సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రం సర్వనాశనమైనా అంతా బాగున్నట్లు చిత్రీకరించే రామోజీరావు.. సీఎం వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం వృద్ధి చెందుతున్నా.. తిరోగమనంలో ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తూ తన కడుపుమంట చల్లార్చుకుంటున్నారు.
రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రాకపోతే వృద్ధిలేదు, స్థిరాస్తి రంగం దెబ్బతిందని ఆయన పత్రికలో చాటింపు చేస్తూ.. అదే ఆదాయం పెరిగితే మార్కెట్ విలువలను పెంచడంవల్లే ఆదాయం పెరిగినట్లుగా వక్రీకరిస్తూ తన వక్రబుద్ధి చాటుకున్నారు. స్థిరాస్తి రంగం వృద్ధి చెందడంవల్లే ఆదాయం పెరిగిందని రాయడానికి ఈనాడుకు మనసొప్పదు.. చేతులూ రావు. ఎందుకంటే సీఎం కుర్చీలో తన ఆత్మబంధువు చంద్రబాబు లేరు కాబట్టి.
వినూత్న చర్యలతో పెరిగిన ఆదాయం
నిజానికి.. కొత్త జిల్లాల ఏర్పాటు, రిజిస్ట్రేషన్ల శాఖ వినూత్న మార్పులతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా పెరిగింది. అయినా ఆ ఘనత ప్రభుత్వానికి ఇవ్వడం మానేసి ప్రభుత్వాన్ని అపహాస్యం చేసేలా కార్టూన్ వేసి ఈనాడు రామోజీ తన కుసంస్కారాన్ని ప్రదర్శించారు. మార్కెట్ విలువల్ని పెంచడంవల్లే ఆదాయం పెరిగిందన్న అడ్డగోలు వాదనకు దిగారు. రిజిస్ట్రేషన్ రేట్లు పెంపును శాస్త్రీయంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో కాకుండా 19 శాతం గ్రామాల్లో మాత్రమే చేపట్టిన విషయం తెలిసి కూడా ఆ పత్రిక దాచిపెట్టింది.
చంద్రబాబు హయాంలో అన్ని గ్రామాలు, పట్టణాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువను పెంచారు. అదే సమయంలో చుక్కల భూములు, షరతుగల భూములు, ఈనాం భూములు వంటి లక్షలాది ఎకరాల భూములపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడంతో అవన్నీ మార్కెట్‌లోకి రావడంతో ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు పెరిగి రిజిస్ట్రేషన్లు పెరిగాయి.
2014–15లో 13.70 లక్షల రిజిస్ట్రేషన్లు జరగ్గా 2022–23లో 26.25 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్రంలో పెరిగిన ఆర్థిక వృద్ధి, రియల్ ఎస్టేట్ పెరగడంవల్లే రిజిస్ట్రేషన్లలో ఈ పెరుగుదల సాధ్యమైందనేది సుస్పష్టం. అందుకనుగుణంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా పెరిగింది. కానీ, ఈ విషయాన్ని పక్కనపెట్టి తన పైత్యం, ద్వంద విధానంతో ప్రజలను మభ్య పెట్టేందుకు చార్జీలు పెంచేశారని ఈనాడు అడ్డగోలుగా రాసిపారేసింది.
ప్రజలకు సౌకర్యంగా రిజిస్ట్రేషన్ సేవలు..
నిజానికి రిజిస్ట్రేషన్ల శాఖ వైఎస్ జగన్ హయాంలో అత్యంత ఆధునికతను సంతరించుకుంది. కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత సౌకర్యవంతం చేసింది. ఇందులో ప్రజలే డాక్యుమెంట్ తయారుచేసుకునే అవకాశాన్ని కల్పించింది.
రిజిస్ట్రేషన్ కోసం టైం స్లాట్ బుక్‌చేసే విధానాన్ని తీసుకొచ్చింది. ఈ–స్టాంపింగ్ విధానంవల్ల పెద్దఎత్తున మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులవల్ల ఆదాయం పెరగడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. కానీ, దానికి వక్రభాష్యం చెబుతూ చేతికొచ్చింది రాసేసి తన పెన్నుకు బుర్రలేదని రామోజీ చాటుకున్నారు.
మార్కెట్ విలువలపై పచ్చి అబద్ధాలు
జగన్ పాలనలో తొమ్మిదిసార్లు మార్కెట్ విలువలు పెంచినట్లు పచ్చి అబద్ధాలు రాసింది. వాస్తవానికి ఐదేళ్లలో ఐదుసార్లు మార్కెట్ విలువల్ని సవరించాల్సి వున్నా కేవలం రెండు సాధారణ సవరణలు మాత్రమే చేసింది. మరో మూడుసార్లు ప్రత్యేక రివిజన్‌ను కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేసింది. 90 శాతం గ్రామాల్లో ఈ ఐదేళ్లలో ఒక్కసారి మాత్రమే మార్కెట్ రేట్ల సవరణ జరిగింది. అదే చంద్రబాబు హయాంలో అర్బన్ ప్రాంతంలో ఐదుసార్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడుసార్లు మార్కెట్ విలువల్ని సవరించారు. ఈ వాస్తవాలకు మసిపూసి ఈనాడు వంకర రాతలు రాసింది.
ఇక్కడిలా.. తెలంగాణలో మరోలా..
జనవరి 30, 2023 తెలంగాణ ఎడిషన్‌లో ఇదే ఈనాడు ‘తరిగిపోయిన స్థిరాస్తి కల’ అని రాసింది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా వృద్ధి చెందుతోందని, ఏపీలో పెరగడంలేదని అప్పట్లో అడ్డగోలు రాతలు రాసింది. కానీ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా మరో కొత్త వితండ వాదాన్ని ఎత్తుకుంది.
తెలంగాణలో 2015–16లో రూ.3,786 కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం వస్తే, ఏపీలో 3,585.12 కోట్ల ఆదాయం వచ్చిందని, 2021–22 నాటికి తెలంగాణలో రూ.12,429 కోట్లు ఆదాయం రాగా ఏపీలో రూ.7,345.38 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని అప్పట్లో శోకాలు పెట్టింది. అలాగే, 2019–20లో ఏపీలో రూ.4,886.65 కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం ఉండగా, 2022–23 నాటికి రూ.8,079 కోట్ల ఆదాయం పెరిగిందని అదే ఈనాడు రాసింది.
Comments
Please login to add a commentAdd a comment