిన డాక్టర్ అజాద్ మూపెన్ ఫౌండర్ చైర్మన్, ఎండీగా దుబాయ్‌లో 1987లో ‘ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్’ సంస్థను ప్రారంభించారు. రమేష్ హాస్పిటల్స్‌లో 51 శాతం వాటా కింద ఆస్టర్ సుమారు రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒంగోలు, గుంటూరు, విజయవాడలోని ఆస్పత్రుల్లో ఈ సంస్థకు వాటాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రమేష్ హాస్పిటల్స్ వాటాదారైన ‘ఆస్టర్’ సంస్థకు కూడా నోటీసులు జారీ చేసి వివరాలు సేకరిస్తామని ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు.
మూడు రాష్ట్రాల్లో గాలింపు..
► ఘటన అనంతరం రమేష్ హాస్పిటల్ సీవోవో, జీఎం, మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రి అధినేత డాక్టర్ రమేష్‌బాబు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా అప్పటికే పరారైనట్లు గుర్తించారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసబాబు సైతం పరారు కావడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment