సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బలహీన వర్గాలు నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రలపైనా పెత్తందార్ల పెద్ద రామోజీరావు విషం చిమ్మారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో సాధించిన అభివృద్ధికి సూచికగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ యాత్రలు విఫలమవుతున్నాయంటూ అసత్యాలను అచ్చేస్తున్నారు. సామాజిక సాధికార సభలకు ఊరూ వాడా జనం వెల్లువలా వస్తున్నా, సభలు జనసంద్రాన్ని తలపిస్తున్నా ఆ వాస్తవాన్ని దాచిపెట్టి, సభ ప్రారంభానికి ముందో, ముగిసిన తర్వాతో ఖాళీగా ఉన్న నాలుగు కుర్చీల ఫొటోలు తీసి, వాటినే అచ్చేసి, అదే నిజమనేలా పాఠకులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
అణగారిన వర్గాల కార్యక్రమాల మీదా ఇలా విషం చిమ్మడం ఇదేమి పైశాచికత్వం? బడుగు, బలహీనవర్గాలకు జరుగుతున్న మేలును హుందాగా స్వీకరించలేరా? పెత్తందారీ పోకడలకు ఫుల్‌స్టాప్ పెట్టలేరా? పచ్చ మెదళ్లు ఇక బాగుపడవా? సీఎం వైఎస్ జగన్ బడుగు, బలహీనవర్గాలకు ఉచితంగా స్థలాలు, ఇళ్లు ఇస్తుంటే మనసొప్పదు. బడుగు వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే జీర్ణించుకోలేరు. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు పింఛను కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వారున్న చోటుకే వెళ్లి ఇస్తుంటే చూడలేరు.. బడుగు, బలహీన వర్గాలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, పిల్లలు, విద్యార్థులు.. ఎవరికి ఏ మేలు జరిగినా కోర్టులో కేసులు వేసో, మరో మార్గంలోనో అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పది తలలతో విషం చిమ్ముతున్నారు.
బడుగు, బలహీనవర్గాలకు అందాల్సిన ప్రయోజనాలు కూడా పెత్తందార్ల జేబుల్లోకే వెళ్లాలన్న తీరులో వ్యవహరిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధిస్తే తమ పప్పులు ఉడకవని వణుకుతున్నారు. అందుకే నిత్యం తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారు. అయినా సీఎం వైఎస్ జగన్ సంకల్పం ముందు వారి ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. బడుగు, బలహీనవర్గాలకు పథకాలు, ప్రయోజనాలు ఆగడంలేదు. పెత్తందార్లపై పేదల విజయానికి సూచికగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికార యాత్రలు నిర్వహిస్తున్నారు. తమ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.
ప్రత్యక్షంగా జరుగుతున్నదీ కనిపించదా?
రాష్ట్రంలో అక్టోబర్ 26న ప్రారంభమైన సామాజిక సాధికార యాత్రలు అన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయి. నియోజకవర్గమే వాటి పరిధి. శనివారం వరకూ మూడు ప్రాంతాల్లో 43 నియోజకవర్గాల్లో జరిగాయి. ఈ యాత్రలో భాగంగా నిర్వహించే సభకు ఆ నియోజకవర్గం ప్రజలే హాజరవుతారు. సభల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నేతలే ప్రసంగిస్తారు. పేదల విజయాన్ని ప్రతిఫలిస్తూ ప్రతి సభకూ వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటిదాకా పూర్తయిన 43 నియోజకవర్గాల్లో సుమారు 13 లక్షల మంది పేదలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ సాధించిన సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించారు.
తమ కుటుంబం, గ్రామం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం సమగ్రాభివృద్ధి కోసం జగనే రావాలి.. జగనే కావాలి అంటూ నినదించారు. ఇవన్నీ బహిరంగ సభలే. ప్రతి సభకూ ప్రత్యక్ష ప్రసారం లింక్‌ను కూడా వైఎస్సార్‌సీపీ అందుబాటులో ఉంచింది. పలు ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారమూ చేశాయి. ఈ యాత్రల్లో బడుగు, బలహీన వర్గాలన్నీ ఒక్కటై.. జగన్నినాదమై సామాజిక సాధికారతను ప్రతిధ్వనిస్తున్నాయని సామాజిక మాధ్యమాలూ చాటిచెబుతున్నాయి. ఈ వాస్తవాన్ని మరుగున పరిచి అసత్యాలతో వార్తలు రాస్తే జనం నమ్ముతారనుకోవడం రామోజీ భ్రమే.
అన్నింటా అగ్రభాగం బలహీనవర్గాలకే
సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్లుగా సంక్షేమ పథకాల ద్వారా పేదలకు డీబీటీ రూపంలో రూ.2.40 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.70 లక్షల కోట్లు.. వెరసి రూ.4.10 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. ఈ లబ్ధిదారుల్లో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. ఇది ఆ వర్గాల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసింది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా, నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి సీఎం జగన్ అభివృద్ధి చేశారు. పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న సమున్నత లక్ష్యంతో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు.
రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా 2.07 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. అందులో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ పదవుల్లోనూ సింహభాగం ఆ వర్గాలకు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. వాటి ద్వారా ఆ వర్గాలు రాజకీయ సాధికారత సాధించాయి. ఆసరా, చేయూత వంటి పథకాలతోపాటు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మహిళా సాధికారతకూ మార్గం సుగమం చేశారు. ఇలా అన్ని వర్గాలూ అభివృద్ధి సాధించడాన్ని పెత్తందార్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
టీడీపీ–జనసేన పొత్తును చిత్తు చేస్తున్న జనం
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు లాక్కున్నప్పుడే ఆ పార్టీ పెత్తందార్ల పార్టీగా మారిపోయింది. పెత్తందార్ల నాయకుడు చంద్రబాబుకు దత్తపుత్రుడిగా పవన్ జనసేన పార్టీ ఏర్పాటు చేశారు. వీరిద్దరూ కలిసి పదేళ్లుగా అనేక నాటకాలు అడుతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు విజయం కోసం జనసేన పోటీ నుంచి తప్పుకొంది. చంద్రబాబు వారిస్తే పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చామని జనసేన అధ్యక్షుడు పవనే పలుమార్లు చెప్పారు. అప్పట్లో 650 హామీలతో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో అమలు పూచీ నాది అంటూ పవన్ నమ్మబలికారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కారు. వాటిపై జనం నిలదీస్తారన్న భయంతో మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్ నుంచి మాయం చేయించారు. చంద్రబాబు చేసిన మోసాలను పవన్ ఎన్నడూ నిలదీయలేదు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు వామపక్షాలు, బీఎస్పీలతో కలిసి పవన్ పోటీకి దిగారు. ఇక రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటం ద్వారా చంద్రబాబును అధికారంలోకి తేవడానికి టీడీపీ–జనసేన కలిసి పోటీ చేస్తాయని పవనే ప్రకటించారు.
ఆ తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో అంటూ వారిద్దరూ మరో నాటకానికి తెరతీశారు. అయితే, ప్రజలు వారిని నమ్మడంలేదు. వారి నాటకాలు రక్తికట్టడంలేదు. ఇది టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్రలకు బడుగు, బలహీన వర్గాలు బ్రహ్మరథం పడుతున్నాయి. ఇది టీడీపీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపడానికే సామాజిక సాధికార యాత్రలు వెలవెలబోతున్నాయంటూ రామోజీరావు తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment